అనుమతులు లేకుండానే వ్యాపారాలు
ABN, Publish Date - Jan 20 , 2025 | 01:27 AM
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో కొన్ని వాపార సంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండానే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నిర్మాణ అనుమతులు లేకుండానే పెట్రోల్ బంక్‌లు నిర్మించి దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తున్నారు.
రామగుండంలో పది పెట్రోల్ బంక్‌లకు నిర్మాణ అనుమతుల్లేవు..
అనుమతి లేని వాణిజ్య సంస్థలపై కార్పొరేషన్ కొరడా
తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రయోగం
మూడు పెట్రోల్ బంక్‌లు, 14రెస్టారెంట్లకు నోటీసులు
ఇప్పటికే 8 ఫంక్షన్ హాల్స్‌కు పెనాల్టీ నోటీసులు
కోల్‌సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో కొన్ని వాపార సంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండానే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నిర్మాణ అనుమతులు లేకుండానే పెట్రోల్ బంక్‌లు నిర్మించి దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తున్నారు. కార్పొరేషన్‌కు కోట్ల రూపాయల ఫీజులను ఎగ్గొడుతున్నారు. ఇటీవల అనుమతి లేని ఫంక్షన్‌హాల్స్‌కు నోటీసులు ఇచ్చిన కార్పొరేషన్ ఇప్పుడు పెట్రోల్ బంక్‌లు, మాల్స్, రెస్టారెంట్లపై దృష్టి పెట్టింది. అనుమతి లేని నిర్మాణాల్లో వ్యాపారం చేస్తున్న సంస్థలపై తెలంగాణ మున్సిపల్ చట్టం 2019ని ప్రయోగిస్తోంది. ఈ మేరకు పెనాల్టీ నోటీసులు జారీ చేసింది.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 14పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. వీటితో పాటు ఎన్‌టీపీసీ, సింగరేణి సంస్థల అవసరాలకు ప్రత్యేకంగా బంక్‌లు ఉన్నాయి. సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, కేశోరాం పరిశ్రమలకు ప్రతి రోజు వేల సంఖ్యలో ట్రాన్స్‌పోర్ట్ వాహనాల వినియోగం ఉంటుంది. ఇక్కడి సింగరేణి ఉత్పత్తి అవసరాలు, పరిశ్రమల అసరాలకు ప్రతిరోజు వేల లీటర్ల డీజిల్, పెట్రోల్ వినియోగిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో 2.5లక్షల జనాభా ఉంది. బంక్‌ల్లో కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంది. సాధారణంగా పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు సమయంలో వివిధ రకాల అనుమతులు తీసుకుంటారు. ఇందులో మున్సిపల్ అనుమతి తీసుకున్న తరువాతే నిర్మాణం జరపాల్సి ఉంటుంది. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలనుకునే వారు ముందుగా ఆయా పెట్రోలియం సంస్థలకు దరఖాస్తు చేసుకుంటారు. ఐవోసీ, హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్ తదితర ప్రభుత్వరంగ సంస్థలకు డీలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులకు డీలర్‌షిప్‌కు సంబంధించి అంగీకార పత్రాలను ఆయా సంస్థలు ఇస్తాయి. తరువాత పోలీస్, ఫైర్, రెవెన్యూ ఇతర విభాగాల నుంచి ఎన్‌వోసీతో పాటు ఆయా బంక్‌లు నెలకొల్పే ప్రాంతాల్లో స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో కలెక్టర్లు, పోలీస్ కమిషనరేట్‌లు ఉన్న ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్లకు సంబంధిత పత్రాలను ఆయా సంస్థలు పంపుతారు. అన్ని ఎన్‌వోసీలతో పాటు స్థానిక సంస్థల అనుమతి పత్రాలు ఉన్న తరువాతే కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు బంకుల ఏర్పాటుకు క్లియరెన్స్ ఇస్తారు.
మూడు పెట్రోల్ బంక్‌కు పెనాల్టీ నోటీసులు
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణ అనుమతులు లేకుండానే వ్యాపారులు పెట్రోల్ బంక్‌లను నిర్వహిస్తున్నారు. కేవలం ట్రేడ్ లైసెన్స్‌లు, ఎన్‌వోసీలు తీసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన ఎల్‌ఆర్‌ఎస్, ఇతర నిర్మాణ అనుమతుల రుసుములను పెద్దఎత్తున ఎగ్గొడుతున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు పెట్రోల్ బంక్‌లకు నగరపాలక సంస్థ పెనాల్టీ నోటీసులు జారీ చేసింది. కార్పొరేషన్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్ అరుణశ్రీ గత నెల30న కలెక్టర్ ఆదేశానుసారం తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం పెట్రోల్ బంక్‌లకు పెనాల్టీ నోటీసులు జారీచేశారు. సంతోషీమాత ఆటో సర్వీస్(ఇండియన్ ఆయిల్) రూ.14.78లక్షలు, లేపాక్షి ట్రాన్స్‌పోర్టు(హెచ్‌పీ) రూ.38.5లక్షలు, హర ఫిల్లింగ్ స్టేషన్ రూ.19.36 చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. వీటితో పాటు కార్పొరేషన్‌లోని మరిన్ని బంక్‌లకు నోటీసులు జారీ అయ్యాయి.
మొన్న ఫంక్షన్‌హాళ్లు... నేడు పెట్రోల్ బంక్‌లు, రెస్టారెంట్లు
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ నిర్మాణ అనుమతులు లేకుండా వ్యాపారాలు సాగిస్తున్న వాణిజ్య సంస్థలపై దృష్టి పెట్టిన కార్పొరేషన్ ఈ మేరకు విచారణ జరుపుతోంది. ఇప్పటికే గత నెలలో 8ఫంక్షన్‌హాల్స్‌కు పెనాల్టీ నోటీసులు ఇచ్చింది. ఒక్కో ఫంక్షన్‌హాల్ విస్తీర్ణం బట్టి రూ.35లక్షల నుంచి రూ.84లక్షల వరకు ఈ పెనాల్టీలు జారీ అయ్యాయి. సుమారు రూ.5కోట్లు పెనాల్టీ ఫీజు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు పెట్రోల్ బంక్‌లకు పెనాల్టీ నోటీసులు జారీ అయ్యాయి. మూడు బంక్‌లకు పెనాల్టీ నోటీసులు జారీ చేసిన కార్పొరేషన్ ఇతర బంక్‌లకు కూడా నోటీసులు ఇచ్చింది. కేవలం మూడు బంకులకు మాత్రమే అనుమతులు ఉన్నట్టు వ్యాపారులు పత్రాలు సమర్పించినట్టు తెలుస్తుంది. వీటితో పాటు కార్పొరేషన్ పరిధిలోని 13 రెస్టారెంట్‌లకు నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా ఎన్‌టీపీసీ పరిధిలోని రెస్టారెంట్‌లలో నిర్మాణం అనుమతులకు సంబంధం లేకుండా భవనాలు నిర్మించి రెస్టారెంట్లు నిర్వహిస్తున్నట్టు కార్పొరేషన్ గుర్తించింది. ఈ రెస్టారెంట్ల భవన యజమానుల సమాధానాలను బట్టి పెనాల్టీలు జారీ అయ్యే అవకాశం ఉంది.
Updated Date - Jan 20 , 2025 | 01:28 AM