‘వెలుగు’లకు బకాయిల భారం
ABN, Publish Date - Jan 23 , 2025 | 01:45 AM
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) వెలుగులను పంచుతూ దేశంలోనే సహకార రంగంలో అగ్రగామిగా నిలిచింది. ఇప్పుడు ఆ సంస్థకు బకాయిల భారం గుదిబండగా మారింది. దీంతో కరెంట్ బకాయిల వసూలుపై పాలకవర్గం దృష్టి సారించింది. తాజాగా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాల కరెంట్ కనెక్షన్లను కూడా తొలగించి మళ్లీ పునరుద్ధరించారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) వెలుగులను పంచుతూ దేశంలోనే సహకార రంగంలో అగ్రగామిగా నిలిచింది. ఇప్పుడు ఆ సంస్థకు బకాయిల భారం గుదిబండగా మారింది. దీంతో కరెంట్ బకాయిల వసూలుపై పాలకవర్గం దృష్టి సారించింది. తాజాగా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాల కరెంట్ కనెక్షన్లను కూడా తొలగించి మళ్లీ పునరుద్ధరించారు. సామాన్యులు బిల్లు చెల్లించకపోతే గడువు దాటిపోతే కనెక్షన్ తొలగిస్తారు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకుంటే మాత్రం ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో సెస్ సంస్థ ఉండిపోయింది. ప్రభుత్వం, ఇతర విభాగాల నుంచి సిరిసిల్ల సెస్‌కు రావాల్సిన బకాయిలు అక్షరాలా రూ.797.05 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఆయా శాఖలకు నిధులు రాక, విద్యుత్ బిల్లుల చెల్లింపులు భారంగానే మారాయని తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన పథకాలకు సంబంధించిన బకాయిలు కూడా రావడం లేదు. గత ప్రభుత్వ హయాం నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన వారే పాలకవర్గంగా ఉన్నారు. దీంతో సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరాల సంఘం(సెస్)కు రావాల్సిన బకాయిలు, సెస్ చెల్లించాల్సిన బకాయిలపై చర్చ లేకుండానే సాగిపోయింది. కొత్త ప్రభుత్వం రావడంతో విదుత్ బకాయిల చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు మరమగ్గాలకు రావాల్సిన విద్యుత్ సబ్సిడీ పేరుకుపోగా, 10 హెచ్‌పీల వరకు రాయితీ ఉండగా, అంతకంటే ఎక్కువగా వినియోగిస్తున్న పారిశ్రామికులకు సంబంధించి కార్ఖానాలు ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల విద్యుత్‌కు సంబంధించి రూ.20.20 కోట్లు బిల్లులు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు పది హెచ్‌పీల రాయితీని 25 హెచ్‌పీల వరకు పెంచారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీకి సంబంధించిన పెంచుతున్నట్లుగా గెజిట్ రాలేదు. మరోవైపు ఇప్పటివరకు కొనసాగుతున్న 50 శాతం విద్యుత్ రాయితీకి సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.92 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఫ సెస్‌కు బకాయిల భారం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపడానికి 1970లో 420 సర్వీసులతో ప్రారంభమైన సహకార విద్యుత్ సరఫరా సంఘంలో ప్రస్తుతం 2 లక్షల 76 వేల 568 మంది సభ్యులు ఉన్నారు. గృహ కనెక్షన్లు 1,69,864, వాణిజ్య కనెక్షన్లు 20,297 కనెక్షన్లు, పరిశ్రమల కనెక్షన్లు 2,079, పవర్‌లూం కనెక్షన్లు 5,085, వ్యవసాయ కనెక్షన్లు 75,595, గ్రామపంచాయతీ వాటర్ కనెక్షన్లు, విద్యుత్ దీపాల 3,706 దేవాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వం కార్యాలయాల కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ రంగంలోనే ప్రత్యేకతను సాధించిన సెస్‌కు ప్రభుత్వం, వినియోగదారులు, వివిధ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు గుదిబండగా మారాయి. ప్రస్థుతం సెస్‌కు రూ.797.05 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో రెగ్యులర్‌గా వసూలు కావాల్సిన బిల్లులు రూ.162.26 కోట్లు ఉన్నాయి. సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు 50 శాతం సబ్సిడీ బకాయిలు రూ.92 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉండగా వీటికి సంబంధించిన నీటిసరఫరా, వీధి దీపాలకు సంబంధించి 31జూన్ 2020 నాటికి రూ.319.52 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇదే సందర్భంలో గత ప్రభుత్వం ఆ బకాయిలను పెండింగ్‌లోనే ఉంచి ఆర్థిక సంఘం నిధుల నుంచి రెగ్యులర్‌గా చెల్లించే విధంగా చర్యలు చేపట్టినా తరువాత మళ్లీ బకాయిలు చెల్లింపు నెమ్మదించిందని చెప్పుకోవచ్చు. సిరిసిల్ల వేములవాడ రెండు మున్సిపాలిటీలతో పాటు 260 గ్రామపంచాయతీల్లోనూ వీధి దీపాలు, నీటి కనెక్షన్లకు సంబంధించి తాజా బకాయిలు రూ.34.50 కోట్లకు చేరుకుంది. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దేవాలయాలు, 1049 ఉండగా, వీటికి సంబంధించి రూ.5.48 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. జిల్లాలో సెస్ వినియోగదారుల నుంచి వివిధ కనెక్షన్లకు సంబంధించి రూ.162 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. గృహాలకు సంబంధించి రూ.39.44 కోట్లు, కమర్షియల్‌కు సంబంధించి రూ.17.55 కోట్లు, పరిశ్రమలకు సంబంధించి రూ.40.81కోట్లు, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లకు సంబంధించి రూ.20.20 కోట్లు బకాయిలు ఉన్నాయి.
ఫ బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్..
- చిక్కాల రామారావు, సెస్ చైర్మన్
బకాయిలు వసూళ్లు చేపట్టాలని ఈఆర్‌సీ, ఎన్‌పీడీసీఎల్ సూచనల మేరకు బకాయిల వసూలుపై సూచనలు చేస్తుంది. దీని ప్రకారం పాత బకాయిల వసూలుపై స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. బకాయిలు సెస్‌కు భారంగా ఉన్నప్పటికి వినియోగదారులకు అందించే సేవల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగించడం లేదు. ఏరియర్స్‌కు సంబంధించిన బకాయిలు వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వినియోగదారులు బకాయిలు చెల్లించి సంస్థ అభివృద్ధికి దోహదపడాలి.
అన్ని కేటగిరీల ద్వారా రెగ్యులర్ బకాయిలు ఇలా...(లక్షల్లో)
మండలం బకాయిలు
సిరిసిల్ల 4974.30
వేములవాడ టౌన్ 1132.31
వేములవాడ రూరల్ 352.44
వేములవాడ అర్బన్ 590.69
చందుర్తి 410.38
కోనరావుపేట 854.40
బోయినపల్లి 1005.04
రుద్రంగి 103.41
ఎల్లారెడ్డిపేట 1530.14
గంభీరావుపేట 1178.91
ముస్తాబాద్ 1144.63
ఇల్లంతకుంట 1336.07
తంగళ్లపల్లి 1410.15
హైటెన్షన్ 203.59
----------------------------------------------------------------------------------
మొత్తం 16226.46
------------------------------------------------------------------------------------
Updated Date - Jan 23 , 2025 | 01:45 AM