Telangana Politics: బీఆర్‌ఎస్ స్కాంలను సీబీఐకిచ్చే దమ్ముందా?
ABN, Publish Date - Feb 25 , 2025 | 05:24 AM
బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ లేఖ రాస్తే.. ఆయా కేసుల్లో దోషులెవరైనా అరెస్ట్ చేసి జైల్లో వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా, న్యాయస్థానాల ఆదేశాలు లేకుండా.. సొంతంగా విచారణ జరిపే అధికారం సీబీఐకి లేదని గుర్తు చేశారు.
చీకటి ఒప్పందాలు మీరు చేసుకుని మాపై బురద జల్లుతారా?
సీఎం రేవంత్‌కు సంజయ్ కౌంటర్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ- రేస్, గొర్రెల స్కాం, కాళేశ్వరం, కేటీఆర్ బామ్మర్ది పార్టీలో డ్రగ్స్ దొరికిన కేసులను సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ లేఖ రాస్తే.. ఆయా కేసుల్లో దోషులెవరైనా అరెస్ట్ చేసి జైల్లో వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా, న్యాయస్థానాల ఆదేశాలు లేకుండా.. సొంతంగా విచారణ జరిపే అధికారం సీబీఐకి లేదని గుర్తు చేశారు. ఈ విషయం తెలిసీ.. సీఎం స్థాయి వ్యక్తి కేంద్రంపై బురద జల్లడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్, గొర్రెల స్కాంలపై రేవంత్ వ్యాఖ్యలు చూస్తే... ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారా? లేక మేమున్నామా? అనే సందేహం వస్తోంది.
అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఎందుకు అరెస్ట్ చేయలేదని కేంద్రాన్ని నిందిస్తుంటే నవ్వొస్తుంది. ట్యాపింగ్ కేసులో నిందితులైన ప్రభాకర్‌రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోతే... కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సహా సూత్రధారులు తెలంగాణలోనే ఉన్నారు కదా? అన్ని ఆధారాలున్నాయని చెబుతూ రాధాకిషన్‌రావు సహా కొందరు అధికారులను అరెస్ట్ చేసి 10నెలలు జైల్లో ఉంచిన మీరు.. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పైకి తిడుతున్నట్లుగా నటిస్తూ కేసీఆర్ కుటుంబంతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది మీరు కాదా? ఒకవైపు మీరు విచారణ చేస్తూ.. మమ్మల్ని అరెస్టు చేయమంటారా?’’ అని ప్రశ్నించారు.
ఓటమి భయంతో రేవంత్ అబద్ధాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతారని రేవంత్‌కు భయం పట్టుకుందని సంజయ్ అన్నారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ చేసిన ప్రసంగమంతా అబద్ధాలు, అర్ధ సత్యాలే. కాంగ్రెస్ ఓటమి ఖాయమనే భయం ఆయనలో కనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ సహా సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయి. కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందన్న నివేదికలతోనే సీఎం హడావుడిగా ప్రచారం ప్రారంభించారు. చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. రేవంత్ మాత్రం ఒకే రోజు 3 జిల్లాల్లో 3 మీటింగ్‌ల్లో పాల్గొన్నారు. డబ్బు, అధికారాన్ని ఉపయోగించి.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు.’ అని సంజయ్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 25 , 2025 | 05:24 AM