వీధివ్యాపారులకు ‘బల్దియా’ బాసట
ABN, Publish Date - Jan 20 , 2025 | 01:34 AM
నగరంలోని వీధి, చిరువ్యాపారులకు నగరపాలక సంస్థ బాసటగా నిలుస్తోంది. రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, ఇతర చిరువ్యాపారాలను చేసుకొని జీవిస్తున్న వారు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు వీలుగా స్ట్రీట్ వెండర్లను గుర్తిస్తోంది.
- వెయ్యి దుకాణాల నిర్మాణం
- నామమాత్రపు అద్దెతో కేటాయింపు
- ‘సీఎం స్వనిఽధి’ రుణాల మంజూరులో దేశంలోనే రెండోస్థానం
కరీంనగర్ టౌన్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): నగరంలోని వీధి, చిరువ్యాపారులకు నగరపాలక సంస్థ బాసటగా నిలుస్తోంది. రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, ఇతర చిరువ్యాపారాలను చేసుకొని జీవిస్తున్న వారు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు వీలుగా స్ట్రీట్ వెండర్లను గుర్తిస్తోంది. వారికి గుర్తింపు కార్డులను జారీ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమానికి బాటలు వేస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో రోడ్ల పక్కన వీధి, చిరువ్యాపారులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారి దుకాణాలను తొలగిస్తే చిరు వ్యాపారుల ఉపాధి దెబ్బతింటోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాల మేరకు స్ట్రీట్‌వెండర్స్ పథకాలను అమలు చేస్తోంది. రోడ్డు పక్కన వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు నామమాత్రపు అద్దెలతో శాశ్వత దుకాణాలను కేటాయించేందుకు నగరంలోని పలు చోట్ల వెయ్యి దుకాణాలను నగరపాలక సంస్థ నిర్మించింది. వాటిలో ఇప్పటికే కొన్ని దుకాణాలను నామమాత్రపు అద్దెలతో కేటాయించింది.
ఫ పలు చోట్ల షెడ్ల నిర్మాణం
పీఎం స్వనిధి పథకం కింద గుర్తింపుకార్డులు కలిగిన చిరు, వీధివ్యాపారులకు వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిస్తూ వారికి ఆర్థిక చేయూతనిస్తోంది. నగరపాలక సంస్థ పరిధిలో వీధి, చిరు వ్యాపారుల కోసం సివిల్ హాస్పిటల్ సమీపంలో 126 షెడ్లను నిర్మించి ఇటీవలనే డ్రా పద్దతిలో వ్యాపారులకు కేటాయించారు. శాతవాహన యూనివర్సిటీ సమీపంలో 25 దుకాణాలను, పద్మనగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో 215 మంది వీఽధి, చిరు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారి కోసం షెడ్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే వాటిని వ్యాపారులకు కేటాయించేందుకు టెండర్ ప్రకటన జారీ చేసింది. టవర్‌సర్కిల్ సమీపంలోని ప్రధాన కూరగాయల మార్కెట్, అన్నపూర్ణ కాంప్లెక్సు తదితర ప్రాంతాల్లోని వీధి, చిరు, పండ్లు, కూరగాయల వ్యాపారులకు కేటాయించేందుకు కలెక్టర్ బంగ్లా ముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో 250 షెడ్లు, దుకాణాలను నిర్మిస్తోంది. సప్తగిరికాలనీలో 50 మంది కూరగాయలు, చిరువ్యాపారుల కోసం షెడ్లను, చైతన్యపురిలో షెడ్లను నిర్మించింది. కశ్మీరుగడ్డ రైతు బజారు స్థానంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో వందకుపైగా దుకాణాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం నిర్మించిన వాటితో కలిపి వెయ్యి వరకు దుకాణాలను నిర్మిస్తోంది.
ఫ నగరంలో 12 వేల మంది చిరు వ్యాపారులు
నగరంలో 12వేల మందికిపైగా చిరు, వీధి, పండ్లు, కూరగాయల వ్యాపారులు స్ట్రీట్ వెండర్స్‌గా నగరపాలక సంస్థలో గుర్తింపు కార్డులను పొందారు. వీరితో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి స్ట్రీట్ వెండర్స్ కమిటీ రూపొందించి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు సంక్షేమ పథకాలు వారికి అందే విధంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా నాలుగేళ్ల నుంచి విడతల వారిగా వడ్డీ లేని రుణాలను బ్యాంకుల నుంచి మంజూరీ చేయిస్తోంది. మొదటి విడతలో 11,900 మంది చిరు వ్యాపారులకు 10వేల రూపాయలను వివిధ బ్యాంకుల నుంచి ఇప్పించింది. దీనితో మూడు లక్షల జనాభా కలిగిన నగరాల్లో అత్యధికంగా స్వనిధి రుణాలను మంజూరు చేయడంలో కరీంనగర్ అగ్రస్థానంలో నిలిచింది. మొదటి విడత రుణాలను తీసుకొని తిరిగి రుణాలను సక్రమంగా చెల్లించిన వ్యాపారులకు రెండో విడతలో తొమ్మిది వేల మంది వరకు 20వేల రుణాలను ఇప్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు వేల మంది కి పిఎం స్వనిధి కింద రూ. 50 వేల వరకు రుణాలను ఇప్పించి దేశంలోనే రెండోస్థానంలో కరీంనగర్ నిలిచింది. ఇలా చిరు, వీధి వ్యాపారుల కోసం నగరపాలక సంస్థ అనేక కార్యక్రమాలను రూపొందిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది.
ఫవ్యాపారుల జీవన ప్రమాణాలుపెంచడమే లక్ష్యం
- మేయర్ యాదగిరి సునీల్‌రావు
నగరంలోని చిరు వ్యాపారులు గౌరవంగా జీవిస్తూ జీవన ప్రమాణాలు పెంచాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ పాలకవర్గం ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి అందించేందుకు కృషి చేస్తోంది. అద్దెల భారాన్ని తట్టుకోలేని చిరువ్యాపారులు నామమాత్రపు అద్దెలతో దుకాణాలను నడిపించుకొని జీవించేందుకు పలు చోట్ల శాశ్వత దుకాణాలను నిర్మించి, వాటిని పారదర్శకంగా టెండర్లలో కేటాయిస్తున్నాము. మరోవైపు వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంకర్లతో వారికి మొదటి విడతలో 10 వేల రూపాయలు, రెండో విడతలో 20వేల రూపాయలు, మూడో విడతలో 50 వేల రూపాయల రుణాలను ఇప్పించాం. రుణాల ఇప్పించడంలో దేశంలోనే కరీంనగర్ రెండో స్థానంలో నిలువడం గర్వంగా ఉంది. రుణాలను సద్వినియోగం చేసుకొని వాటిని ఎప్పటికప్పుడు చెల్లించి తిరిగి 50 వేల రూపాయల రుణాలను తీసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని వ్యాపారులకు సూచిస్తున్నాం.
పీఎం స్వనిధి రుణాల వివరాలు
----------------------------------------------
వ్యాపారులు తీసుకున్న మొత్తం (రూ.లు)
---------------------------------------------------------------
మొదటి విడత 11,900 10 వేలు
రెండో విడత 9,000 20 వేలు
మూడో విడత 3,000 50 వేలు
Updated Date - Jan 20 , 2025 | 01:34 AM