ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం

ABN, Publish Date - Feb 19 , 2025 | 01:20 AM

కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉండడమే కాకుండా సిట్టింగ్‌ స్థానం కావడంతో దానిని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉండడమే కాకుండా సిట్టింగ్‌ స్థానం కావడంతో దానిని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేయడానికి పలువురు ఆసక్తి చూపించినా ఆ పార్టీ అధిష్టానవర్గం చివరకు ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వి.నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఆరుగురు ఎంపీలు, 42 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నారు. 23 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు. ఈ పరిధిలో 12 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నా బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలుపలేదు. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసి గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నది. 2019లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 17 మంది పోటీలో ఉండగా మాజీ మంత్రి టీ.జీవన్‌రెడ్డి 56,698 ఓట్లను సాధించి తొలి రౌండ్‌ లెక్కింపులోనే విజయం సాధించారు. 1,15,458 ఓట్లు పోల్‌ కాగా బీఆర్‌ఎస్‌కు చెందిన చంద్రశేఖర్‌గౌడ్‌కు 17,268, బీజేపీకి చెందిన సుగుణాకర్‌రావుకు 15,077, యువతెలంగాణ పార్టీకి చెందిన రాణి రుద్రమకు 5,192 ఓట్లు వచ్చాయి. 9,932 ఓట్లు చెల్లకుండా పోయాయి. అయితే ఈసారి ఈ నియోజకవర్గంపై దృష్టిసారించిన అభ్యర్థులు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఓటర్ల నమోదును సీరియస్‌గా తీసుకున్నారు. పోటాపోటీగా పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ప్రయత్నాలు చేయడంతో నియోజకవర్గ పరిధిలో 3,55,159 ఓట్లు నమోదయ్యాయి. వీటిలో 45శాతం ఓట్లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో 1,60,260 ఓట్లు ఉండడంతో అన్ని రాజకీయపార్టీలు కరీంనగర్‌ కేంద్రంగా చేసుకొని ప్రచారం కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీకి చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ తమతమ నియోజకవర్గాల్లోనే కాకుండా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించి ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను, పార్టీ నేతలను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేసి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇద్దరు ఎంపీలతోపాటు 23 మంది ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థి విజయం కోసం కృషిచేస్తున్నారు. అధికార పార్టీ అయి ఉండి సిట్టింగ్‌ స్థానంలో ఓడిపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని 42 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడి విజయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఊపును ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. పోలింగ్‌ బూత్‌లవారీగా ఉన్న ఓట్లను ప్రాతిపదికగా చేసుకొని ఒక ఇంచార్జిని నియమించడంతోపాటు ప్రతి 50 మంది ఓటర్లకు ఒక బాధ్యున్ని ఏర్పాటు చేసి ఆయన ద్వారానే ఓటర్లను కలిసే కార్యక్రమం చేపట్టాలని, ఓటర్లను మెప్పించి ఓటింగ్‌కు తీసుకవచ్చే బాధ్యతను ఆయా ఓటర్లు ఉన్న గ్రామ కాంగ్రెస్‌ నాయకులకు అప్పగించేందుకు పార్టీ నేతలు, అభ్యర్థి జాబితాను తయారు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈనెల 27న పోలింగ్‌ జరుగనుండగా ఈవారం రోజుల వ్యవధిలో ఓటర్లను రెండుసార్లు అయినా కలిసి సానుకూల ఓటింగ్‌ జరిగేలా చూసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రులు తమతమ జిల్లాల పరిధిలో వీడియో కాన్ఫరెన్సు ఏర్పాటు చేసి శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీకి వివిధ విభాగాలు చురుకుగా పనిచేసే అవకాశాలుండడంతో అదే స్థాయిలో ప్రయత్నాలు లేని పక్షంలో సానుకూల ఫలితాలను సాధించలేమని భావిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక కమిటీలపై ప్రత్యేక బాధ్యతలు ఉంచుతూ గెలుపు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - Feb 19 , 2025 | 01:20 AM