జాతరకు వేళాయె..
ABN, Publish Date - Feb 25 , 2025 | 11:38 PM
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం వేలాల జాతర ప్రారంభమై మూడురోజులపాటు జరగనుంది. శి
- నేడు వేలాల మల్లన్న జాతర
- పట్నాలు, బోనాలతో మొక్కులు
జైపూర్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం వేలాల జాతర ప్రారంభమై మూడురోజులపాటు జరగనుంది. శివరాత్రి రోజున గట్టు మల్లన్నకు భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించి నీటిని కొత్త కుండలో నింపుకుని గుట్టపైకి కాలినడకన తీసుకువెళ్లి బోనాలు వండి సమర్పిస్తారు. పట్నాలు చెల్లించి రాత్రిపూట జాగారం చేస్తారు. గుట్టపై ఉన్న చెలిమ నీటిని భక్తులకు ప్రసాదంగా పూజారులు అందజేస్తారు. రాత్రి ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పెద్ద పట్నం వేస్తారు. భక్తులు నైవేద్యాలు వండి బోనాలను సమర్పిస్తారు.
-జాతరకు ఏర్పాట్లు
మహాశివరాత్రిని పురస్కరించుకుని గుట్ట మల్లన్న, గట్టు మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల కోసం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. భక్తులు వెళ్లేందేకు క్యూలైన్‌లు, తాగునీటి సౌకర్యాలను కల్పించారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గుట్టపైన 50 సీసీ కెమెరాలను, డ్రోన్ కెమెరాలను పర్యవేక్షించనున్నట్లు ఏసీపీ తెలిపారు. అత్యవసర సమయాల్లో జైపూర్ ఏసీపీ 8712656548, శ్రీరాంపూర్ సీఐ 8712656549, జైపూర్ ఎస్‌ఐ 8712656551 లను సంప్రదించాలన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే భక్తులు జాతరకు రావడానికి మంఽథని, గోదావరిఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల నుంచి బస్సులను ఏర్పాటు చేశారు.
ముస్తాబైన బుగ్గ ఆలయం
బెల్లంపల్లిరూరల్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ సమీపంలో గల బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల కోసం క్యూలైన్లను, నీడ కోసం టెంట్లను, తాగునీరు తదితర సదుపాయాలను కల్పించారు. జాతరలో వైద్య శిబిరం వైద్య సిబ్బంది నిర్వహించనున్నారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.
- బుగ్గ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం..
కన్నాలలోని బుగ్గ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యేలు బుగ్గ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ సహకారంతో బుగ్గ రోడ్డు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకుని రోడ్డు నిర్మాణం పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్వేత, నాయకులు రాంచందర్, సూరిబాబు, మల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కత్తెరసాల మల్లికార్జునస్వామి ఆలయంలో..
చెన్నూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కత్తెరసాల మల్లికార్జునస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే జాతర ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్ధం క్యూలైన్‌ల కోసం బారీకేడ్లను ఏర్పాటు చేయగా, స్పెషల్, సర్శదర్శనానికి బారికేడ్లను నిర్మించారు. ఆలయం ఎదుట భక్తుల నీడ కోసం షామియనాలను ఏర్పాటు చేశారు. మంచినీటి కోసం తాత్కాలిక ట్యాంకులను ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఆలయం ప్రాంగణం నుంచి ప్రధాన రహదారి వరకు లైట్లను ఏర్పాటు చేశారు. బుధవారం జరిగే శివపార్వతుల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రవి పేర్కొన్నారు.
మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి
- ముస్తాబైన ఆలయాలు
- మంచిర్యాల గోదావరిలో స్నానాలకు ఏర్పాట్లు
- నీటిని మళ్లించిన అధికారులు
- పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు
మంచిర్యాల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చెన్నూర్‌లోని కత్తెరశాల ఆలయం, బెల్లంపల్లిలోని బుగ్గ ఆలయాలు శివరాత్రి వేడుకలు సిద్ధమయ్యాయి. జిల్లా కేంద్రంలోని గోదావరిలో శివరాత్రి పండుగను పుర స్కరించుకొని పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. గోదావరిలో మంచిర్యాల వైపు నీరు పూర్తిగా ఇంకిపోగా అవతలివైపు నీటి ప్రవాహం ఉంది. దీంతో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మంగళవారం నది పరిసరాలను పరిశీలించారు. ఎక్స్‌కావేటర్ల సాయంతో గోదావరిలో కాలువ తవ్వడం ద్వారా అటు వైపు ఉన్న నీటిని ఇవతలి ఒడ్డుకు తరలించారు. దీంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇక్కట్లు తొలగిపోయాయి. అలాగే గోదావరి ఒడ్డున పుష్కర ఘాటు వద్ద కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించే అవకాశం ఉండడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నల్లాలు ఏర్పాటు చేశారు. నదీ పరిసర ప్రాంతాలను మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేశారు. పుణ్య స్నానాలకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంచిర్యాలతో పాటు హాజీపూర్ మండలం ముల్కల్ల వద్ద గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తుల రాక సందర్భంగా జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో ప్రవేశ మార్గం వద్ద ద్వారాన్ని రంగులతో అలంకరించారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లతో రోడ్డుపై నీటిని చల్లుతూ దుమ్ము రేగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో బందో బస్తు చర్యలు చేపడుతున్నారు.
ముస్తాబైన గౌతమేశ్వర ఆలయం...
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గోదావరి ఒడ్డున గల గౌతమేశ్వర ఆలయం వేడుకలకు ముస్తాబైంది. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం గౌతమేశ్వర ఆలయంలోని శివుడు, నందీశ్వర విగ్రహాలను దర్శించుకోవడం ఆనవాయితి. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ పరిసరాలను శుభ్రం చేయించారు. ఆలయంలో రద్దీకి తగ్గట్టుగా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు.
నేడు శివునికి రుద్రాభిషేకం...
గోదావరి రోడ్డులో నూతనంగా నిర్మించిన మహా ప్రస్థానం ఆవరణలో ఉన్న శివుని విగ్రహానికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శివరాత్రి పండుగను పురస్కరించుకొని శివుని విగ్రహావిష్కరణతో పాటు సుమారు 30నుంచి 40 మంది వరకు వేదపండితులతో ఉదయం 6.30గంటలకు రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మహాప్రస్థానంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు శివుని దర్శనం చేసుకొనేలా ఏర్పాటు చేశారు. రుద్రాభిషేకం అనంతరం అక్కడికి విచ్చేసే భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా కొబ్బరి కాయలు, వివిధ వస్తువులు అమ్మే చిరువ్యాపారులు ఇప్పటికే దారి పొడవున స్టాళ్లు ఏర్పాటు చేశారు.
Updated Date - Feb 25 , 2025 | 11:38 PM