Kumaram Bheem Asifabad: అందని ఆయుర్వేద వైద్యం
ABN, Publish Date - Jan 08 , 2025 | 11:29 PM
బెజ్జూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్యసేవలు అందించిన మండల కేంద్రంలోని ఆయుర్వేద ఆస్పత్రి ఇప్పుడు నిరుపయోగంగా మారింది.
బెజ్జూరులోని ఆయుర్వేద వైద్యశాల
- విధులకు హాజరుకాని డాక్టర్
- పట్టించుకోని అధికారులు
బెజ్జూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్యసేవలు అందించిన మండల కేంద్రంలోని ఆయుర్వేద ఆస్పత్రి ఇప్పుడు నిరుపయోగంగా మారింది. ఇక్కడ పనిచేసే డాక్టర్ విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో గ్రామస్థులకు సరైన వైద్యసేవలు అందడం లేదు. ఆయుర్వేద ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గతంలో డిప్యుటేషన్‌పై ఇతర జిల్లాకు వెళ్లింది. ఆ గడువు పూర్తి అయినా నేటికీ ఆమె విధుల్లోకి రావడం లేదు. దీంతో ఆయుర్వేద ఆస్పత్రికి వస్తున్న రోగులు డాక్టర్ లేక వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. తరచూ సెలవుల పేరిట విధులకు ఎగనామం పెడుతుండటంతో ఇక్కడ సరైన ఆయర్వేద వైద్యం అందడం లేదు.
అధికారుల పర్యవేక్షణ కరువు..
మారుమూల గ్రామాల్లో ప్రజలకి ఇప్పటికీ ఆయుర్వేద వైద్యంపై నమ్మకం ఎక్కువ. ప్రస్తుతం ప్రజలు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతుండటంతో ఎక్కువగా ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముకుంటారు. ఇక్కడ పనిచేసిన డాక్టర్ గతంలో కొత్తగా వచ్చిన సమయంలో కొద్ది రోజులు విధులకు సక్రమంగానే హాజరవుతుండేదని, మెటర్నిటీ సెలవులో వెళ్లినప్పటి నుంచి పూర్తిగా విధులకు హాజరు కావడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత డిప్యుటేషన్‌పై సూర్యాపేటకు వెళ్లగా, ప్రభుత్వం డిప్యుటేషన్లు రద్దు చేయడంతో తిరిగి విధుల్లోకి చేరిన రోజే లాంగ్‌లివ్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామాల్లో వైద్యసేవలు అందక ప్రైవేటులో వైద్యసేవలు పొందుతున్నారు. అధికారులు సైతం ఈ విషయంపై పట్టింపులేనితనంగా వ్యవహరిస్తున్నారనేది మండలవాసులు ఆరోపణ. రెండేళ్ల నుంచి ఇక్కడ వైద్యసేవలు అందకపోవడంతో దీర్ఘకాలిక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డాక్టర్ రెగ్యులర్‌గా విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అందుబాటులో ఉండే వైద్యుడిని నియమిస్తాం..
- ప్రేమలాదేవి, ఆర్‌డీడీ, వరంగల్
బెజ్జూరులోని ఆయుర్వేద డాక్టర్ కొంతకాలంగా సెలవుపై ఉంది. త్వరలోనే అందుబాటులో ఉండే మరో డాక్టర్‌ను నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న డాక్టర్ తరచూ సెలవుపై ఎందుకు వెళ్తుందో తెలుసుకుంటాం. స్థానికంగా వైద్యసేవలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
Updated Date - Jan 08 , 2025 | 11:29 PM