Maoists: 16 మంది ఛత్తీస్‌గఢ్-ఒడిసా సరిహద్దుల్లో.. మావోయిస్టుల కాల్చివేత
ABN, Publish Date - Jan 22 , 2025 | 03:52 AM
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గరియాబంద్- ఒడిసాల్లోని నౌపాడ జిల్లాల పరిధిలోని కుల్హారిఘాట్ అడవుల్లో రెండ్రోజులుగా జరుగుతున్న భారీ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతిచెందారు. అయితే, మృతుల సంఖ్య 27గా ప్రచారం జరుగుతోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ అప్పారావు అలియాస్ జయరాంరెడ్డి ఉన్నారు.
మృతులు 27 అని కూడా ప్రచారం.. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి
ఈయన స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా.. చంద్రబాబుపై అలిపిరి దాడిలో సూత్రధారి
మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్, గుడ్డు, బాలన్న, నల్లగొండకు చెందిన హనుమంతు?
వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు.. నిఘా సమాచారంతో గరియాబంద్ దిగ్బంధం
వెయ్యి మంది జవాన్లు.. డ్రోన్లతో మావోయిస్టుల కదలికల గుర్తింపు.. 40 గంటల పైగా కాల్పులు
కొనసాగుతున్న ఎన్‌కౌంటర్.. గొప్ప విజయంగా అభివర్ణించిన కేంద్ర హోంశాఖ మంత్రి షా
చర్ల/చింతూరు/చుండూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గరియాబంద్- ఒడిసాల్లోని నౌపాడ జిల్లాల పరిధిలోని కుల్హారిఘాట్ అడవుల్లో రెండ్రోజులుగా జరుగుతున్న భారీ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతిచెందారు. అయితే, మృతుల సంఖ్య 27గా ప్రచారం జరుగుతోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ అప్పారావు అలియాస్ జయరాంరెడ్డి ఉన్నారు. ఆయన అసలు పేరు రామచంద్రారెడ్డిగారి ప్రతా్‌పరెడ్డి. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. అలిపిరిలో క్లైమోర్ మైన్ ఘటన మొదలు.. పలు దాడుల్లో చలపతిది కీలక పాత్ర. నిజానికి అబూజ్‌మఢ్‌ను కంచుకోటగా మలచుకున్న చలపతి, ఇతర అగ్రనాయకులు అక్కడ పోలీసుల ఎన్‌కౌంటర్లు పెరగడంతో గరియాబంద్‌ను సురక్షిత స్థావరంగా మలచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కుల్హారిఘాట్ రక్షిత అటవీ ప్రాంతంలో చలపతి, అతని అనుచరులు.. మొత్తం 60 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు నిఘావర్గాలు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో.. ఈ నెల 19వ తేదీ రాత్రి గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా, ఒడిసాలోని నౌపాడ ఎస్పీ గుండాల రాఘవేంద్ర, ఒడిసా నక్సల్స్ ఆపరేషన్ డీఐజీ అఖిలేశ్వర్‌సింగ్, కోబ్రా కమాండెంట్ డీఎస్ కథాటే నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు చెందిన సుమారు 1,000 మంది జవాన్లు రంగంలోకి దిగారు. ఒడిసా యాంటీ-నక్సల్స్ విభాగం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎ్‌సవోజీ)కి చెందిన 3 యూనిట్లు నాలుగు డ్రోన్ కెమెరాలతో అర్ధచంద్రాకారంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టగా.. మిగతా భాగాన్ని ఛత్తీస్‌గఢ్ డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు చక్రవ్యూహం మాదిరిగా దిగ్బంధనం చేశాయి. నక్సల్స్ ఎటూ తప్పించుకునే వీలులేకుండా ముందుకు సాగాయి.
పారిపోతున్న మావోయిస్టులను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపా యి. ఆ అడవి నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో ఐదు కి.మీ. దూరంలో డాగ్‌స్క్వాడ్స్‌ను మోహరించాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక.. నక్సల్స్ తారసపడడంతో కాల్పులు మొదలయ్యాయి. సోమవారం సాయంత్రానికి ఇద్దరు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా.. మంగళవారం ఉదయం వరకు 40 గంటల పాటు ఎన్‌కౌంటర్ కొనసాగింది. మంగళవారం సా యంత్రం కడపటి వార్తలందేసరికి కాల్పులు కొనసాగుతుండగా.. మృతిచెందిన నక్సల్స్ సంఖ్య 16గా పోలీసులు నిర్ధారించారు. రాయ్‌పూర్ ఐజీ అమ్రేశ్ మిశ్రా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమి టీ సభ్యుడు ఎం.జయరాంరెడ్డి అలియాస్ చలపతి(61) ఉన్నట్లు ఛత్తీ్‌సగఢ్ పోలీసులు నిర్ధారించారు. ఇతని తలపై రూ.కోటి రివార్డు ఉంది. కేంద్ర కమిటీకి చెందిన సభ్యులు మనోజ్, గుడ్డు, బాలన్నతోపాటు, చలపతి భార్య కూడా మృతిచెందారనే వార్తలు వస్తున్నా.. ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెం దిన పాక హనుమంతు అలియాస్ గణేశ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. మిగతా మృతదేహాలను గుర్తించాల్సి ఉందని వివరించారు. ఘటనాస్థలి నుంచి పెద్దఎత్తున ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్ వంటి తుపాకులు, మందుగుండు సామగ్రి, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒడిసా ఎస్‌వోజీ జవాను దామ్రు కాలికి, ఛత్తీస్‌గఢ్ జవాను ధర్మేంద్ర భోయ్ చేతికి తూటా గాయాలయ్యాయని, వారిని హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌లోని నారాయణ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
అలిపిరి ఘటన సూత్రధారి
చలపతి అసలు పేరు ఎం.జైరాం రెడ్డి. ఇతనికి రామచంద్రారెడ్డి, అప్పారావు, రాము అనే పేర్లున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మఠంపల్లి గ్రామం. పదో తరగతి వరకు చదువుకున్నారు. మదనపల్లెలో సెరికల్చర్ ఉద్యోగిగా పనిచేస్తూ.. విశాఖకు బదిలీ అయ్యారు. అక్కడే నక్సల్స్ ఉద్యమంవైపు ఆకర్షితుడయ్యారు. తొలుత చిత్తూరు జిల్లా అడవుల్లో ఉద్యమాన్ని విస్తరించగా.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అబూజ్‌మఢ్ కేంద్రంగా ఒడిసా రాష్ట్ర కమిటీకి పనిచేసేవారు. మావోయిస్టు పీఎల్‌జీఏ దళం ఒకటో బెటాలియన్ కమాండర్ మాడ్వీ హిడ్మాకు ఈయనే గురువు. ఏపీ సీఎం చంద్రబాబుపై 2003లో తిరుపతి అలిపిరిలో క్లైమోర్ మైన్‌తో జరిపిన దాడికి చలపతి సూత్రధారి. ఛత్తీస్‌గఢ్‌లోనూ పలు దాడుల్లో ఈయన పాత్ర కీలకం. 2010 బలిమెలలో పోలీసుల ఊచకోత, 2011లో ఒడిసాలోని మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణను అపహరించిన కేసు, 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య వెనక ఈయనే ప్రధాన సూత్రధారి అని చెబుతారు. అబూజ్‌మఢ్‌లోకి బలగాలు చొచ్చుకువస్తుండడంతో.. గరియాబంద్‌ను సురక్షిత స్థావరం(సే్‌ఫజోన్)గా మలచుకునే క్రమంలో బలగా లు ఈయన బృందాన్ని చుట్టుముట్టాయి. నిజానికి చలపతికి నిరంతరం ఏకే-47 ఆయుధాలు ధరించిన 9 మంది మావోయిస్టులు భద్రత కల్పిస్తారు. వీరిలో ఐదుగురు మహిళా నక్సల్స్- బస్తర్‌కు చెందిన అమల, చోటీ, నాని, దీప్న, రీనా ఉంటారు. మరో గార్డు సుఖ్‌రామ్ హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్‌తో.. చలపతిని కలిసేందుకు వచ్చే ఇతర మావోయిస్టులను తనిఖీ చేసేవారని తెలుస్తోంది. వయసు పైబడడంతో చలపతి రెండు కర్రల సాయంతో నడిచేవారని సమాచారం. మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌లో కూడా ఆయన మృతదేహం పక్కన రెండు కర్రలు ఉండడం గమనార్హం..! ఎన్‌కౌంటర్ మృతుల్లో సింహభాగం ఈయన అంగరక్షకులేనని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు.
ఇంగ్లిష్ నేర్పించే హనుమంతు!
ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్లుగా భావిస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన పాక హనుమంతు 42 ఏళ్ల క్రితం నక్సల్స్ ఉద్యమంలో చేరారు. నల్లగొండలో డిగ్రీ చదివే సమయంలోనే ర్యాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితుడయ్యారు. ఏబీవీపీ-ర్యాడికల్ విద్యార్థుల మధ్య 1982లో జరిగిన ఘర్షణలో ఇతనే ప్రధాన నిందితుడు కావడంతో.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన దళంలోనే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. మావోయిస్టులకు ఇంగ్లిష్, రాజనీతి శాస్త్రంలో పాఠాలు చెప్పేవాడని, పలు భాషలను అనువదించేవాడని సమాచారం. వాస్తవానికి ఐదేళ్ల క్రితమే హనుమంతు అనారోగ్యంతో మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. అయితే.. నెలక్రితం తాను బతికే ఉన్నట్లు బంధుమిత్రులకు సమాచారం ఇచ్చారు. అంతలోనే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. రెండేళ్ల క్రితం తండ్రి, ఇటీవల తల్లి మృతిచెందడంతో.. హనుమంతు నివసించిన గుడిసె ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఆయన ఇద్దరు సోదరులు నల్లగొండలో కూలీపనులు చేసుకుంటున్నారు. కాగా.. నల్లగొండ జిల్లాకే చెందిన మోడెం బాలకృష్ణ కూడా మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు ప్రచారం జరుగుతోంది.
2025లో వరుస దెబ్బలు
గత ఏడాది నుంచే మావోయిస్టు పార్టీ వైపు నష్టం పెరిగింది. 300 మందికిపైగా నక్సల్స్ హతమవ్వగా.. 450 అరెస్టులు, 850 లొంగుబాట్లు జరిగాయి. 2025 ఆరంభం నుంచే నక్సల్స్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నెల 5న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు, 15న బీమారంపాడు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది, తాజాగా గరియాబంద్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందారు. కాగా.. తాజా ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయి స్పందించారు. నక్సలైట్లు ఆఖరి శ్వాస తీసుకుంటున్నారని, ఇది బలగాల గొప్ప విజయమని అమిత్‌షా పేర్కొనగా.. భారీ ఆపరేషన్‌లో విజయం సాధించిన బలగాలను విష్ణుదేవ్ అభినందించారు. 2026 మార్చికల్లా ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం లేకుం డా చేస్తామని ఇరువురూ పునరుద్ఘాటించారు.
Updated Date - Jan 22 , 2025 | 06:59 AM