ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దుబాయ్‌లో ధూంధాం మనమే చాంపియన్స్

ABN, Publish Date - Mar 10 , 2025 | 04:15 AM

ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ విజేతగా నిలిచింది. ఆశించిన రీతిలోనే నలుగురు స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ (76), శ్రేయాస్‌ (48) నిలకడ చూపారు. దీంతో ఆదివారం...

డబ్ల్యూపీఎల్‌లో నేడు

ముంబై X గుజరాత్‌

రాత్రి 7.30 నుంచి, స్టార్‌ స్పోర్ట్స్‌లో

ప్రైజ్‌మనీ ;

భారత్‌కు - రూ. 19.4 కోట్లు

న్యూజిలాండ్‌కు - రూ. 9.7 కోట్లు

  • ఫైనల్లో కివీస్‌పై భారత్‌ విజయం

  • స్పిన్నర్ల విజృంభణ జూ సత్తా చాటిన రోహిత్‌

మూడోసారి ట్రోఫీ కైవసం

దుబాయ్‌: ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ విజేతగా నిలిచింది. ఆశించిన రీతిలోనే నలుగురు స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ (76), శ్రేయాస్‌ (48) నిలకడ చూపారు. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా 2000లో ఇదే టోర్నీ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది. అలాగే భారత్‌ ఖాతాలో ఇది మూడో (2002, 2013, 2025) చాంపియన్స్‌ ట్రోఫీ. మరోవైపు తాజా టోర్నీలో భారత్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలవడం విశేషం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌ (63), బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అర్ధసెంచరీలు సాధించగా రచిన్‌ (37), ఫిలిప్స్‌ (34) సహకారం అందించారు. కుల్దీప్‌, వరుణ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసి గెలిచింది. గిల్‌ (31), అక్షర్‌ (29) రాణించారు. స్పిన్నర్లు బ్రేస్‌వెల్‌, శాంట్నర్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా రోహిత్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా రచిన్‌ రవీంద్ర నిలిచారు.


శతక భాగస్వామ్యంతో..: ఓ మాదిరి ఛేదనలో భారత్‌కు మెరుపు ఆరంభమే దక్కింది. కానీ కివీస్‌ బౌలర్ల పోరాటంతో ఈ పోరు దాదాపు ఆఖరి ఓవర్‌ వరకు సాగి కాస్త ఉత్కంఠను రేకెత్తించింది. మొదటి నుంచీ రోహిత్‌ తన సహజశైలిలోనే చెలరేగాడు. ఈసారి చక్కగా క్రీజులో కుదురుకొని ఎక్కడా తగ్గకుండా బౌండరీలతో బెదరగొట్టాడు. గిల్‌కన్నా ఎక్కువగా తనే స్ట్రయికింగ్‌ తీసుకుంటూ స్కోరును పరిగెత్తించాడు. తొలి ఓవర్‌లోనే సిక్సర్‌ బాదిన అతడు రెండో ఓవర్‌లో రెండు ఫోర్లతో మరింత ఒత్తిడి పెంచాడు. ఇక ఎనిమిదో ఓవర్‌లో రోహిత్‌ 6,4,4తో 14 పరుగులు వచ్చాయి. ఈ జోరుతో హిట్‌మ్యాన్‌ ఫిఫ్టీ 41 బంతుల్లోనే పూర్తయ్యింది. అలాగే జట్టు స్కోరు 17 ఓవర్లలోనే 100 పరుగులకు చేరింది. కానీ ఈ దశలో కివీస్‌కు కాస్త ఊరట లభించింది. నిలకడగా సహకరిస్తున్న గిల్‌ను 19వ ఓవర్‌లో శాంట్నర్‌ అవుట్‌ చేశాడు. అతడి క్యాచ్‌ను ఎక్స్‌ట్రా కవర్‌లో ఫిలిప్స్‌ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో పట్టేయడం హైలైట్‌గా నిలిచింది. దీంతో తొలి వికెట్‌కు 105 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌లోనే విరాట్‌ (1)ను బ్రేస్‌వెల్‌ అవుట్‌ చేయడంతో స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. విరాట్‌ రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. రెండు వికెట్లు వేగంగా కోల్పోవడంతో జట్టు ఆటతీరులోనూ మార్పు కనిపించింది. బ్రేస్‌వెల్‌ పకడ్బందీ బంతులకు రోహిత్‌-శ్రేయాస్‌ అతి జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. ఓ దశలో 12 బంతుల్లో ఒక్క పరుగే రావడంతో ఓపిక నశించిన రోహిత్‌ రచిన్‌ ఓవర్‌లో ముందుకొచ్చి భారీషాట్‌ కొట్టే యత్నంలో స్టంపౌటయ్యాడు. అటు స్పిన్నర్లు మధ్య ఓవర్లలో కట్టడి చేయడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ ఆరు దాటింది. అక్షర్‌ సహాయంతో అడపాదడపా శ్రేయాస్‌ బౌండరీలు సాధించినా కివీస్‌ బౌలర్లదే పైచేయి అయ్యింది. ఈ దశలో జేమిసన్‌ అతడి సులువైన క్యాచ్‌ను వదిలేసినా... స్వల్ప వ్యవధిలోనే రచిన్‌ అద్భుత క్యాచ్‌కు శ్రేయాస్‌ వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికే ఈ జోడీ మధ్య నాలుగో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం సమకూరింది. మరోవైపు బ్రేస్‌వెల్‌ విసిరిన చివరి ఓవర్‌లో అనవసర షాట్‌కు వెళ్లి అక్షర్‌ పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో మ్యాచ్‌ నువ్వానేనా అన్న రీతికి చేరింది. అయుతే ఆఖర్లో రాహుల్‌కు జతగా హార్దిక్‌ (18) జోరు చూపాడు. 24 బంతుల్లో 21 రన్స్‌ కావాల్సిన వేళ హార్దిక్‌ ఓ సిక్స్‌, ఫోర్‌తో పరిస్థితి తేలిక చేశాడు. 48వ ఓవర్‌లో తను క్యాచ్‌ అవుటైనా అప్పటికే ఫలితం తేలిపోయింది. తర్వాతి ఓవర్‌లో ఓ ఫోర్‌తో జడేజా మ్యాచ్‌ను ముగించాడు.


కివీస్‌ జోరుకు స్పిన్నర్ల బ్రేక్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆరంభం, ముగింపుల్లో అదరగొట్టినా.. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్ల ధాటికి కుదేలైంది. లేదంటే 300 స్కోరు దాటేదే. అయితే ఫీల్డింగ్‌లో రోహిత్‌ సేన నాలుగు క్యాచ్‌లు జారవిడిచినా స్కోరు అతికష్టంగా 250కి చేరింది. చివర్లో బ్రేస్‌వెల్‌ వేగంగా ఆడాడు. సెమీ్‌సలో శతకం సాధించి ఊపుమీదున్న ఓపెనర్‌ రచిన్‌ కళ్లుచెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు. నాలుగో ఓవర్‌లో 6,4,4.. ఐదో ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో వణికించాడు. అతడికి యంగ్‌ (15) సహకరించడంతో స్కోరు 7 ఓవర్లలోనే 50 దాటింది. కానీ ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్పిన్నర్‌ వరుణ్‌ విడదీశాడు. యంగ్‌ను ఎల్బీ చేయడంతో తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక తొలి పవర్‌ప్లేలో 69/1 స్కోరుతో జోరు మీదున్న కివీ్‌సకు కుల్దీప్‌ తన వరుస ఓవర్లలో గట్టి ఝలక్‌ ఇచ్చాడు. ముందుగా ఓ గూగ్లీతో రచిన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయగా, తర్వాత వెటరన్‌ విలియమ్సన్‌ (11)ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. అక్కడి నుంచి స్పిన్నర్ల హవా ఆరంభం కావడంతో కివీస్‌ పరుగుల కోసం చెమటోడ్చింది. 15-26 ఓవర్ల మధ్య కనీసం ఫోర్‌ కూడా సాధించకపోగా లాథమ్‌ (14) వికెట్‌ను కూడా కోల్పోయింది. చివరకు 81 బంతుల తర్వాత ఫిలిప్స్‌ ఓ సిక్సర్‌తో మురిపించాడు. 38వ ఓవర్‌లో ఫిలి్‌ప్సను వరుణ్‌ బౌల్డ్‌ చేయడంతో మిచెల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వికెట్లు పడుతున్నా మిచెల్‌ మాత్రం ఓపికగా ఆడుతూ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 46వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాక అతను వెనుదిరిగినా, బ్రేస్‌వెల్‌ ధాటికి ఆఖరి ఐదు ఓవర్లలో జట్టు 50 రన్స్‌ రాబట్టడం విశేషం.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: యంగ్‌ (ఎల్బీ) వరుణ్‌ 15; రచిన్‌ (బి) కుల్దీప్‌ 37; విలియమ్సన్‌ (సి అండ్‌ బి) కుల్దీప్‌ 11; మిచెల్‌ (సి) రోహిత్‌ (బి) షమి 63; లాథమ్‌ (ఎల్బీ) జడేజా 14; ఫిలిప్స్‌ (బి) వరుణ్‌ 34; బ్రేస్‌వెల్‌ (నాటౌట్‌) 53; శాంట్నర్‌ (కోహ్లీ/రోహిత్‌-రనౌట్‌) 8; స్మిత్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 50 ఓవర్లలో 251/7. వికెట్ల పతనం: 1-57, 2-69, 3-75, 4-108, 5-165, 6-211, 7-239; బౌలింగ్‌: షమి 9-0-74-1; హార్దిక్‌ 3-0-30-0; వరుణ్‌ 10-0-45-2; కుల్దీప్‌ 10-0-40-2; అక్షర్‌ 8-0-29-0; జడేజా 10-0-30-1.

భారత్‌: రోహిత్‌ (స్టంప్‌-లాథమ్‌) (బి) రచిన్‌ 76; గిల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) శాంట్నర్‌ 31; విరాట్‌ (ఎల్బీ) బ్రేస్‌వెల్‌ 1; శ్రేయాస్‌ (సి) రచిన్‌ (బి) శాంట్నర్‌ 48; అక్షర్‌ (సి) ఓరౌర్కీ (బి) బ్రేస్‌వెల్‌ 29; రాహుల్‌ (నాటౌట్‌) 34; హార్దిక్‌ (సి అండ్‌ బి) జేమిసన్‌ 18; జడేజా (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 49 ఓవర్లలో 254/6; వికెట్ల పతనం: 1-105, 2-106, 3-122, 4-183, 5-203, 6-241.బౌలింగ్‌: జేమిసన్‌ 5-0-24-1; ఓరౌర్కీ 7-0-56-0; స్మిత్‌ 2-0-22-0; శాంట్నర్‌ 10-0-46-2; రచిన్‌ 10-1-47-1; బ్రేస్‌వెల్‌ 10-1-28-2; ఫిలిప్స్‌ 5-0-31-0.

గతేడాది టీ20 వరల్డ్‌కప్‌.. తాజాగా మన ఖాతాలో మరో ఐసీసీ టైటిల్‌. ఎప్పుడో పుష్కర కాలం కింద దక్కిన చాంపియన్స్‌ ట్రోఫీ (సీటీ) తిరిగి టీమిండియా గూటికి చేరింది. అజేయ ఆటతీరుతో, అన్ని విభాగాల్లోనూ అదరగొడుతూ వహ్‌వా అనిపించుకున్న రోహిత్‌ సేన మూడో సీటీని సగర్వంగా అందుకుంది. అయితే ప్రమాదకర న్యూజిలాండ్‌ ఫైనల్లో అంత సులువుగా పట్టు వీడలేదు. భారత స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు చేసింది 251 పరుగులే. ఛేదనలో రోహిత్‌ ధనాధన్‌ ఆటతీరుకు 17 ఓవర్లలోనే భారత్‌ స్కోరు 100కి చేరింది. ఈ దశలో సునాయాస విజయం ఖాయమనిపించినా.. మధ్య ఓవర్లలో పోటీలోకి వచ్చిన కివీస్‌ ఆటను రసవత్తరంగా మార్చింది. 31-40 ఓవర్ల మధ్య 55 పరుగులే ఇచ్చి గుబులు రేపింది. కానీ శ్రేయాస్‌, రాహుల్‌ సంయమన ఆటతీరు చూపారు. చివరికి జడేజా విన్నింగ్‌ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించిన భారత్‌.. కోట్లాది మంది అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.


వన్డే చరిత్రలో అత్యధికంగా 15 సార్లు వరుసగా టాస్‌ ఓడిన జట్టుగా భారత్‌. 2011-13 మధ్య నెదర్లాండ్స్‌ 11సార్లు వరుసగా టాస్‌ కోల్పోయింది.

1

చాంపియన్స్‌ ట్రోఫీ ఓ ఎడిషన్‌లో అత్యధిక స్కోరు సాధించిన కివీస్‌ ప్లేయర్‌గా రచిన్‌ రవీంద్ర. మొత్తం 263 పరుగులు చేసిన రచిన్‌.. 2017 టోర్నీలో విలియమ్సన్‌ 244 పరుగుల రికార్డును అధిగమించాడు. కాగా, ఓవరాల్‌గా ఓ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వెస్టిండీస్‌ బ్యాటర్‌ క్రిస్‌ గేల్‌ (474 పరుగులు) టాప్‌లో ఉన్నాడు.

2

భారత్‌ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా కోహ్లీ. మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్‌ 550 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, సచిన్‌ 664 మ్యాచ్‌లతో టాప్‌లో ఉన్నాడు. ఽ538 మ్యాచ్‌లతో ధోనీ, 509 మ్యాచ్‌లతో ద్రవిడ్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

2

చాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకొన్న రెండో భారత బౌలర్‌గా షమి. 9 ఓవర్లు బౌల్‌ చేసిన షమి 8.20 ఎకానమీతో 74 పరుగులిచ్చి.. ఓ వికెట్‌ పడగొట్టాడు. 2013 టోర్నీలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ 10 ఓవర్లలో 1/75 టాప్‌లో ఉన్నాడు.

5

టోర్నీలో ఎక్కువ జీవనదానాలు లభించిన ఆటగాడిగా రచిన్‌. అతడు ఐదుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొన్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌లోనే షమి, అయ్యర్‌ రెండుసార్లు రచిన్‌కు లైఫ్‌ ఇచ్చారు.

4

ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లను చేజార్చారు. ఓ నాకౌట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఇన్ని క్యాచ్‌లు వదిలేయడం చాలా అరుదు. రచిన్‌ ఇచ్చిన క్యాచ్‌లను షమి, అయ్యర్‌ నేలపాలు చేశారు. అయితే, అయ్యర్‌ క్యాచ్‌ను వదిలేసినప్పుడు స్టాండ్స్‌లో అనుష్క శర్మ రియాక్షన్‌ నెట్‌లో వైరల్‌గా మారింది. 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిచెల్‌ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను మిడ్‌వికెట్‌లో రోహిత్‌ అందుకోలేక పోయాడు. ఇక, ఫిలిప్స్‌ కొట్టిన క్యాచ్‌ను గిల్‌ చేజార్చాడు.

12

కెప్టెన్‌గా వన్డేల్లో రోహిత్‌ వరుసగా కోల్పోయిన టాస్‌లు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో హిట్‌మ్యాన్‌ చివరిసారి టాస్‌ గెలిచాడు. 1998-99 మధ్య వెస్టిండీస్‌ సారథి బ్రియాన్‌ లారా 12 సార్లు వరుసగా టాస్‌ ఓడాడు. ఈ రికార్డును రోహిత్‌ సమం చేశాడు.

కన్నీళ్లు పెట్టుకొన్న హెన్రీ..

గాయంతో ఫైనల్‌కు దూరమైన కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ కన్నీళ్లు పెట్టుకొన్నాడు. భుజం నొప్పితో అతడు బాధపడుతున్నాడు. మ్యాచ్‌ సమయానికి కోలుకొంటాడని భావించారు. కాగా, ఉదయం నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టులో హెన్రీ విఫలం కావడంతో అతడికి తుదిజట్టులో చోటుదక్కలేదు. దీంతో అతడు భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక పోయాడు.

రోహిత్‌కు కోహ్లీ సలహా

న్యూజిలాండ్‌ ఓపెనర్లు యంగ్‌, రచిన్‌ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పైగా ఏడో ఓవర్‌లో రచిన్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను షమి చేజార్చాడు. దీంతో రోహిత్‌ తీవ్ర అసహనానికి గురయ్యాడు. షమి చేతికి బంతి బలంగా తగలడంతో అతడు నొప్పితో విలవిల్లాడు. ఈ సమయంలో ఫిజియో చికిత్స చేస్తుండగా.. రోహిత్‌తో కోహ్లీ మాట్లాడుతూ కనిపించాడు. ఫీల్డింగ్‌లో మార్పుచేర్పులు చేయాలని సూచించాడు. ఆ తర్వాతి ఓవర్‌లో వరుణ్‌ను రంగంలోకి దించగా.. అతడు యంగ్‌ను ఎల్బీ చేసి జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు.

వరుణ్‌కు గాయం

కీలక సమయంలో యంగ్‌, ఫిలి్‌ప్సను అవుట్‌ చేసిన వరుణ్‌.. కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొన్నాడు. అయితే, మ్యాచ్‌ మధ్యలో అతడు కుంటుతూ కనిపించాడు. తన కోటా ఓవర్లు పూర్తి చేసుకొన్న తర్వాత కానీ అతడు మైదానం వీడలేదు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌లో తన కాలు నొప్పిగా ఉందని.. పెయిన్‌ కిల్లర్‌ తీసుకోవాలని వరుణ్‌ చెప్పాడు.

కళ్లు చెదిరే రీతిలో గిల్‌ క్యాచ్‌ను పట్టేసిన గ్లెన్‌ ఫిలిప్స్‌


అసాధారణం.. అపూర్వం..

చాంపియన్స్‌ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అసాధారణమైన ఆట.. అపూర్వమైన విజయం.. భారత క్రికెట్‌ జట్టు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గడం గర్వంగా ఉంది. టోర్నమెంట్‌ ఆద్యంతం అద్భుతంగా ఆడారు. మన ఆటగాళ్లకు అభినందనలు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఈ గెలుపుతో భారత జట్టులోని సభ్యులంతా కోట్లాది మంది హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేశారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

భారత జట్టు అమోఘమైన ఆటతీరుతో చాంపియన్‌గా నిలిచి మరోసారి సత్తా చాటింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

అద్భుతమైన విజయంతో భారత జట్టు మరోసారి మనల్ని గర్వపడేలా చేసింది. జట్టు చూపిన అంకితభావం, సాధించిన ఘనతకు అభినందనలు.

ఏపీ సీఎం చంద్రబాబు


దూకుడుగా ఆడాలనుకుంటా..

టోర్నీ ఆసాంతం మా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఇక దూకుడుగా ఆడడం నా నైజం కాదు. కానీ అలా ఆడాలని కోరుకునేవాణ్ణి. అయితే విభిన్నంగా ఆడాలంటే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోత్సాహం తప్పనిసరి. అప్పటి కోచ్‌ ద్రవిడ్‌, తాజాగా గంభీర్‌తోనూ ఇదే విషయం చర్చించి ఫలితం సాధించా. నేను వన్డేల నుంచి రిటైరవుతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కావు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

‘టాప్‌’లో నిలిపే వైదొలగాలి

ఇదో అద్భుత విజయం. ఆసీస్‌ టూర్‌లో దారుణ పరాభవం తర్వాత తిరిగి పుంజుకోవాలని గట్టిగా భావించాం. అందుకే చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ ప్రత్యేకమైంది. యువ ఆటగాళ్లతో నేనెక్కువగా మాట్లాడుతూ అనుభవాలను పంచుకుంటా. ఒకవేళ ఎవరైనా కెరీర్‌ నుంచి వైదొలిగితే జట్టును అత్యున్నత స్థానంలో నిలిపాకే వెళ్లాలి. ఇప్పుడు మా జట్టులో 8-10 ఏళ్ల కాలానికి ప్రపంచ క్రికెట్‌ను శాసించగల ఆటగాళ్లు ఉన్నారు.

-విరాట్‌ కోహ్లీ


ఐసీసీ ఫైనల్స్‌లో టీమిండియా

టోర్నీ స్థానం కెప్టెన్‌

1983 వన్డే వరల్డ్‌కప్‌ విజేత కపిల్‌ దేవ్‌

2000 చాంపియన్స్‌ ట్రోఫీ రన్నరప్‌ గంగూలీ

2002 చాంపియన్స్‌ ట్రోఫీ విజేత గంగూలీ

2003 వన్డే వరల్డ్‌కప్‌ రన్నరప్‌ గంగూలీ

2007 టీ20 వరల్డ్‌కప్‌ విజేత ధోనీ

2011 వన్డే వరల్డ్‌కప్‌ విజేత ధోనీ

2013 చాంపియన్స్‌ ట్రోఫీ విజేత ధోనీ

2014 టీ20 వరల్డ్‌ కప్‌ రన్నరప్‌ ధోనీ

2017 చాంపియన్స్‌ ట్రోఫీ రన్నరప్‌ కోహ్లీ

2021 వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప రన్నరప్‌ కోహ్లీ

2023 వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప రన్నరప్‌ రోహిత్‌

2023 వన్డే వరల్డ్‌కప్‌ రన్నరప్‌ రోహిత్‌

2024 టీ20 వరల్డ్‌కప్‌ విజేత రోహిత్‌

2025 చాంపియన్స్‌ ట్రోపీ విజేత రోహిత్‌

1

చాంపియన్స్‌ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌లో కూడా టాస్‌ నెగ్గకుండా టోర్నీ విజేతగా నిలిచిన ఏకైక జట్టుగా భారత్‌.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2025 | 05:45 AM