తిలక్ షో
ABN, Publish Date - Jan 26 , 2025 | 01:57 AM
ఓ మాదిరి ఛేదనే అనుకున్నా.. ఓ ఎండ్‌లో టపటపా వికెట్లు పడుతున్న వేళ.. తెలుగు తేజం తిలక్ వర్మ (55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 నాటౌట్) మొండి పట్టుదలను ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బౌలర్లను చెండాడుతూ ఒంటిచేత్తో...
ఆఖరి ఓవర్‌లో భారత్ విజయం
ఇంగ్లండ్‌తో రెండో టీ20
చెన్నై: ఓ మాదిరి ఛేదనే అనుకున్నా.. ఓ ఎండ్‌లో టపటపా వికెట్లు పడుతున్న వేళ.. తెలుగు తేజం తిలక్ వర్మ (55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 నాటౌట్) మొండి పట్టుదలను ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బౌలర్లను చెండాడుతూ ఒంటిచేత్తో భారత జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. ఓ దశలో గెలుపు కష్టమేననిపించినా, ఒత్తిడికి లోనుకాని అతడి ఆటతీరుతో ఆఖరి ఓవర్‌లో భారత్ ఊపిరిపీల్చుకుంది. ఫలితంగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో నెగ్గింది. అటు గెలుపు దరిదాపుల్లోకి వచ్చిన పర్యాటక జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ముందు గా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. బట్లర్ (45), కార్స్ (31), జేమీ స్మిత్ (22) రాణించారు. అక్షర్, వరుణ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 రన్స్ చేసి గెలిచింది. సుందర్ (26) సహకరించాడు. కార్స్‌కు 3 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా తిలక్ నిలిచాడు. మూడో టీ20 మంగళవారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది.
ఒక్కడై నిలిచి..: ఓ మాదిరి ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభమైనా మధ్య ఓవర్లలో కాస్త తడబాటుకు గురైంది. అయితే తిలక్ వర్మ డాషింగ్ ఆటతీరుతో ఆఖర్లో జట్టు గట్టెక్కింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ అభిషేక్ (12) మూడు ఫోర్లతో చెలరేగాడు. కానీ రెండు, మూడో ఓవర్లలోనే అభిషేక్, శాంసన్ (5) వెనుదిరిగారు. కెప్టెన్ సూర్యకుమార్ (12) ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. అయితే తిలక్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆరంభం నుంచే జోరును ప్రదర్శిస్తూ ఇంగ్లండ్ బౌలర్లను చెడుగుడు ఆడేశాడు. ఐదో ఓవర్‌లో 4,6,6తో బ్యాట్‌కు పనిచెప్పిన తను చివరి ఓవర్ వరకు అండగా నిలిచాడు. పవర్‌ప్లే తర్వాత వికెట్లు వేగంగా పడడంతో కాస్త నెమ్మదించాడు. అటు సుందర్ 13వ ఓవర్‌లో 6,4,6 బాదడంతో స్కోరు గాడిన పడింది. కానీ వరుస ఓవర్లలో సుందర్, అక్షర్ (2) వెనుదిరగడంతో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. అప్పటికి భారత్ చేతిలో 3 వికెట్లే ఉండగా, చివరి 5 ఓవర్లలో 40 రన్స్ కావాలి. ఈ దశలో తిలక్ 16వ ఓవర్‌లో 6,6,4తో 19 రన్స్ రాబట్టడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపింది. దీనికి తోడు 12 బంతుల్లో 13 రన్స్ కావాల్సిన వేళ రవి బిష్ణోయ్ (9 నాటౌట్) ఫోర్‌తో ఉత్కంఠ తగ్గింది. ఇక ఆఖరి ఓవర్‌లో 6 పరుగులను తిలక్ 2,4తో మరో నాలుగు బంతులుండగానే ముగించి సంబరాలు చేసుకున్నాడు.
బట్లర్ మరోసారి..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బట్లర్ మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే 14 ఓవర్లు స్పిన్నర్లే వేయగా, వీరి ధాటికి మిగతా బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. చివర్లో అరంగేట్ర జేమీ స్మిత్, కార్స్ మాత్రం వేగంగా ఆడారు. పేసర్ అర్ష్‌దీప్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ సాల్ట్ (4) వికెట్ తీయగా, డకెట్ (3)ను సుందర్ అవుట్ చేశాడు. అయితే బట్లర్ ఎదురుదాడితో ఆరంభంలో రన్‌రేట్ మాత్రం తగ్గలేదు. పవర్‌ప్లేలో జట్టు 58/2 స్కోరుతో నిలిచింది. మిడిలార్డర్‌లో బ్రూక్ (13), లివింగ్‌స్టోన్ (13) త్వరగానే అవుటయ్యారు. అర్ధసెంచరీ ఖాయమనుకున్న బట్లర్‌ను పదో ఓవర్‌లో అక్షర్ అవుట్ చేశాడు. స్మిత్ రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నా వేగంగా ఆడే క్రమంలో వికెట్ చేజార్చుకున్నాడు. ఇక కార్స్ వచ్చీరాగానే బౌండరీలతో జోరు చూపాడు. 14వ ఓవర్‌లో 6,4 సాధించిన కార్స్ 16వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. అయితే ఆర్చర్ (12 నాటౌట్)తో సమన్వయలోపం కారణంగా కార్స్ రనౌటవడంతో జట్టు భారీస్కోరుపై దెబ్బపడింది. దీంతో రషీద్ (10)తో తొమ్మిదో వికెట్‌కు 20 రన్స్ జోడించిన ఆర్చర్ స్కోరును 160 దాటించగలిగాడు.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్: సాల్ట్ (సి) సుందర్ (బి) అర్ష్‌దీప్ 4; డకెట్ (సి) జురెల్ (బి) సుందర్ 3; బట్లర్ (సి) తిలక్ (బి) అక్షర్ 45; బ్రూక్ (బి) వరుణ్ 13; లివింగ్‌స్టోన్ (సి సబ్) హర్షిత్ (బి) అక్షర్ 13; స్మిత్ (సి) తిలక్ (బి) అభిషేక్ 22; ఒవర్టన్ (బి) వరుణ్ 5; కార్స్ (రనౌట్) 31; ఆర్చర్ (నాటౌట్) 12; రషీద్ (సి) శాంసన్ (బి) హార్దిక్ 10; ఉడ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 165/9. వికెట్ల పతనం: 1-6, 2-26, 3-59, 4-77, 5-90, 6-104, 7-136, 8-137, 9-157. బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-40-1; పాండ్యా 2-0-6-1; సుందర్ 1-0-9-1; అక్షర్ 4-0-32-2; బిష్ణోయ్ 4-0-27-0; వరుణ్ 4-0-38-2; అభిషేక్ 1-0-12-1.
భారత్: శాంసన్ (సి) కార్స్ (బి) ఆర్చర్ 4; అభిషేక్ (ఎల్బీ) ఉడ్ 12; తిలక్ (నాటౌట్) 72; సూర్యకుమార్ (బి) కార్స్ 12; జురెల్ (సి సబ్) రెహాన్ (బి) కార్స్ 4; హార్దిక్ (సి) సాల్ట్ (బి) ఒవర్టన్ 7; సుందర్ (బి) కార్స్ 26; అక్షర్ (సి) డకెట్ (బి) లివింగ్‌స్టోన్ 2; అర్ష్‌దీప్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 6; బిష్ణోయ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 19.2 ఓవర్లలో 166/8. వికెట్ల పతనం: 1-15, 2-19, 3-58, 4-66, 5-78, 6-116, 7-126, 8-146. బౌలింగ్: ఆర్చర్ 4-0-60-1; ఉడ్ 3-0-28-1; కార్స్ 4-0-29-3; రషీద్ 4-0-14-1; ఒవర్టన్ 2.2-0-20-1; లివింగ్‌స్టోన్ 2-0-14-1.
ఇవీ చదవండి:
ఐసీసీ టీ20 టీమ్.. భారత్ నుంచి నలుగురు స్టార్లు
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
ఆర్సీబీపై కుల్దీప్ సెటైర్.. అంత మాట అనేశాడేంటి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 26 , 2025 | 01:59 AM