ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బంగ్లా, పాక్‌ ఇంటికి

ABN, Publish Date - Feb 25 , 2025 | 02:47 AM

ఒక్క మ్యాచ్‌తో రెండు ఫలితాలు.. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో గ్రూప్‌ ‘ఎ’ నుంచి నాలుగేసి పాయింట్లతో...

చాంపియన్స్‌ ట్రోఫీలో నేడు

ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా

మ.2.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

కివీస్‌ గెలుపు

సెమీస్‌లో న్యూజిలాండ్‌, భారత్‌

రచిన్‌ సెంచరీ

రావల్పిండి: ఒక్క మ్యాచ్‌తో రెండు ఫలితాలు.. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో గ్రూప్‌ ‘ఎ’ నుంచి నాలుగేసి పాయింట్లతో కివీ్‌సతో పాటు భారత్‌ కూడా సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. అటు కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఓటమితో బంగ్లా, ఇప్పటికే రెండు ఓటములతో ఉన్న ఆతిథ్య పాక్‌ ఇంటిముఖం పట్టాయి. ఈ మ్యాచ్‌లో రచిన్‌ రవీంద్ర (112) క్లాస్‌ ఇన్నింగ్స్‌తో జట్టును విజయం వైపు నడిపించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. కెప్టెన్‌ షంటో (77), జాకెర్‌ అలీ (45), రిషాద్‌ (26) మాత్రమే రాణించారు. బ్రేస్‌వెల్‌కు నాలుగు, ఓరౌర్క్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కివీస్‌ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగులు చేసి గెలిచింది. లేథమ్‌ (55), కాన్వే (30) ఆకట్టుకున్నారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బ్రేస్‌వెల్‌ నిలిచాడు.


శతక భాగస్వామ్యంతో..: ఛేదన ఆరంభంలోనే కివీ్‌సకు బంగ్లా బౌలర్లు షాకిచ్చారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ విల్‌ యంగ్‌ను పేసర్‌ టస్కిన్‌ డకౌట్‌ చేయగా.. యువ పేసర్‌ నహీద్‌ రాణా వెటరన్‌ విలియమ్సన్‌ (5)ను దెబ్బతీశాడు. దీంతో 15/2 స్కోరుతో కివీస్‌ ఇబ్బందుల్లో పడింది. అదే జోరులో బంగ్లా సంచలన ఫలితం సాధించేనా? అనిపించింది. కానీ గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన రచిన్‌ రవీంద్ర అదిరే ఆటతో జట్టును ఆదుకున్నాడు. ఏడో ఓవర్‌లో రచిన్‌ రెండు, ఎనిమిదో ఓవర్‌లో కాన్వే మూడు ఫోర్లతో బంగ్లా బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ 16వ ఓవర్‌లో కాన్వేను ముస్తాఫిజుర్‌ అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత లేథమ్‌ను అండగా చేసుకున్న రచిన్‌ 49 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. సంయమనంతో ఆడిన ఈ జోడీని విడదీసేందుకు బంగ్లా చెమటోడ్చాల్సి వచ్చింది. లేథమ్‌ కాస్త ఆచితూచి ఆడినా.. రచిన్‌ మాత్రం బంతులను వృధా చేయలేదు. అడపాదడపా బౌండరీలతో 95 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. అటు 38వ ఓవర్‌లో స్కోరును 200కి చేర్చిన రచిన్‌ను స్పిన్నర్‌ రిషాద్‌ అవుట్‌ చేశాడు. అప్పటికే నాలుగో వికెట్‌కు 128 పరుగుల భారీ భాగస్వామ్యం సమకూరింది. అనంతరం హాఫ్‌ సెంచరీ అయ్యాక లేథమ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, విజయానికి 50 బంతుల్లో 23 పరుగులే కావాల్సి ఉండడంతో కివీస్‌కు ఇబ్బంది లేకపోయింది. ఫిలిప్స్‌ (21 నాటౌట్‌), బ్రేస్‌వెల్‌ (11 నాటౌట్‌) 46.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.


షంటో పోరాటం: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఓపెనర్లు షంటో, తన్‌జీద్‌ శుభారంభం అందించారు. కివీస్‌ బౌలర్లను ఈ జోడీ దీటుగా ఎదుర్కొంది. తన్‌జీద్‌ బంతికో పరుగు చొప్పున సాధిస్తూ జోరు మీదున్నా.. తొమ్మిదో ఓవర్‌లో బ్రేస్‌వెల్‌కు చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత షంటోకు పెద్దగా సహకారం అందలేదు. బ్రేస్‌వెల్‌ ధాటికి మిడిలార్డర్‌లో తొలి మ్యాచ్‌ సెంచరీ హీరో తౌహీద్‌ (7), ముష్ఫికర్‌ (2), మహ్మదుల్లా (4) చకచకా పెవిలియన్‌కు చేరారు. అయితే షంటోకు ఏడో నెంబర్‌ బ్యాటర్‌ జాకెర్‌ సహకారం అందించాడు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 45 పరుగులు జత చేయగలిగింది. షంటో వెనుదిరిగాక టెయిలెండర్లతో కలిసి జాకెర్‌ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడంతో స్కోరు 200 దాటింది.

సంక్షిప్త స్కోర్లు

బంగ్లాదేశ్‌: 50 ఓవర్లలో 236/9 (షంటో 77, జాకెర్‌ 45, రిషాద్‌ 26, తన్‌జీద్‌ 24; బ్రేస్‌వెల్‌ 4/26, ఓరౌర్క్‌ 2/48).

న్యూజిలాండ్‌: ఓవర్లలో 46.1 ఓవర్లలో 240/5. (రచిన్‌ 112, లేథమ్‌ 55, కాన్వే 30; టస్కిన్‌ 1/28, ముస్తాఫిజుర్‌ 1/42).

1

ఐసీసీ టోర్నీల్లో కివీస్‌ తరఫున ఎక్కువ శతకాలు (4) బాదిన ప్లేయర్‌గా రచిన్‌ రవీంద్ర.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 25 , 2025 | 02:47 AM