అఫ్ఘాన్ అదిరెన్
ABN, Publish Date - Feb 27 , 2025 | 03:55 AM
చివరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అద్భుత విజయంసాధించిన అఫ్ఘానిస్థాన్.. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇబ్రహీం జద్రాన్...
చాంపియన్స్ ట్రోఫీలో నేడు
పాకిస్థాన్ X బంగ్లాదేశ్ మ.2.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్‌లో
ఇంగ్లండ్ అవుట్
ఒమర్జాయ్ ఆల్‌రౌండ్ షో
రూట్ సెంచరీ వృథా
జద్రాన్ రికార్డు శతకం
ప్రపంచ క్రికెట్‌లో వేగంగా ఎదిగిన అఫ్ఘానిస్థాన్ మరోసారి తమ సత్తా ఏంటో చాటి చెప్పింది. చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఆడుతున్న అఫ్ఘాన్ సంచలన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి టోర్నీలో ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొదట ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో భారీస్కోరు సాధించిన అఫ్ఘాన్.. ఆపై ప్రత్యర్థి ఛేదనలో ఎదురైన సవాల్‌ను దీటుగా అధిగమించి అద్భుత విజయాన్ని అందుకుంది. వరుసగా రెండో ఓటమితో బట్లర్ సేన నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.
లాహోర్: చివరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అద్భుత విజయంసాధించిన అఫ్ఘానిస్థాన్.. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇబ్రహీం జద్రాన్ (146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 177) రికార్డు శతకంతోపాటు అజ్మతుల్లా ఒమర్జాయ్ (41, 5/58) ఆల్‌రౌండ్ షోతో.. గ్రూప్-బిలో బుధవారం జరిగిన చావోరేవో మ్యాచ్‌లో అఫ్ఘాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. తొలుత అఫ్ఘాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగుల భారీ స్కోరు చేసింది. హస్మతుల్లా షాహిది (40), నబీ (40) రాణించారు. ఆర్చర్ మూడు, లివింగ్‌స్టోన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (111 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 120) సెంచరీ వృథా అయింది. నబీ 2 వికెట్లు సాధించాడు. ఈ ఓటమితో టోర్నీలో బట్లర్ సేన కథ ముగిసింది.
బ్యాటర్ల వైఫల్యం: భారీ ఛేదనలో ఓపెనర్ సాల్ట్ (12), జేమీ స్మిత్ (9), డకెట్ (38), బ్రూక్ (25) విఫలం కావడంతో ఇంగ్లండ్ 133/4తో ఇంగ్లండ్ ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో రూట్.. కెప్టెన్ బట్లర్ (38)తో కలిసి ఐదో వికెట్‌కు 83 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే, బట్లర్, లివింగ్‌స్టోన్ (10) స్వల్ప తేడాతో అవుటవడంతో ఇంగ్లండ్ శిబిరంలో గుబులు రేగింది. కానీ, సెంచరీ పూర్తి చేసుకొన్న రూట్.. ఓవర్టన్ (32)తో కలసి ఏడో వికెట్‌కు 54 పరుగులతో పోరాడాడు. కాగా, కీలక సమయంలో రూట్, ఓవర్టన్‌ను అవుట్ చేసిన ఒమర్జాయ్ మ్యాచ్‌ను అఫ్ఘాన్‌వైపు మొగ్గేలా చేశాడు. ఆర్చర్ (14)ను ఫారూఖీ పెవిలియన్ చేర్చాడు. చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు కావాల్సి ఉండగా.. రషీద్ (5)ను ఒమర్జాయ్ వెనక్కిపంపి ఇంగ్లండ్ కథ ముగించాడు.
ఆరంభంలో తడబాటు: జద్రాన్ ముందుండి నడిపించడంతో.. అప్ఘాన్ సవాల్ విసరగలిగే స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్.. ఆరంభంలోనే తడబడింది. మరో ఓపెనర్ గుర్బాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4)ను ఆర్చర్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చడంతో అఫ్ఘాన్ పవర్‌ప్లేలోపే 3/37తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ హస్మతుల్లాతో కలసి జద్రాన్ నాలుగో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. అయితే, హస్మతుల్లాను బౌల్డ్ చేసిన అదిల్ రషీద్.. జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఒమర్జాయ్ చక్కని సహకారం అందించడంతో స్కోరు వేగం పుంజుకొంది. 37వ ఓవర్‌లో జద్రాన్ సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. మరోవైపు ఒమర్జాయ్ కూడా ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ, ఒమర్జాయ్‌ను అవుట్ చేసిన ఓవర్టన్.. ఐదో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. చివరి 10 ఓవర్లలో నబీ, జద్రాన్ 55 బంతుల్లో 111 పరుగులు జోడించడంతో.. అఫ్ఘాన్ స్కోరు 300 మార్క్ దాటింది.
స్కోరుబోర్డు
అఫ్ఘానిస్థాన్: గుర్బాజ్ (బి) ఆర్చర్ 6, జద్రాన్ (సి) ఆర్చర్ (బి) లివింగ్‌స్టోన్ 177, సెదికుల్లా అటల్ (ఎల్బీ) ఆర్చర్ 4, రహ్మత్ షా (సి) రషీద్ (బి) ఆర్చర్ 4, హస్మతుల్లా షాహిది (బి) రషీద్ 40, ఒమర్జాయ్ (సి) సబ్/బాంటన్ (బి) ఓవర్టన్ 41, నబీ (సి) రూట్ (బి) లివింగ్‌స్టోన్ 40, నైబ్ (నాటౌట్) 1, రషీద్ ఖాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 50 ఓవర్లలో 325/7; వికెట్ల పతనం: 1-11, 2-15, 3-37, 4-140, 5-212, 6-323, 7-324; బౌలింగ్: ఆర్చర్ 10-0-64-3, మార్క్ ఉడ్ 8-0-50-0, ఓవర్టన్ 10-0-72-1, రషీద్ 10-0-60-1, రూట్ 7-0-47-0, లివింగ్‌స్టోన్ 5-0-28-2.
ఇంగ్లండ్: సాల్ట్ (బి) ఒమర్జాయ్ 12, డకెట్ (ఎల్బీ) రషీద్ 38, జేమీ స్మిత్ (సి) ఒమర్జాయ్ (బి) నబీ 9, రూట్ (సి) గుర్బాజ్ (బి) ఒమర్జాయ్ 120, బ్రూక్ (సి అండ్ బి) నబీ 25, బట్లర్ (సి) షా (బి) ఒమర్జాయ్ 38, లివింగ్‌స్టోన్ (సి) గుర్బాజ్ (బి) నైబ్ 10, ఓవర్టన్ (సి) నబీ (బి) ఒమర్జాయ్ 32, ఆర్చర్ (సి) నబీ (బి) ఫారూఖీ 14, రషీద్ (సి) జద్రాన్ (బి) ఒమర్జాయ్ 5, ఉడ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 49.5 ఓవర్లలో 317 ఆలౌట్; వికెట్ల పతనం: 1-19, 2-30, 3-98, 4-133, 5-216, 6-233, 7-287, 8-309, 9-313; బౌలింగ్: ఫారూఖీ 10-0-62-1, ఒమర్జాయ్ 9.5-0-58-5, నబీ 8-0-57-2, రషీద్ ఖాన్ 10-0-66-1, నూర్ అహ్మద్ 10-0-51-0, గుల్బదిన్ నైబ్ 2-0-16-1.
1
చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా జద్రాన్ (177). ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ (165) రికార్డును జద్రాన్ బ్రేక్ చేశాడు. అఫ్ఘాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా జద్రాన్‌దే.
ఇవి కూడా చదవండి..
Pak media on TeamIndia victory: భారత్ విజయంపై పాక్ మీడియా వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..
Team India Champions Trophy 2025: టీమిండియాకు ఇంత మేలు చేస్తారా? ఐసీసీపై పలువురు క్రికెటర్ల ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..
Updated Date - Feb 27 , 2025 | 03:55 AM