Chuang Tzu: విలువ తేల్చేది కాలమే
ABN, Publish Date - Feb 21 , 2025 | 04:49 AM
చైనాలో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో జీవించిన తత్త్వవేత్త చువాంగ్ ట్జూ. ఆయన గురించి ఆసక్తికరమైన కథలెన్నో ఉన్నాయి. ఆయన సామాన్యమైన జీవితం గడిపేవాడు.
చైనాలో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో జీవించిన తత్త్వవేత్త చువాంగ్ ట్జూ. ఆయన గురించి ఆసక్తికరమైన కథలెన్నో ఉన్నాయి. ఆయన సామాన్యమైన జీవితం గడిపేవాడు. ప్రజలకు జ్ఞానాన్ని బోధిస్తూ, వారు ఇచ్చే భిక్ష మీద ఆధారపడి జీవించేవాడు. ఆనాటి చైనా చక్రవర్తి ఆయనకు మిత్రుడు, శిష్యుడు. తరచుగా చువాంగ్‌ను కలుసుకొనేవాడు. అప్పుడప్పుడు తన మందిరానికి ఆహ్వానించి, అనేక విషయాల గురించి చర్చిస్తూ ఉండేవాడు.
ఒకరోజు... చువాంగ్ భార్య మరణించినట్టు చక్రవర్తికి తెలిసింది. ఆయనను పరామర్శించడం కోసం ఆ సాయంత్రం బయలుదేరాడు. చువాంగ్‌ను ఓదార్చడానికి ఏ మాటలు చెప్పాలో, ఎలా చెప్పాలో ఆలోచిస్తూ... చువాంగ్ కుటీరానికి చేరుకున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం చక్రవర్తిని దిగ్ర్భాతికి గురి చేసింది. చువాంగ్ ఒక చెట్టు కింద కూర్చొని, వాద్య పరికరం వాయిస్తూ, ఆనందంగా పాటపాడుతున్నాడు. చక్రవర్తి ఆయనను సమీపించి... ‘‘ఈ రోజు ఉదయమే మీ భార్య మరణించింది కదా? మీరేమో అప్పుడే ఆడుతూ, పాడుతూ ఆనందంగా ఉన్నారు. రోదించవలసిన సమయంలో మీరు ఇలా ఉంటే ఎలా?’’ అని అడిగాడు.
అప్పుడు చువాంగ్ ‘‘మహారాజా! నా భార్య చనిపోవడం నిజమే. అయితే నేను ఎందుకు దుఃఖించాలి? ఎందుకు రోదించాలి? ఆమె శాశ్వతంగా బతికే ఉంటుందని నేను ఎప్పుడూ భావించలేదు. ఆమె ఎల్లప్పుడూ జీవించే ఉండాలని ఆశించనూ లేదు. ఏదో ఒక రోజు ఆమె మరణించవలసిందేగా? అది ఈ రోజే అయితేనేం? పైగా ఆమె నాతో పాటు ఎన్నో సంవత్సరాలు కలిసి జీవించింది. నాకు ఎన్నెన్నో సేవలు చేసింది. ఆమె మరణిస్తే నేను ఏడుస్తూ కూర్చోవాలా? లేదంటే ఆమె పట్ల నా కృతజ్ఞతా భావాన్ని తెలుపుతూ... పాటలు పాడుతూ ఆమెను ఆనందంగా సాగనంపాలా?’’ అని ప్రశ్నించాడు.
చువాంగ్ ట్జూకు ఒక వింత అలవాటు ఉండేది. ఎవరైనా, ఏదైనా చెప్పడానికి వస్తే... వారు ఆ విషయం పూర్తిగా చెప్పకముందే ‘‘మంచిది, చాలా మంచిది’’ అని అనేవాడు. ఆయన అలా అనడం కొన్ని సందర్భాల్లో ఎబ్బెట్టుగా అనిపించేది. ఒక రోజు ఒక వ్యక్తి ఆయన దగ్గరకు ఎంతో ఆత్రుతగా వచ్చి ‘‘మీ కుమారుడు చెట్టు మీద నుంచి పడి, రెండు కాళ్ళూ విరగ్గొట్టుకున్నాడు’’ అని చెప్పాడు. వెంటనే చువాంగ్ ‘‘మంచిది, చాలా మంచిది’’ అన్నాడు. ‘‘అది ఎలా?’’ అని అడిగాడు ఆ వ్యక్తి. ‘‘వేచి చూడండి’’ అన్నాడు చువాంగ్.
మరునాడు ఆ రాజ్యం పొరుగు రాజ్యంతో యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి తలెత్తింది. రాజ్యంలో యువకులందరూ సైన్యంలో చేరాలని ఆదేశాలు వచ్చాయి. చువాంగ్ కుమారుడికి కాళ్ళు విరిగిన కారణంగా యుద్ధం నుంచి మినహాయింపు లభించింది. ఎంతోమంది యుద్ధంలో మరణించినా... అతను బతికాడు. చువాంగ్ చెప్పినట్టు మంచే జరిగింది. ఓషో ఈ కథ చెబుతూ... ‘‘జ్ఞానుల మాటలు, చేతలు ఒక పట్టాన మనకు అర్థం కావు. కాలమే వాటి విలువను తేల్చి చెబుతుంది’’ అంటారు.
రాచమడుగు శ్రీనివాసులు
ఇవి కూడా చదవండి:
Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 21 , 2025 | 04:49 AM