ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభిరుచితో మ్యాజిక్‌ స్ఫూర్తి

ABN, Publish Date - Mar 06 , 2025 | 06:10 AM

‘‘అది 2011. నా జీవితంలోనే అత్యంత బాధాకరమైన సంవత్సరం. నా ఆరేళ్ల పాప మూర్ఛ వ్యాధితో మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. నా గుండె ఆగలేదు... కానీ నేను జీవశ్చవంలా మారిపోయాను...

ఆరేళ్ల పిల్లను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె...

ఆ బాధ నుంచి బయటపడటానికి అల్లికలు మొదలుపెట్టింది. ఆ అభిరుచే ఆమెను పారిశ్రామికవేత్తను చేసింది. కాలక్షేపానికి ఇంట్లో మొదలైన వ్యాపకం...

ఇప్పుడు ఎనిమిది కోట్ల ఆదాయం తెచ్చే సంస్థగా మారింది. భర్తతో కలిసి ‘మ్యాజిక్‌ నీడిల్స్‌’ నెలకొల్పి... మూడు వందల మంది అట్టడుగు వర్గాల మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ముంబయికి చెందిన ఇద్దరు పిల్లల తల్లి హీనా పటేల్‌ విజయ గాథ ఇది.

‘‘అది 2011. నా జీవితంలోనే అత్యంత బాధాకరమైన సంవత్సరం. నా ఆరేళ్ల పాప మూర్ఛ వ్యాధితో మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. నా గుండె ఆగలేదు... కానీ నేను జీవశ్చవంలా మారిపోయాను. కళ్లు తెరిచినా మూసినా నా కూతురు కళ్ల ముందు మెదులుతుండేది. నా పరిస్థితి చూసి మావారు కల్పేష్‌, ఇంట్లోవాళ్లు ఆందోళన చెందేవారు. నావల్ల వాళ్లందరూ బాధపడటం నాకు నచ్చలేదు. ఆ బాధ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాను. అందులో భాగంగానే స్వెటర్లు, టోపీలు అల్లడం మొదలుపెట్టాను. కాలేజీ రోజుల్లో అప్పుడప్పుడూ అల్లుతుండేదాన్ని. క్రమంగా అల్లిక నా అభిరుచిగా మారిపోయింది. అదే సమయంలో ఐవీఎఫ్‌ ద్వారా పిల్లను కనాలనుకున్నాను. దూరమైన మా అమ్మాయి మళ్లీ మా ఇంట పుడుతుందనే ఆశ నాది. అప్పట్లో నేను ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం చేసేదాన్ని. గర్భవతిని కావడంతో పనికి బ్రేక్‌ ఇచ్చాను. కాలక్షేపంగా అల్లికలు కొనసాగించాను.


కవలలు పుట్టాక...

ఈసారి నాకు కవలలు పుట్టారు. వాళ్లను చూసుకోవడం కోసం అన్నీ ఆపేసి ఇంటికే పరిమితమయ్యాను. పిల్లలకు రెండున్నరేళ్లు వచ్చాక వాళ్లను ప్లే స్కూల్‌కు పంపించాను. దాంతో నాకు మళ్లీ కాస్త ఖాళీ సమయం లభించింది. అటకెక్కిన అల్లికలను తిరిగి మొదలుపెట్టాను. ఊలు, సూదులు ఆర్డర్‌ చేశాను. యూట్యూబ్‌లో చూసి స్వెటర్లు, టోపీల వంటివి ఎలా అల్లాలో నేర్చుకున్నాను. నాకు వచ్చినంతలో రెండు స్వెటర్లు అల్లాను. వాటిని నా పిల్లలకు వేసి ఫొటోలు తీసి, వాటిని నా స్నేహితుల వాట్సప్‌ గ్రూప్‌లో పోస్టు చేశాను. అవి చూసి వాళ్లు ఫిదా అయ్యారు. రోజుకు ఒకటి చొప్పున మరికొన్ని వెరైటీలు రూపొందించాను. వాటిని ఫేస్‌బుక్‌లో పెట్టమని స్నేహితులు చెప్పారు. దాంతో మావారు నా కోసం ఒక ఎఫ్‌బీ పేజీ తెరిచారు. అందులో కొన్ని క్యాప్‌ల ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తే అనూహ్య స్పందన వచ్చింది. 800 మంది బాగున్నాయంటూ కామెంట్లు పెట్టారు.


అలా మొదలైంది...

అదే ఏడాది నా అల్లికలు ప్రముఖ బ్రాండ్‌ ‘ఫస్ట్‌ క్రై’ను ఆకర్షించాయి. వాళ్లు నన్ను సంప్రతించారు. తమ కంపెనీ ద్వారా నా ఉత్పత్తులు విక్రయించుకోవచ్చని చెప్పారు. అసలు వీటిని విక్రయించాలని గానీ, వ్యాపారం ఒకటి ప్రారంభించాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోదలుచుకో లేదు. కంపెనీ ప్రతిపాదన నాకు నచ్చింది. వెంటనే పని ప్రారంభించాను. దాని కోసం మాకూ ఒక బ్రాండ్‌ ఉండాలి కదా. అందుకే మావారి భాగస్వామ్యంతో ‘మ్యాజిక్‌ నీడిల్స్‌’ పేరుతో చిన్న సంస్థను నెలకొల్పాను. మావారు వివిధ కంపెనీలకు మార్కెటిం గ్‌ చేసేవారు. ఆయన సహకారంతో నాకు మార్కెటింగ్‌ బాధ తప్పింది.


మూడొందల మంది మహిళలు...

ఆరంభంలో నేనొక్కదాన్నే అల్లేదాన్ని. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. పని భారం అధికమైంది. దాంతో వేరెవరినైనా సహాయంగా పెట్టుకోవాలనుకున్నాను. పేద మహిళలైతే వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది కదా. అందుకే మొదట మా ఇంట్లో పని చేసి మానేసిన ప్రియను పిలిచాను. ఈ పని తనవల్ల కాదని వెనకడుగు వేసింది. నేను ధైర్యం చెప్పి, శిక్షణ ఇచ్చాను. కొద్ది రోజుల్లోనే తను మంచి నైపుణ్యం సంపాదించింది. ఇప్పుడు తనే నాకు అత్యంత నమ్మకమైన కళాకారిణి. కొత్తగా చేరేవారికి కూడా శిక్షణ ఇస్తోంది. ముంబయిలోని మా ఇంటికి సమీపంలో బస్తీ ఉంది. అక్కడ ఎన్నో పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రియ సహకారంతో ఆ ప్రాంతంలోని మహిళలను సంప్రతించాను. మొదట్లో వారు ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఇల్లు వదిలి పని చేయడానికి వెనుకాడారు. అలాంటివారికి ఇంటి వద్దనుంచే పని చేసుకొనే వెసులుబాటు కల్పించాను. శిక్షణ ఇచ్చాను. ఇప్పుడు ఆ ఒక్క బస్తీ నుంచే 150 మంది మహిళలు మా సంస్థలో పని చేస్తున్నారు. మొత్తం మూడొందల మంది ఆడవారు మా ద్వారా ఉపాధి పొందుతున్నారు. గౌరవప్రదమైన జీవితం గడపగలు గుతున్నారు. వీరిలో హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి యాభైమంది, కోల్‌కతా నుంచి యాభైమంది ఉన్నారు. ప్రియ అయితే కంప్యూటర్స్‌ నేర్చుకొని తనే ఒక కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. నేను కోరుకున్నది ఇలాంటి పురోభివృద్ధే. తను నా బిడ్డలాంటిది. ఇలా ఎందరో పేద మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. ఇంతకంటే సంతృప్తి, సంతోషం ఏముంటుంది!


అదే మా పెట్టుబడి...

మా ఉత్పత్తుల్లో నాణ్యమైన ఊలు మాత్రమే ఉపయోగిస్తాం. అదే మా పెట్టుబడి. మొదట్లో టర్కిష్‌ ఊలును విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేవాళ్లం. నాణ్యమైన ఊలు కోసం ఎంత వెతికినా భారత్‌లో లభ్యంకాలేదు. దాంతో ఈ లోటును మేమే భర్తీ చేయాలని భావించాం. దాని కోసం అత్యంత నాణ్యమైన ఊలు దారాలు సరఫరా చేసేందుకు ‘హాబీ స్టోర్‌’ పేరిట ఒక బ్రాండ్‌ను తెచ్చాం. ఊలు సేకరించి, మేమే ప్రపంచ స్థాయి నూలు దారాలు తయారు చేసి విక్రయిస్తున్నాం. దీంతో మా వ్యాపారం మరింత విస్తరించింది. అమెజాన్‌, మింత్ర, నైకా తదితర ప్రముఖ ఈకామర్స్‌ సంస్థల్లో మా ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. మా వెబ్‌సైట్‌ను నెలకు దాదాపు లక్ష మంది సందర్శిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి గానూ ఎనిమిదిన్న కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇది ఒక మహిళగా, మహిళల సాయంతో నేను సాధించిన విజయం.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 06 , 2025 | 06:10 AM