కొబ్బరినూనెలో వీటిని కలిపి రాస్తే...
ABN, Publish Date - Feb 27 , 2025 | 05:34 AM
శిరోజాలకు తరచూ కొబ్బరినూనె రాసుకుంటే పోషణ అంది పొడవుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో దొరికే కొన్ని దినుసులను కలిపి రాస్తే మరింత ప్రయోజనం ఉంటుందని...
శిరోజాలకు తరచూ కొబ్బరినూనె రాసుకుంటే పోషణ అంది పొడవుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో దొరికే కొన్ని దినుసులను కలిపి రాస్తే మరింత ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.
స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక కప్పు కొబ్బరినూనె, రెండు చెంచాల మెంతులు వేసి బాగా మరిగించాలి. చల్లారిన తరవాత ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెని తలంతా పట్టించి పలుచని తువాలు కట్టుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే కురులు పొడవుగా పెరుగుతాయి. మెంతుల్లోని ప్రొటీన్, నికోటినిక్ యాసిడ్‌వల్ల కురులు రాలడం తగ్గుతుంది.
ఒక కప్పు కొబ్బరినూనెలో ఒక కట్ట కరివేపాకును తుంచి వేసి బాగా మరిగించాలి. గోరువెచ్చగా చల్లారిన తరవాత ఈ నూనెని వేళ్లతో తీసుకుంటూ మాడు మీద మర్దన చేయాలి. తల జిడ్డుగా అనిపిస్తే గంట తరవాత తలస్నానం చేయాలి. లేదంటే అలాగే ఉంచుకోవచ్చు. కరివేపాకులోని ఐరన్, కాల్షియం, బీటా కెరోటిన్ మూలకాలు వెంట్రుకల కుదుళ్లను గట్టి పరచి పొడవుగా పెరిగేలా చేస్తాయి. శిరోజాలు నెరవడాన్ని నిరోధిస్తాయి.
ఒక గిన్నెలో మూడు చెంచాల కొబ్బరినూనె, ఒక చెంచా ఆముదం కలిపి గోరువెచ్చగా వేడిచేయాలి. రాత్రి పడుకునేముందు తలమీద వెంట్రుకల మొదళ్లకు పట్టించాలి. ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే శిరోజాలు ఒత్తుగా పొడవుగా పెరుగుతాయి. తలలో వేడి తగ్గి చుండ్రు రాకుండా ఉంటుంది.
అరకప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు వేపాకులు వేసి మరిగించాలి. తరవాత తలమీద వెంట్రుకలను పాయలుగా విడదీసి ఈ నూనెని పట్టించాలి. గంట తరవాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వేపాకులోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల తలలో దురద, చుండ్రు, పేలు తొలగిపోతాయి. తల వెంట్రుకలు రాలడం తగ్గి పొడవుగా పెరుగుతాయి.
కొబ్బరినూనెలో కలబంద గుజ్జు కలిపి రాసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. శిరోజాల కొనలు చిట్లడం ఆగి చక్కగా పెరుగుతాయి.
కొబ్బరినూనెలో ఆవాల నూనె లేదా మందార నూనె కలిపి రాసుకుంటే కుదుళ్లు గట్టిపడి శిరోజాలు వేగంగా పెరుగుతాయి.
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది
Also Read: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Feb 27 , 2025 | 05:34 AM