ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dr. Mami Parija : వారి వేదనకు ఉపశమనంగా..

ABN, Publish Date - Jan 22 , 2025 | 01:39 AM

అనస్థీషియాలజిస్టుగా క్యాన్సర్‌ రోగుల బాధ, వారి బంధువుల వేదన గమనించి తీవ్రంగా కదిలిపోయారు డాక్టర్‌ మామి పరిజా. వారికి ఉపశమనం కలిగించడానికి ఆమె చేపట్టిన ప్రయత్నం... 800కు పైగా కుటుంబాలకు అండగా నిలిచింది. ఒడిశాకు చెందిన మామి పరిజా సేవా ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

అనస్థీషియాలజిస్టుగా క్యాన్సర్‌ రోగుల బాధ, వారి బంధువుల వేదన గమనించి తీవ్రంగా కదిలిపోయారు డాక్టర్‌ మామి పరిజా. వారికి ఉపశమనం కలిగించడానికి ఆమె చేపట్టిన ప్రయత్నం... 800కు పైగా కుటుంబాలకు అండగా నిలిచింది. ఒడిశాకు చెందిన మామి పరిజా సేవా ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

‘‘డాక్టర్‌! నా కణితిని తొలగిస్తే ప్రమాదం ఏదైనా ఉంటుందా? ఆపరేషన్‌ తరువాత అంతా బాగుంటుందా? ఇంకొన్నాళ్ళు బతుకుతానా? నా నొప్పి తగ్గిపోతుందా?... ఆపరేషన్‌ థియేటర్‌లో రోగులతో, వారి బంధువులతో జరిగే సంభాషణలో నాకు ఎదురయ్యే ప్రశ్నలివి. వాటికి నా దగ్గర సమాధానం ఉండేది కాదు. ఆ రోగుల పరిస్థితిని తలచుకొని నాకు రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. వివిధ దశల్లో శస్త్రచికిత్సలు చేయించుకొనే ఆ రోగులు నా కళ్ళ ముందు కదుల్తూ ఉండేవారు.

పదే పదే అదే ఆలోచన...

మాది ఒడిశాలోని భువనేశ్వర్‌. అక్కడే వివిధ ఆసుపత్రుల్లో అనస్థీషియాలజి్‌స్టగా పని చేశాను. క్యాన్సర్‌ రోగులను చూస్తున్నప్పుడు ‘వారి బాధను తగ్గించే మార్గం ఏదీ లేదా?’ అనే ఆలోచన నా మనసులో పదే పదే తిరుగుతూ ఉండేది. ఆ దిశగా ఒక ఆచరణీయమైన మార్గం కోసం వెతుకుతున్న సమయంలో... నా బాల్య స్నేహితురాలు నమ్రత మా ఆసుపత్రికి వచ్చింది. రోగుల్ని చూసి ఆమె తీవ్రంగా చలించిపోయింది. అప్పుడే నా ఆలోచనలను ఆమెతో పంచుకున్నాను. ‘‘దీనికి పరిష్కారం ఏమిటి?’’ అని అడిగింది తను. ‘‘పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన రోగులకు ఎక్కువకాలం ఆసుపత్రుల సంరక్షణలో ఉండే ఆర్థిక స్తోమత ఉండదు. వాళ్ళకు నిపుణుల పర్యవేక్షణలో పెయిన్‌ మేనేజిమెంట్‌, ఉపశమన సేవలు అవసరం. ఇళ్ళ దగ్గర అవి లభించడం కష్టం. ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి... ఈ సేవలు అందిస్తే వారికి ఊరటగా ఉంటుంది. కానీ దానికి ఖర్చవుతుంది. మానవ వనరులు కూడా అవసరం అవుతాయి’’ అని చెప్పాను. ‘‘ఈ ఊర్లో నాకు ఒక ఇల్లుంది. సిబ్బంది సంగతి నువ్వు చూసుకుంటానంటే... ఆ ఇంట్లో మనం ఒక కేంద్రాన్ని ప్రారంభించవచ్చు’’ అంది నమ్రత. అలా 2012లో... కొద్దిమంది రోగులతో మా చిన్న ప్రయత్నం ప్రారంభమయింది. ఈ సంగతి తెలిసి మరికొందరు మిత్రులు మాతో కలిశారు.


ఆ సంఘటనలు ఆవేదన కలిగించాయి...

మొదట్లో మా ‘పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌’... అవుట్‌పేషెంట్‌ విభాగంగా పని చేసేది. వచ్చిన రోగులకు కౌన్సెలింగ్‌ చేసేవాళ్ళం. వ్యాధి నియంత్రణకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికీ, వారి కుటుంబ సభ్యులకు వివరించేవాళ్ళం. నొప్పి నివారణ మందులను పంపిణీ చేసేవాళ్ళం. క్యాన్సర్‌ తొలిదశలో ఉన్నవారిని నిపుణులు ఉన్న ఆసుపత్రులకు రిఫర్‌ చేసి, ఆయా యాజమాన్యాల సహకారంతో చికిత్సలకు సాయపడేవాళ్ళం. కానీ ఈ క్రమంలో మాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అవగాహన లోపం, చికిత్సలు మధ్యలో మానెయ్యడం, శస్త్రచికిత్సల తరువాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొందరు రోగులు మరణించిన సంఘటనలు ఆవేదన కలిగించాయి. దీంతో క్యాన్సర్‌ బాగా ముదిరిన దశలో ఉన్నవారికి, శస్త్ర చికిత్సలు చేయించుకున్నవారికి పూర్తిస్థాయిలో ఉపశమన సేవలను అందించడం కోసం... ‘అమృతధార ట్రస్ట్‌’ పేరిట ఒక సంస్థను 2019లో ఏర్పాటు చేశాం.

ఉపశమనం, స్వస్థతే ధ్యేయం...

ప్రస్తుతం భువనేశ్వర్‌లో మాకు రెండు కేంద్రాలున్నాయి. రోగులు బస చేయడానికి వసతి ఉంది. డేకేర్‌ విభాగంలో తీవ్రమైన నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, క్యాన్సర్‌ గాయాలకు డ్రెస్సింగ్‌, ఇతర ప్రక్రియలు నిర్వహిస్తున్నాం. మాకు ప్రత్యేకంగా ఒక ఫార్మసీ కూడా ఉంది. మా నర్సులు రోగులకు రోజూ కాల్‌ చేసి... వారి పరిస్థితి గురించి వివరాలు తెలుసుకుంటారు. వాటిని ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. రోగులు రాలేని పక్షంలో... మా సిబ్బంది వారి ఇళ్ళకు వెళ్తారు. డేకేర్‌, హోమ్‌ విజిట్స్‌ ద్వారా నొప్పి నిర్వహణ, మందులు వేసుకోవడంలో సహాయం, పరిశుభ్రతను పాటించేలా చేయడం, క్యాన్సర్‌ విషయంలో ఉన్న అపోహలను, భయాన్ని తొలగించడం, కౌన్సెలింగ్‌ సేవలను మేము అందిస్తున్నాం. ఇప్పటివరకూ 800కు పైగా కుటుంబాలు మా సాయాన్ని అందుకున్నాయి. మృతి చెందిన రోగుల కుటుంబాలకు కూడా వివిధ మార్గాల్లో సాయం అందేలా చూస్తున్నాం. ట్రస్ట్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని మా సభ్యుల కుటుంబాలు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ద్వారా సమకూర్చుకుంటున్నాం. కిందటి ఏడాది ... ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ చేతుల మీదుగా ‘దేవి’ పురస్కారం అందుకున్నాను. పలు ఇతర సంస్థల నుంచి కూడా మా సంస్థకు గుర్తింపు లభించింది. రోగులకు ఉపశమనం, స్వస్థత కలిగించాలనే మా సంకల్పాన్ని ఇవన్నీ బలోపేతం చేస్తున్నాయి. ఒడిశా అంతటా, భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లో సమగ్రమైన ఉపశమన చికిత్సను అందించాలన్నది మా లక్ష్యం.’’

Updated Date - Jan 22 , 2025 | 01:39 AM