Run Tailor : ఇంటి ముందుకే దర్జాగా..!
ABN, Publish Date - Feb 05 , 2025 | 11:43 PM
నచ్చినట్టు దుస్తులు కుట్టించుకోవాలంటే టైలర్, డిజైనర్, బొటిక్ ఒకే చోట అందుబాటులో ఉండాలి. అవసరమైతే వాళ్లు ఇంటికే వచ్చి సేవలు అందించగలగాలి. ఇలా దర్జీ రంగాన్ని వినియోగదారుల దగ్గరకు చేర్చడం కోసం ‘రన్ టైలర్’ అనే సంస్థను స్థాపించి, అందరికీ దర్జీ సేవలను అందిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన అనసూయారెడ్డి. ఆమె ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి...
నచ్చినట్టు దుస్తులు కుట్టించుకోవాలంటే టైలర్,
డిజైనర్, బొటిక్ ఒకే చోట అందుబాటులో ఉండాలి. అవసరమైతే వాళ్లు ఇంటికే వచ్చి సేవలు అందించగలగాలి. ఇలా దర్జీ రంగాన్ని
వినియోగదారుల దగ్గరకు చేర్చడం కోసం
‘రన్ టైలర్’ అనే సంస్థను స్థాపించి, అందరికీ
దర్జీ సేవలను అందిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన అనసూయారెడ్డి.
ఆమె ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి...
దర్జీ పరిశ్రమ వెనకపడిపోతూ, ఫ్యాషన్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కారణం దర్జీలు సంఘటితంగా లేకపోవడమే! స్వతహాగా దుస్తుల డిజైనింగ్ పట్ల ఆసక్తి కలిగిన నేను, ఈ ఽధోరణిని లోతుగా అర్థం చేసుకుని 2017లో అను డిజైన్స్ అనే ఒక బ్రాండ్ మొదలుపెట్టాను. స్వయంగా వస్త్రాలు కొనుగోలు చేసి, టైలర్లు, మాస్టర్ల దగ్గర డిజైన్ చేయించి, కుట్టించి హైలైఫ్ ఎగ్జిబిషన్లో విక్రయించేదాన్ని. ఒక సందర్భంలో కుట్టడం కోసం దుస్తులు తీసుకున్న దర్జీ, సమయానికి నా ఫోన్‌కు స్పందించడం మానేశాడు. నాకేమో ఎగ్జిబిషన్‌లో స్టాల్ పెట్టుకునే సమయం దగ్గరపడిపోతోంది. దాంతో అడ్రస్ వెతికి, నేరుగా అతని ఇంటికి వెళ్లిపోయాను. అక్కడ అతని ఇరుగు పొరుగు మొత్తం నా మీదకు గొడవకు దిగారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోకుండా, వృత్తి ధర్మానికి కట్టుబడని వాళ్ల స్వభావం చూసి, అప్పటికి నా అభిరుచికి ఫుల్‌స్టాప్ పెట్టేశాను. ఆ అనుభవంతో టైలరింగ్ పరిశ్రమలో ఉన్న లోపాలు నాకు స్పష్టంగా అవగతమైపోయాయి. ఆ తర్వాత జరిగిన ఇంకొక సంఘటన నాలో కొత్త ఆలోచనకు బీజం పడేలా చేసింది.
ఆలోచన అలా మొదలైంది
మా ఇంట్లో పని చేసే అమ్మాయి, రోజూ రెండు, మూడు కవర్లు తీసుకొస్తూ ఉండేది. వాటిలో బ్లౌజ్‌లను గమనించి అవెక్కడివని అడిగినప్పుడు, ఆ కమ్యూనిటీలో ఉండే మహిళల దగ్గరి నుంచి మెటీరియల్ తీసుకుని, ఇంట్లోనే బ్లౌజులు కుట్టి తిరిగి అందిస్తూ ఉంటానని ఆ అమ్మాయి చెప్పింది. అలా నెలకు 50 నుంచి 60 వేలు సంపాదించుకుంటున్నట్టు విని, నేను విస్తుపోయాను. ఏమీ చదువుకోని ఒకమ్మాయి అంత ఆదాయం ఆర్జిస్తున్నప్పుడు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చదివిన అమ్మాయిలు ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు? అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఫ్యాషన్ డిజైనర్ల వెనకబాటుతనానికి కారణాలను తెలుసుకోవడం కోసం వేర్వేరు నగరాలు తిరిగాను. పరిశ్రమలోని లోపాలను తెలుసుకున్నాను. వినియోగదారులకు దుస్తులను చేరువ చేయడం కోసం ఒక దర్జీ, ఒక డిజైనర్‌ను వెంట బెట్టుకుని కారవాన్‌లో వివిధ ప్రాంతాల్లోని కమ్యూనిటీలకు వెళ్లిపోయేదాన్ని. అలా ఏడాదిన్నర పాటు కష్టపడిన తర్వాత అంతిమంగా 2022లో ‘రన్ టైలర్’ స్థాపించాను.
మూడు విభాగాల ద్వారా...
వ్యాపారం, వినియోగదారులు, ఉద్యోగాలు... ఇలా రన్ టైలర్‌లో మూడు విభాగాలున్నాయి. చాలామంది బొటిక్స్, లేబుల్స్ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్లు డాటా ట్రాక్ చేసుకోరు. బిల్లులన్నీ కాగితాల రూపంలోనే ఉంటాయి. వాళ్లను ప్రమోట్ చేసే కంపెనీలు ఉండవు. బ్రాండింగ్ లేదు. వీళ్లకు రన్ టైలర్, ఒక డిజిటల్ అగ్రిగేటర్‌గా ఉపయోగపడుతుంది. మాతో అనుసంధానమైన బొటిక్స్ అన్నిటికీ అవసరమైన సాఫ్ట్‌వేర్, మ్యాన్‌పవర్‌ను మేం సమకూరుస్తాం. ఇక వినియోగదారుల సేవల విషయానికొస్తే, టైలర్లు, డిజైనర్ల దగ్గరకు వెళ్లలేని వాళ్లుంటారు. అలాంటి వాళ్లకు ఇంటి దగ్గరే సేవలందిస్తాం. పోర్టబుల్ కుట్టుమిషన్‌తో సహా ఒక దర్జీని ఇంటికి పంపిస్తాం. వీలును బట్టి ఆన్‌లైన్‌లో కూడా సేవలందిస్తాం. ఇందుకోసం రన్ టైలర్ యాప్‌ను వాడుకోవచ్చు. దీని ద్వారా డిజైనర్, టైలర్ సేవలను అందుకోవడంతో పాటు కుట్టించుకునే దుస్తులను కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ప్రముఖ బ్రాండ్ల దుస్తులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక జీవనభృతిలో భాగంగా, ఫ్రాంచైజీలను ప్రారంభించే అవకాశాలను మహిళలకు కల్పిస్తున్నాం. ఇప్పటివరకూ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 25 ఫ్రాంచేజీలు ఏర్పడ్డాయి. ఇమేజ్ కన్సల్టేషన్ కోర్సు అందిస్తూ, ప్రతిభ కనబరిచిన వారికి రన్ టైలర్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం.
ఇమేజ్ కన్సల్టేషన్...
ప్రతి వ్యక్తికీ ఒక ఇమేజ్ ఉంటుంది. వాళ్ల వృత్తి, ప్రవృత్తి, ఆహార్యం. వీటికి తగ్గట్టు దుస్తులను డిజైన్ చేసినప్పుడే హూందాగా కనిపిస్తారు. ఇందుకోసం ఇమేజ్ కన్సల్టేషన్ ప్రోగ్రాం అనే కోర్సు నేర్చుకున్నాను. ప్రస్తుతం ఆసక్తి ఉన్న డిజైనర్లకు కూడా ఈ కోర్సు నేర్పిస్తున్నాను. ఎవరికి ఎలాంటి రంగులు, ఎలాంటి దుస్తులు నప్పుతాయన్నది అంచనా వేయడంతో పాటు ఏ రంగులను మ్యాచ్ చేయాలో, ఏ దుస్తులను ఎలా కుట్టించాలో వినియోగదారులకు అవగాహన కల్పించడమే ఈ కోర్సు లక్ష్యం. ఇలా మా దగ్గర ఈ కోర్సు పూర్తి చేసిన కన్నల్టెంట్స్, వినియోగదారులను సంప్రతించి, నెలలో నాలుగు వారాలకు సరిపడా దుస్తులను డిజైన్ చేసి, సమకూర్చి పెడతారు. ఈ సౌలభ్యం వల్ల ప్రతి రోజూ వేసుకోబోయే దుస్తుల గురించిన ఆందోళన తప్పుతుంది.
ఉదాహరణకు రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకుంటే, దాన్లో పురుషులందరూ తెల్లని దుస్తులే వేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎవరికంటూ వారు ప్రత్యేక స్టైల్‌ను చాటుకోవాలంటే, తెల్ల దుస్తుల్లోనే భిన్నంగా కనిపించాలి. అందుకోసం మేం ఒక కస్టమర్‌కు బంగారు జరీ, బంగారం, వజ్రాల గుండీలు డిజైన్ చేశాం. కొద్దిగా డై చేసి తెలుపు రంగును లేత రంగులోకి మార్చగలిగాం. ఇలా వినియోగదారుల ఆహార్యాన్ని మెరుగు పరచగలుగుతున్నాం.
రన్ టైలర్ పేరు వెనక...
నేనెప్పుడూ పరిగెత్తే వ్యక్తిని. ఒకే చోట కుదురుగా ఉండడం నాకు అలవాటు లేదు. టైలర్ల జీవితాలను గమనించిన తర్వాత, పరుగులు పెట్టే నా స్వభావాన్నీ, టైలరింగ్ రంగాన్నీ కలుపుతూ, ఈ సంస్థకు ‘రన్ టైలర్’ అని పేరు పెట్టుకున్నాను.
మాది కడప. నాన్న కాంట్రాక్టర్ అవడం వల్ల వేర్వేరు ఊళ్లు తిరుగుతూ చివరకు హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. మా వారు చంద్రహాస్ రెడ్డి కూడా కన్‌స్ట్రక్షన్ బిజినె్‌సలోనే ఉన్నారు. నాకొక బాబు. పేరు మౌనిష్ రెడ్డి. ఐదో తరగతి చదువుతున్నాడు. త్వరలో హైదరాబాద్, దుబాయ్‌లో, రెండు పెద్ద బ్రాండ్లను లాంచ్ చేయబోతున్నాను. ఈ బ్రాండ్ల ద్వారా అందరూ సౌకర్యంగా ధరించగలిగే, రాజసం ఉట్టిపడే దుస్తులను అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నాను. కొత్తదనం కోసం పరితపించే క్రమంలో తయారవుతున్న తాజా ఫ్యాషన్ల దుస్తులు ధరించడానికి వీల్లేకుండా ఉంటున్నాయి. నేను డిజైన్ చేయబోతున్న దుస్తులు ఇందుకు పూర్తి భిన్నం.
- గోగుమళ్ల కవిత
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 05 , 2025 | 11:43 PM