Purandara Dasa : వ్యాసుల తరువాత దాసులే...
ABN, Publish Date - Jan 23 , 2025 | 11:53 PM
మహా భక్తుడుగా, సంకీర్తనా చార్యుడిగా అద్వితీయమైన స్థానాన్ని పొందిన మహనీయుడు శ్రీ పురందరదాసు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారాంశాన్ని సాధారణ ప్రజలకు అర్థం అయ్యేలా ... సరళమైన కన్నడ భాషలో ఆయన అందించాడు. పురందరదాసు రచన...
మహా భక్తుడుగా, సంకీర్తనా చార్యుడిగా అద్వితీయమైన స్థానాన్ని పొందిన మహనీయుడు శ్రీ పురందరదాసు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారాంశాన్ని సాధారణ ప్రజలకు అర్థం అయ్యేలా ... సరళమైన కన్నడ భాషలో ఆయన అందించాడు. పురందరదాసు రచన... అద్భుతమైన సంగీతం, సరళమైన సాహిత్యం, ఆధ్యాత్మిక జ్ఞానాల అపూర్వ సంగమం. భౌతికమైన సంపదలకన్నా భక్తి తత్పరత, జ్ఞానం గొప్పవని బోధించిన ఆయన జననం... దైవ సంకల్పం.
భగవంతుడి ఆజ్ఞ మేరకు... నారదుడు తాను రచించిన భక్తి సూత్రాలను ఆచరణలోకి తేవడానికి.... శ్రీనివాసనాయకుడుగా ఈ భూమి మీద అవతరించాడు. ధన సంపాదనే ధ్యేయంగా, లోభిత్వంతో... నవకోటి నారాయణుడిగా కోట్లకు పడగలెత్తిన శ్రీనివాస నాయకుడు.... ఒక చిన్న ఘటనతో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలే అసలైన సిరిసంపదలని సమాజానికి తెలియజేసే పురందరదాసుగా మారాడు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి... స్వయంగా బ్రాహ్మణ రూపంలో వచ్చినా, ఆయనను సామాన్య యాచకుడిగా భావించి, ఆరు నెలలపాటు వాకిలిలో నిలబెట్టాడు శ్రీనివాసనాయకుడు. ఆ తరువాత తన తప్పును తెలుసుకొని, విరక్త శిఖామణిగా మారాడు. శ్రీవ్యాసరాయల నుంచి సకల శాస్త్రార్థ ఉపదేశాలను పొందాడు, భక్తితో పాడి శ్రీకృష్ణునితో నాట్యం చేయించాడు.
ఎవరి భాగ్యం గొప్పది?
కర్ణాటక శాస్త్రీయ సంగీత పితామహుడు అనిపించుకున్న పురందరదాసుకు, విజయనగర సామ్రాజ్యానికి ఎనలేని అనుబంధం. ఆయన కాలంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తిగా పాలన సాగించేవాడు. తన రాజ్యంలో పేరుమోసిన వ్యాపారి ఒకరు... రాత్రికి రాత్రి సర్వస్వాన్ని దానం చేసి, హరిదాసుగా మారాడనీ, ఎన్నో దివ్యమైన తత్త్వాలు ఉపదేశిస్తున్నాడని, మహిమాన్వితుడని రాయలు విన్నాడు. ఆయనను స్వయంగా చూడాలని వ్యాసరాయల మఠానికి వచ్చాడు. వ్యాసరాయలు... పురందర, కనకదాసులతో భజనలో ఉన్నారు. రాయలు దేవాలయ మండపంలో కూర్చున్నాడు. పూజలో, భజనలో లీనమై, భావసమాధిలో మునిగిపోయిన వారు అతని రాకను గమనించలేదు. ఆ తాదాత్మ్యత నుంచి బయటకు వచ్చిన తరువాత... రాయలను కుశల ప్రశ్నలు వేశారు. తన సుకృతం వల్ల యతులను, హరిదాసులను చూసే భాగ్యం కలిగిందని, పురందరదాసు వృత్తాంతం విని వచ్చానని రాయలు తెలిపాడు. తరువాత పురందరదాసును తనతోపాటు ఏకాంతానికి తీసుకువెళ్ళి, ఆయన అనుభవాలన్నీ విన్న రాయలు భక్తితో, ఆనందంతో పరవశుడయ్యాడు. అప్పుడు పురందరదాసు వైరాగ్యాన్ని వినోదంతో మిశ్రమం చేసి... ‘నిమ్మ భాగ్య దొడ్డదో, నమ్మ భాగ్య దొడ్డదో?’ (మీ భాగ్యం గొప్పదా? మా భాగ్యం గొప్పదా?) అంటూ భగవన్నామ సంకీర్తన చేశాడు. ‘‘రాజ్య సంపదకు చోరులు, శత్రువుల భయం ఉంటుందేమో కానీ... మా రామ నామ సంపదకు ఎలాంటి భయం లేదు. ధాన్యం, బెల్లం, నెయ్యి లాంటి సరుకులు చెడిపోతాయేమోననే చింత ఉండవచ్చు, ‘హరినామామృతం’ అనే సరుకు విషయంలో ఏ చింతా ఉండదు. మీ భాగ్యం లక్ష్మీదేవి అయితే... మా భాగ్యం నారాయణుడు. మన అందరి బాగ్యం పురందర విఠలుడు’’ అని పాడాడు. రాయలు పరమానందం చెంది... పురందరదాసును సత్కరించాడు. రాయలు ఇచ్చిన ఆభరణాలను, వస్త్రాలను, కానుకలను పేదలకు పురందరదాసు దానం ఇచ్చాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణదేవదాయలు బాధ పడగా... ‘‘కృష్ణరాయా! వాటిని నేను అలంకరించుకుంటే హరికి ప్రీతిపాత్రం కాదు. అందుకే వాటిని ఆ హరికే సమర్పించాను’’ అని వివరించాడు. దీనితో రాయలుకు పురందరదాసు మీద గౌరవం మరింత పెరిగింది.
అంతటా నెలకొన్న దేవుడొక్కడే...
‘మానవ జన్మ దొడ్డదో’ అనే కృతిలో మానవజన్మ విశిష్టతను అందరూ తెలుసుకోవాలనీ, దాన్ని వృధా చేసుకోవద్దనీ పురందరదాసు హెచ్చరిస్తారు. ఆయన కీర్తనలలో వైవిధ్యం ఊహాతీతం. భక్తి, విరక్తి, లాలిపాటలు, దేవతా/ క్షేత్ర వర్ణన, వ్యాపారం, సామాజిక బాధ్యత, విమర్శ... ఇలా అన్ని అంశాల గురించీ ఆయన కీర్తనలు ఉంటాయి. ఒకసారి కొంతమంది ముస్లిం యువకులు ఆయనను ఉరుసుకు ఆహ్వానించి దేవునిమీద పాట పాడమని కోరినప్పుడు... అంతటా నెలకొని ఉన్న దేవుడు ఒకడే అంటూ ‘క్లాహుస్సేన్ బాహుస్సేన్ ’ అనే కీర్తనలో దశావతార స్తుతి చేసి, అక్కడ ఉన్న ముస్లింల మనసును గెలిచారు. పరమత సహనం ఆవశ్యకతను తెలియజేశారు. పురందరదాసు రచించిన కృతుల గొప్పదనం ఎంతటిదంటే ‘వ్యాసుల (వ్యాసభగవానులు) తరువాత దాసులే’ అని ఆయన ప్రసిద్ధి చెందారు. వ్యాసరాయలవారు... శ్రీమధ్వాచార్యుల సర్వమూల గ్రంథాలతోపాటు... పురందరదాసు కృతులను వ్యాసపీఠం మీద ఉంచి... రెండిటికీ సమానమైన గౌరవం ఇచ్చేవారు.ఆయన సాహిత్య ఔన్నత్యానికి ఇది నిదర్శనం.
కర్ణాటక సంగీతానికి పునాది
సాక్షాత్తూ నారదుడే పురందరదాసు అయినందున ఆయన సంగీత స్థాయి అనుపమానంగా ఉంటుంది. ఆ కాలంలో కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందే విద్యార్థులకు వ్యవస్థీకృతమైన పద్ధతి ఉండేది కాదు. పదిహేనవ మేళకర్త రాగమైన మాయామాళవగౌళ రాగాన్ని... ఆదిరాగంగా చేసుకొని, సంగీత శిక్షణ కోసం దాన్ని సిద్ధపరిచారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా... మలహరి రాగంలో పిళ్ళారి గీతాలు రచించారు. ఈ విధంగా కర్ణాటక సంగీతానికి భద్రమైన పునాది వేసి, దాని మీద సుస్థిరమైన కట్టడాన్ని పురందరదాసు నిర్మించారు. ప్రతి సంవత్సరం పుష్య మాస అమావాస్యనాడు వచ్చే వారి పుణ్యతిథిని సద్భక్తులందరూ అత్యంత వైభవంగా జరుపుకొని పునీతులవుతారు. దాసశ్రేష్టుడైన పురందరదాసు నామస్మరణతో అభీష్టాలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం.
మధ్వ ప్రచార పరిషత్, 9440258841
Updated Date - Jan 23 , 2025 | 11:53 PM