UGC: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ‘నెట్’ తప్పనిసరి కాదు
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:07 AM
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ప్రమాణాలను యూజీసీ సవరించింది. ఈ పోస్టులో నియామకానికి ఇకపై జాతీయ అర్హత పరీక్ష (ఎన్‌ఈటీ)లో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని పేర్కొంది.
యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు-2025 విడుదల
న్యూఢిల్లీ, జనవరి 7: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ప్రమాణాలను యూజీసీ సవరించింది. ఈ పోస్టులో నియామకానికి ఇకపై జాతీయ అర్హత పరీక్ష (ఎన్‌ఈటీ)లో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీ నియామకాలు, పదోన్నతుల కోసం కనీస విద్యార్హతల ముసాయిదా మార్గదర్శకాలు-2025ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న 2018 నాటి నిబంధనల ప్రకారం పీజీ అనంతరం అదే సబ్జెక్ట్‌లో నెట్‌లో ఉత్తీర్థులైన అభ్యర్థులు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హులు. కొత్త ముసాయిదాలో ఈ నిబంధనను తొలగించారు. తాజా మార్గదర్శకాల ప్రకారం... నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసిన వారు తమ సబ్జెక్టుకు భిన్నమైన రంగంలో పీహెచ్‌డీ చేసినప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకానికి అర్హులే. అలాగే నాలుగేళ్ల డిగ్రీకి భిన్నమైన సబ్జెక్టులో నెట్‌లో గానీ, రాష్ట్ర అర్హత పరీక్ష (ఎస్‌ఈటీ)లో గానీ అర్హత సాధించినవారు కూడా ఆయా విభాగాల్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త నిబంధనలపై ఫిబ్రవరి 5లోగా అభిప్రాయాలు చెప్పాలని యూజీసీ కోరింది.
Updated Date - Jan 08 , 2025 | 05:08 AM