Supreme Court: ఆ దరఖాస్తులు ఇక స్వీకరించాం!
ABN, Publish Date - Feb 18 , 2025 | 04:53 AM
దేశంలోని పలు ప్రార్థనా మందిరాల స్థితినీ, ఆకృతినీ మార్చాలంటూ ఈ దరఖాస్తులు దాఖలవుతున్నాయి. అయితే, ఇకపై కొత్తగా ఈ అంశంపై వచ్చే దరఖాస్తులను తీసుకోబోమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌ల ద్విసభ్య బెంచ్ వెల్లడించింది.
‘ప్రార్థనా మందిరాల’పై వెల్లువలా పిటిషన్లు
అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
కొత్తవి తీసుకోబోమన్న చీఫ్ జస్టిస్ ఖన్నా
విచారణ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 : ప్రార్థనా మందిరాల చట్టం-1991పై కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతుండటం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. ‘చాలు..చాలు. వీటికి ఇక ముగింపు పలుకుదాం’ అని స్పష్టం చేశారు. దేశంలోని పలు ప్రార్థనా మందిరాల స్థితినీ, ఆకృతినీ మార్చాలంటూ ఈ దరఖాస్తులు దాఖలవుతున్నాయి. అయితే, ఇకపై కొత్తగా ఈ అంశంపై వచ్చే దరఖాస్తులను తీసుకోబోమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌ల ద్విసభ్య బెంచ్ వెల్లడించింది. ఇప్పటికే దాఖలైన ఓ దరఖాస్తుకు సంబంధించి మధ్యవర్తిత్వ (రిట్) పిటిషన్‌ను మాత్రం అనుమతిస్తున్నామని తెలిపింది. రామ జన్మభూమి వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1991లో ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. ఆగస్టు 15, 1947 నాటికి ఉనికిలో ఉన్న ప్రార్థనా మందిరాల మతపరమైన స్థితిని మార్చడానికి వీల్లేదని ఈ చట్టం స్పష్టం చేసింది.
ఈ చట్టానికి ఉన్న చట్టబద్ధతను ప్రశ్నిస్తూ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మొత్తంగా తేనెతుట్టెను కదిలించింది. దేశంలోని పది మసీదులపై హక్కును ప్రకటిస్తూ హిందూ సంస్థలు పలు కోర్టుల్లో 18 పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే, వీటిపై విచారణను గత ఏడాది సుప్రీంకోర్టు నిలిపివేసింది. వాటిలో షాహీ ఈద్గా - కృష్ణ జన్మభూమి, కాశీ విశ్వనాథ్- జ్ఞానవాపీ మసీదు, సంభాల్ మసీదు వివాదం ఇందులో కొన్ని. ఈ వివాదాల నివృత్తికి 1991నాటి చట్టాన్ని ప్రామాణికంగా చేసుకోవాలని పలు ప్రతిపక్ష పార్టీలు కోరుతుండగా, హిందూ సంస్థలు, మితవాద సంఘాలు ఈ చట్టాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ చట్టాన్ని గట్టిగా అమలు చేయాలంటూ ఏఐఎమ్‌ఐఎమ్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శాంతియుతంగా జీవించేందుకు ప్రతి పౌరుడికీ అవకాశం కల్పిస్తూ 1991 చట్టాన్ని మరోసారి ధ్రువీకరించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ ఖైరానా ఎంపీ ఇఖ్రా చౌధురీ అభ్యర్థించారు. గతంలో తాను వేసిన పిటిషన్‌ను స్వీకరించినట్టు నోటీసు తనకు అందలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కొత్త అంశాలను తాజాగా జోడించి రూపొందించిన మధ్యవర్తిత్వ (రిట్) పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని ఆయన కోరారు. దీనిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందించారు.
ఈ తరహా పిటిషన్లను గతంలో అనుమతించామని, ఇక ఇటువంటి వాటిని స్వీకరించబోమని స్పష్టం చేశారు. నోటీసులు పంపని పిటిషన్లను తిరస్కరిస్తున్నామన్న ఆయన.. కొత్త అంశాలతో దాఖలు చేసిన రిట్ పిటిషన్లను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఇఖ్రా చౌధురి పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఈ వివాదంపై కేంద్రం స్పందన తెలియాల్సి ఉన్నదన్నారు. ఈ వివరాలు నమోదుచేసుకున్న బెంచ్ తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. ఆ రోజున త్రిసభ్య బెంచ్ అన్ని పిటిషన్లపై విచారణ చేపడుతుందని వెల్లడించింది.
యూపీ అధికారులకు నోటీసులు
మసీదును కూల్చివేయకూడదంటూ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించింది. కుశీనగర్‌లోని మసీదును కూల్చివేయకూదంటూ గత ఏడాది నవంబరు 13న ఇచ్చిన ఆదేశాలను అధికారులు కావాలని ఉల్లంఘించారని పేర్కొంటూ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది. దీనిని పరిశీలించిన ధర్మాసనం..కూల్చివేత పనులను నిలిపివేయాలని ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి
New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 18 , 2025 | 04:56 AM