Supreme Court: నిర్బంధ కేంద్రాల్లో ‘వారు’ ఎన్నాళ్లు?
ABN, Publish Date - Feb 05 , 2025 | 04:29 AM
ఏదైనా ముహూర్తం కోసం చూస్తున్నారా అని అసోం ప్రభుత్వంపై మండిపడింది. ఈ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని వ్యాఖ్యానించింది. ఒకసారి బందీలను పరాయి దేశస్థులుగా గుర్తించిన తర్వాత.. వారిని తక్షణమే వారి దేశాలకు పంపేయాలని స్పష్టం చేసింది.
విదేశీయులను పంపేందుకు ముహూర్తం కోసం చూస్తున్నారా?.. అసోం సర్కారుపై సుప్రీం ఫైర్
పరాయి దేశస్థులుగా గుర్తించాక వారి దేశాలకు పంపాల్సిందే
అడ్ర్‌సలు తెలియడం లేదంటే అది మా సమస్య కాదు: సుప్రీం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: విదేశీయులుగా ప్రకటించిన వ్యక్తులను వారి స్వదేశాలకు పంపకుండా.. నిరవధికంగా నిర్బంధ కేంద్రాల్లో ఉంచడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏదైనా ముహూర్తం కోసం చూస్తున్నారా అని అసోం ప్రభుత్వంపై మండిపడింది. ఈ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని వ్యాఖ్యానించింది. ఒకసారి బందీలను పరాయి దేశస్థులుగా గుర్తించిన తర్వాత.. వారిని తక్షణమే వారి దేశాలకు పంపేయాలని స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించినవారిని స్వదేశాలకు పంపడం.. వారున్న నిర్బంధ కేంద్రాల్లో ఆహార, వసతి సౌకర్యాలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవి కోటాపై ప్రశ్నల వర్షం కురిపించింది.
‘బందీల చిరునామాలు తెలియడం లేదంటూ వారిని ఆయా దేశాలకు పంపడానికి మీరు నిరాకరిస్తున్నారు. ఇది మా సమస్య ఎలా అవుతుంది? వారి దేశానికి వారిని పంపేయాల్సిందే. ఏదైనా శుభముహూర్తం కోసం చూస్తున్నారా? ఒకసారి ఒకరిని విదేశీయుడిగా ప్రకటించాక తదుపరి చట్టబద్ధమైన చర్యకు మీరు ఉపక్రమించాలి. శాశ్వతంగా వారిని నిర్బంధించి ఉంచలేరు. రాజ్యాంగంలోని 21వ అధికరణ ఇక్కడ ఉంది. అసోంలో చాలా నిర్బంధ కేంద్రాలు ఉన్నాయి. ఎంతమందిని మీరు విదేశాలకు పంపించారు’ అని అసోం తరఫు న్యాయవాదిని అడిగింది. అడ్ర్‌సలు తెలియకుండా వారిని పంపలేమని ఆయన నిస్సహాయత వ్యక్తం చేయడంతో.. చిరునామాలు లేకపోయినా వారిని వెనక్కి పంపవచ్చని ధర్మాసనం తెలిపింది. ‘వారి దేశ రాజధానికి పంపేయండి. ఒకవేళ ఫలానా బందీ పాకిస్థాన్‌కు చెందినవాడైతే ఆ దేశ రాజధాని ఏదో మీకు తెలుసు కదా! విదేశాల్లో వారి చిరునామా తెలియదని ఎన్నాళ్లు వారిని నిర్బంధిస్తారు? ఇలాగైతే ఎప్పటికీ అడ్రస్ తెలుసుకోలేరు. ఇన్నేళ్లు నిర్బంధంలో ఉంచి ఖజానా నుంచి ఖర్చుపెడుతున్నారు’ అని వ్యాఖ్యానించింది. విదేశీయులుగా ప్రకటించి.. జాతీయతను గుర్తించిన 63 మందిని స్వదేశాలకు పంపించే ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించాలని ఆదేశించింది. రెండు వారాల్లో స్థాయీనివేదికను సమర్పించాలని నిర్దేశించింది. ‘మా ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం సవ్యమైన అఫిడవిట్ దాఖలు చేయాలి’ అని పేర్కొంది.
వారిని బంగ్లాదేశ్ తీసుకోవడం లేదు!
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గొంజాల్వెజ్ వాదనలు వినిపించారు. కొందరు బందీలను తన దేశీయులుగా గుర్తించడానికి బంగ్లాదేశ్ నిరాకరించిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘వారు భారతీయులు కాదని భారత్ అంటుంటే.. బంగ్లా జాతీయులు కాదని ఆ దేశం అంటోంది. వారిప్పుడు అనాథలుగా మారారు’ అని తెలిపారు. బందీలు రోహింగ్యాలని.. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం కోర్టుకు నిజాలు చెప్పాలని కోరారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని.. అసోం అఫిడవిట్‌లో లోపాలు చోటుచేసుకోవడంపై క్షమాపణ చెప్పారు. అత్యున్నత అధికారితో మాట్లాడి అన్ని వివరాలూ కోర్టుకు సమర్పిస్తానని తెలిపారు. దీంతో.. ఇంతవరకు ఎంత మంది విదేశీయులను వారి దేశాలకు పంపించారు.. ఆ దేశం వారో తెలియనివారి విషయంలో ఏం చేస్తారో కేంద్రం కూడా వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదావేసింది.
ఇదీ వ్యాజ్యం..
అసోం నిర్బంధ కేంద్రాల్లో ఉన్న విదేశీయులను స్వదేశాలకు పంపాలని.. వారికి ఆహారం, వసతి తగురీతిలో లేవని.. వారిని స్వదేశాలకు అప్పగించబోతున్నట్లు రుజువు చూపేవరకు.. ఏ ఒక్కరినీ అసోం ప్రభుత్వం నిర్బంధించకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. దీనిపై నిరుడు మే 16న న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రధానంగా మటియా నిర్బంధ కేంద్రంలో ఉన్న విదేశీయులను వారి దేశాలకు పంపేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విదేశీయుల నిర్బంధానికి గల కారణాలు చెప్పాలని ఆదేశించగా..రాష్ట్రప్రభుత్వం జవాబివ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.
90 రోజులు దాటినా ఎన్‌ఐఏ కేసుల్లో అప్పీళ్లకు అనుమతి
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చట్టం కింద నమోదైన కేసుల్లో అప్పీళ్లు చేసుకునే విషయమై మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఆదేశాలు, తీర్పులు వెలువడిన 90 రోజుల తరువాత కూడా వాటిని సవాలు చేస్తూ అప్పీళ్లు చేసుకోవచ్చని తెలిపింది. 90 రోజుల గడువు దాటిందన్న కారణంతో అప్పీళ్లను తిరస్కరించలేరని ధర్మాసనం తెలిపింది. ఎన్‌ఐఏ చట్టం-2008లో అప్పీళ్లకు గడువు విధించిన సెక్షన్ 21(5) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 05 , 2025 | 04:29 AM