Mahakumbh Mela : ధర్మ పరిరక్షణకు ‘సనాతన బోర్డు’
ABN, Publish Date - Jan 24 , 2025 | 04:43 AM
ఈ నెల 27వ తేదీన మహాకుంభమేళ సెక్టార్ 17లో జరగనున్న ‘ధర్మ సభ’లో ‘సనాతన బోర్డు’ రాజ్యాంగ ముసాయిదాను ప్రకటిస్తామని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక వేత్త దేవికానంద్ ఠాకూర్ వెల్లడించారు. గురువారం నిరంజని అఖాడాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
దేశ సమగ్రతను కాపాడేందుకు ఏర్పాటు చేయాలి
ఈ నెల 27న మహాకుంభమేళాలో ‘ధర్మ సభ’ నిర్వహణ
‘సనాతన బోర్డు’ రాజ్యాంగ ముసాయిదా ప్రకటిస్తాం: హిందూ సాధువులు
మహాకుంభ్ నగర్, జనవరి 23: ఈ నెల 27వ తేదీన మహాకుంభమేళ సెక్టార్ 17లో జరగనున్న ‘ధర్మ సభ’లో ‘సనాతన బోర్డు’ రాజ్యాంగ ముసాయిదాను ప్రకటిస్తామని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక వేత్త దేవికానంద్ ఠాకూర్ వెల్లడించారు. గురువారం నిరంజని అఖాడాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మన ధర్మానికి (మతం) స్వేచ్ఛ లేదు. మన ఆలయాలను ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. మన గురుకులాలను మూసివేస్తున్నారు. గోమాతలు వీధుల్లో తిరుగుతున్నాయి.. ఈ క్రమంలో మన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోయేందుకు సనాతన బోర్డు అవసరం’ అని పేర్కొన్నారు. ధర్మసభకు అన్ని అఖాడాల ప్రతినిధులు, నలుగురు శంకరాచార్యుల ప్రతినిధులు, తదితరులు హాజరవుతారని చెప్పారు. సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అది జరగకుండా కుంభమేళాను వదిలి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. జునా అఖాడాకు చెందిన మహంత్ స్వామి యతీంద్రానంద్ గిరి మాట్లాడుతూ. సనాతన బోర్డు భారతదేశానికే కాదు.. మొత్తం మానవాళికి అవసరమని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, ద్వేషం, అరాచకాలను నిర్మూలించవచ్చన్నారు. నిరంజని అఖాడా సీనియర్ మహామండలేశ్వర్, ఉజ్జయిని అర్జి హనుమాన్ ఆలయ మహంత్ స్వామి ప్రేమానంద్ పూరీ మాట్లాడుతూ.. గంగానది భూమి వక్ఫ్ బోర్డుకు చెందిందని కొంత మంది వాదిస్తున్నారని, సూర్యుడు పుట్టినప్పటి నుంచి సనాతన ధర్మం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నామన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు సనాతన బోర్డు ఏర్పాటు చాలా ముఖ్యమని అన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు సనాతన బోర్డు ఏర్పాటు అవసరమని ఆనంద్ అఖాడాకు చెందిన స్వామి బాలంకానంద గిరి మహారాజ్, పీఠాధీశ్వర్ స్పష్టం చేశారు.
10 కోట్ల భక్తుల పైగా పుణ్యస్నానాలు
పది రోజులుగా కొనసాగుతున్న మహా కుంభమేళాలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య గురువారం మధ్యాహ్నానికి 10 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కుంభమేళ జరుగుతున్న ప్రాంతం నుంచి దాదాపు 300 అక్రమ వంట గ్యాస్ సిలిండర్లను అగ్నిమాపక శాఖ గురువారం స్వాధీనం చేసుకుంది.
Updated Date - Jan 24 , 2025 | 04:43 AM