PM Modi: పరీక్ష విద్యార్థికి శిక్ష కారాదు
ABN, Publish Date - Feb 11 , 2025 | 05:07 AM
‘పరీక్షా పే చర్చ’ ఎనిమిదో ఎడిషన్‌లో భాగంగా సోమవారం విద్యార్థులతో ఆయన నేరుగా మాట్లాడారు. ఎంపిక చేసిన 35 మంది విద్యార్థులను ఢిల్లీలోని సుందర్ నర్సరీలో ఆయన కలుసుకుని ముచ్చటించారు.
‘పరీక్షా పే చర్చా’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: స్టేడియం నుంచి రణగొణధ్వనులు వినిపిస్తున్నా, మైదానంలోని బ్యాట్స్‌మన్ చూపంతా బాల్ మీదే ఉంటుందని, విద్యార్థులు కూడా అలాంటి కేంద్రీకరణతో పరీక్షలకు సిద్ధం కావాలని ప్రధాని మోదీ అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ ఎనిమిదో ఎడిషన్‌లో భాగంగా సోమవారం విద్యార్థులతో ఆయన నేరుగా మాట్లాడారు. ఎంపిక చేసిన 35 మంది విద్యార్థులను ఢిల్లీలోని సుందర్ నర్సరీలో ఆయన కలుసుకుని ముచ్చటించారు. దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ చర్చలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. ఆ వివరాలు ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఈ చర్చ సందర్భంగా పరీక్షల పట్ల విద్యార్థుల్లో ఉండే భయాలను తొలగించడానికి మోదీ ప్రయత్నించారు. అదే సమయంలో విద్యార్థుల్లోని అభిరుచిని తెలుసుకుని వారిని ఆ వైపు గా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్య అనేది సమగ్ర అభివృద్ధికి సాఽధనం అనేది ఉపాధ్యాయులు గ్రహించాలని కోరారు. ‘‘పరీక్షలు వేరు.. జ్ఞానం వేరు. పరీక్షలతో మొదలై, వాటితోనే జీవితం అంతం అవుతుందని ఎవరూ భావించనక్కర్లేదు. చదువుల వద్దే విద్యార్థులను బంధించరాదు. వారు ఏ రంగంలో రాణించాలని అనుకుంటారో ఆ రంగంలో వారు ఎదిగించేందుకు తల్లిదండ్రులు సహకరించాలి. విద్యార్థులు తమ సమయాన్ని ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకోవాలి’’ అని సూచించారు. మోదీని విద్యార్థులు సరదాగా కొన్ని ప్రశ్నలు వేశారు.
పారిస్‌లో మోదీకి ఘన స్వాగతం
ఫ్రాన్స్, అమెరికా పర్యటనలో భాగంగా మోదీ సోమవారం రాత్రి పారిస్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ విందు ఏర్పాటు చేశారు. కాగా, బుధవారం నుంచి మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి యుద్ధ వాహనాల కొనుగోలు, ఉత్పత్తిలో భాగస్వామ్యంపై ఒప్పందం కుదరనుంది.
Updated Date - Feb 11 , 2025 | 05:07 AM