Kerala: ప్రియుడి హత్య కేసులో యువతికి మరణశిక్ష
ABN, Publish Date - Jan 21 , 2025 | 04:08 AM
ప్రియుడికి ఆయుర్వేద టానిక్‌లో విషమిచ్చి హత్య చేసిన కేసులో కేరళలోని స్థానిక కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.
కేరళ కోర్టు సంచలన తీర్పు
2022లో ప్రియుడికి విషమిచ్చి హత్య చేసిన 24 ఏళ్ల నిందితురాలు
తిరువనంతపురం, జనవరి 20: ప్రియుడికి ఆయుర్వేద టానిక్‌లో విషమిచ్చి హత్య చేసిన కేసులో కేరళలోని స్థానిక కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. రెండేళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ కేసులో దోషిగా తేలిన గ్రీష్మ (24)కు మరణ శిక్ష విధించింది. హత్య కేసుకు సంబంధించి సాఽక్ష్యాలను నాశనం చేసిన ఆమె బంధువు ఒకరికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే ఈ కేసులో మరో నిందితురాలిగా ఉన్న గ్రీష్మ తల్లికి వ్యతిరేకంగా ఎలాంటి సాఽక్ష్యాధారాలు లేనందున ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసుపై విచారణ జరిపిన నెయ్యాట్టింకర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు.. గత వారం గ్రీష్మను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. పాల్పడిన నేరం తీవ్రత కంటే నిందితురాలి వయసును పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
చదువులో సాధించిన విజయాలు, గతంలో నేర చరిత్ర లేకపోవడం, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు అయినందున.. శిక్ష విధింపులో కొంత దయ చూపాలని నిందితురాలు కోరింది. కాగా, కేరళలో మరణ శిక్ష ఎదుర్కొంటున్న అతి పిన్న వయస్కురాలు గ్రీష్మనే కావడం గమనార్హం. షారోన్ రాజ్, గ్రీష్మ ఇద్దరు గతంలో ప్రేమించుకొనే వారు. అయితే గ్రీష్మకు తమిళనాడుకు చెందిన ఓ ఆర్మీ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బంఽధాన్ని ముగిద్దామన్న గ్రీష్మ ప్రతిపాదనకు రాజ్ తిరస్కరించడంతో.. 2022లో ఆయుర్వేద టానిక్‌లో పారాక్వాట్ అనే కలుపు మందును కలిపి ఇచ్చింది. 11 రోజుల తర్వాత పలు అవయవాల వైఫల్యంతో షారోన్ మరణించాడు.
Updated Date - Jan 21 , 2025 | 04:08 AM