Dental Health: పెద్దల పలువరస పక్కాగా...
ABN, Publish Date - Jan 21 , 2025 | 03:40 AM
పెద్ద వయసులో దంత సమస్యలు సహజమే! అయితే వాటిని సరిదిద్దడానికి దవడల అరుగుదల, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు అడ్డుపడొచ్చు.
పెద్ద వయసులో దంత సమస్యలు సహజమే! అయితే వాటిని సరిదిద్దడానికి దవడల అరుగుదల, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు అడ్డుపడొచ్చు. వీటన్నిటినీ అధిగమించి, పలువరసను పక్కాగా చక్కదిద్దే దంత చికిత్సలు అందుబాటులోకొచ్చాయని భరోసా కల్పిస్తున్నారు వైద్యులు. వాటి గురించి తెలుసుకుందాం!
ఖాళీగా వదిలేస్తే...
ఊడిపోయిన దంతాల స్థానంలో కొత్త దంతాలను అమర్చుకోవడం కూడా తప్పనిసరి. లేదంటే దవడలు హెచ్చుతగ్గులకు లోనై దవడ కీళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆహారం తినే సమయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఉన్న దంతాల ఆసరాతో ఖాళీలను భర్తీ చేసే సెరామిక్ లేదా జెర్కోనియం బ్రిడ్జెస్‌ను అమర్చుకోవలసి ఉంటుంది. ఇంప్లాంట్ ప్రాస్థటిక్స్... సెరామిక్, జెర్కోనియం లేదా అక్రిలిక్‌లతో తయారవుతాయి. స్థోమతను బట్టి తగినదాన్ని ఎంచుకోవచ్చు. ఈ కృత్రిమ దంతాలన్నీ 10 నుంచి 20 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. నోట్లో అమర్చే మొత్తం పళ్ల సెట్టు (కంప్లీట్ డెంచర్స్) ఐదు నుంచి ఆరేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది.
‘వయసైపోయింది కాబట్టి, దంతాలు ఊడిపోవడం సహజమే! ఇక ఈ వయసులో కొత్త దంతాలు కట్టించుకోవలసిన అవసరం ఏముంది?’ అనే నిర్లిప్తత ఎక్కువ మంది పెద్దల్లో ఉంటుంది. కొందరికి కొన్ని దంతాలు ఊడిపోయి, కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. ఇంకొందరికి దంతాలన్నీ ఊడిపోయి, నోరు బోసిపోతుంది. ఇంకొందరికి దంతాల మూలాలు పుచ్చిపోతూ ఉంటాయి. ఎక్కువ మందికి దంతాలన్నీ అరిగిపోతూ ఉంటాయి.
సున్నితత్వ సమస్య తీవ్రంగా ఉండి చల్లని, వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు దంతాలు జివ్వుమంటూ ఉంటాయి. ఇవన్నీ తప్పనిసరిగా సరిదిద్దుకోవలసిన సమస్యలే! ఎందుకంటే.. పెద్ద వయసులో ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యం ఎంతో కొంత సన్నగిల్లి ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు మొదలైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే ఎముకల అరుగుదల, బలహీనతలు ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ మందులతో పాటు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం అవసరం. కానీ పోషకాల అవసరత ఎక్కువగా ఉండే పెద్ద వయసులోనే దంత సమస్యలు కూడా ఎక్కువవుతాయి. దాంతో ఆహారాన్ని పూర్తిగా నమిలి తినలేకపోవడం, పాక్షికంగా నమిలి మింగేయడం చేస్తూ ఉంటారు. ఫలితంగా పోషకలోపాలు తలెత్తడం, దాంతో శరీరం బలహీనపడి, ఆరోగ్య సమస్యలు తీవ్రమవడం... ఇలా మొత్తంగా ఆరోగ్యం క్షీణించే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి పెద్దలు దంత సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
కొత్త దంతాలు ప్రయోజనకరం
పెద్దల్లో ఊడిపోయిన దంతాల స్థానంలో కొత్త దంతాలు అమర్చడం వల్ల మూడు రకాల ప్రయోజనాలుంటాయి. దంతాలు లేవనే ఆత్మన్యూనతతో నలుగురిలో కలవడానికి వెనకాడే పెద్దల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. ఆహారాన్ని చక్కగా నమిలి తినగలిగే సౌలభ్యాన్ని అందించవచ్చు. దంతాల లోపంతో స్పష్టంగా మాట్లాడలేని పెద్దలకు చక్కగా మాట్లాడే సామర్ధ్యాన్ని పెంచవచ్చు. ఈ మూడు ప్రయోజనాలు కీలకమైనవే! వీటితో పెద్దలు, మానసికంగా, శారీరకంగా... రెండు విధాలా కోలుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరిగి, కుటుంబంతో అనుబంధాన్ని బలపరుచుకోగలుగుతారు, నలుగురితో కలవగలుగుతారు. నమిలి తినే ఇబ్బంది తొలగిపోతుంది కాబట్టి పోషకాహార లోపం సమస్య పరిష్కారమైపోయి, ఆరోగ్యం కూడా పుంజుకుంటుంది. కాబట్టి పాక్షిక దంత లోపాలు, దంతాలు, దంతాల మూలాలు పుచ్చిపోవడం లాంటి సమస్యలను రూట్ కెనాల్, ఫిల్లింగ్స్‌తో సరిదిద్దుకోవచ్చు. అలాగే దంతాలు లేని వాళ్లకు తీసి పెట్టుకోగలిగే లేదా శాశ్వతంగా అమర్చగలిగే కృత్రిమ దంతాలను ఆశ్రయించవచ్చు.
కృత్రిమ దంతాలు ఇలా...
తీసి పెట్టుకోగలిగే దంతాలకూ, శాశ్వత దంతాలకూ వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా పెద్దల్లో దవడ ఎముకలు అరిగిపోయి ఉంటాయి. కొందర్లో ఇంప్లాంట్ బిగించడానికి వీలు లేనంత పలుచగా ఉంటాయి. దాంతో, వాళ్లు తీసి, పెట్టుకోగలిగే దంతాలను ఎంచుకుంటే, ఆ డెంచర్ దవడ మీద సక్రమంగా ఇమడకుండా కదులుతూ ఉంటుంది. అలాగే మాట్లాడేటప్పుడు డెంచర్ ఊడిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇంప్లాంట్ డెంటిస్ట్రీ అభివృద్ధి సాధించినప్పటి నుంచీ, తీసి, పెట్టుకునే దంతాలతో పాటు శాశ్వత దంతాలను అమర్చే అధునిక చికిత్సలు ఊపందుకున్నాయి. దవడ ఎముక పలుచగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించే వైద్యపరమైన వెసులుబాట్లు వాడుకలోకొచ్చాయి. అరిగిపోయిన పై దవడలోకి బిగించే ‘టెరిగాయిడ్ డెంటల్ ఇంప్లాంట్స్’, బుగ్గ ఎముకల్లోకి బిగించే ‘జైగోమ్యాటిక్ డెంటల్ ఇంప్లాంట్స్’, వ్యక్తి నోటి నిర్మాణానికి తగిన ఇంప్లాంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంతకు ముందు వరకూ దవడలోకి స్ర్కూలు బిగించే ఇంప్లాంట్స్ అందుబాటులో ఉండేవి. కానీ వాటి కోసం దవడ ఎముక దృఢంగా, సరిపడా మందంగా ఉండాలి. పెద్దల్లో దవడ ఎముక అరుగుదల సమస్య ఉంటుంది కాబట్టి ఆ రకమైన ఇంప్లాంట్స్ బిగించడం సాధ్యపడదు. బదులుగా ఆధునిక ఇంప్లాంట్స్‌ను అభివృద్ధి చేయడం జరిగింది.
ఆధునిక ఇంప్లాంట్స్ ఇలా...
దంతాలున్నంత వరకే దవడ ఎముకలు దృఢంగా ఉంటాయి. దంతాలు ఊడిపోయినప్పటి నుంచి వాటికి ఆసరా అందించే దవడ ఎముకలు అరిగిపోవడం మొదలుపెడతాయి. అయితే అలా దవడ ఎముకలు అరిగిపోయినా, బుగ్గ ఎముకలు మాత్రం దృఢంగానే ఉంటాయి. కాబట్టి పొడవాటి ఇంప్లాంట్‌ను బుగ్గల ఎముకల్లోకి అమర్చి, వాటి ఆధారంగా కృత్రిమ దంతాలను అమర్చవచ్చు. అలాగే పై దవడ ఎముక చివరన ఇంప్లాంట్స్‌ను అమర్చవచ్చు. ఇలా ఇంప్లాంట్స్ అమర్చడానికి లోకల్ అనస్థీషియా సరిపోతుంది. అలాగే ఇలాంటి ఇంప్లాంట్స్ అమర్చిన తర్వాత, ఎక్కువ కాలం ఆగకుండా వెంటనే కృత్రిమ దంతాలను బిగించుకోవచ్చు. అయితే ఎవరికి ఎలాంటి ఇంప్లాంట్స్ అవసరమన్నది తెలుసుకోవడం కోసం కోన్ బీమ్ సిటి స్కాన్ చేయవలసి ఉంటుంది. ప్రత్యేకించి నోట్లోని ఎముకల కోసం ఉద్దేశించిన ఈ సిటి స్కాన్‌లో రేడియేషన్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ స్కాన్ ఆధారంగా ఏ ఎముకలో ఇంప్లాంట్ అమర్చుకోవచ్చు అన్నది వైద్యులు నిర్ణయిస్తారు. అయితే తక్కువ ఖర్చులో కృతిమ దంతాలు పెట్టించుకోవాలనుకునేవాళ్లకు తీసి, పెట్టుకునే పళ్ల సెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే పైదవడలో ఇమిడిపోయినంత మెరుగ్గా కింది దవడ మీద పళ్ల సెట్టు ఇమడకపోవచ్చు. ఇలాంటప్పుడు కింది దవడలో రెండు ఇంప్లాంట్స్‌తో సరిపెట్టి, ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్‌ను అమర్చుకోవచ్చు. స్క్యూ బటన్‌ను పోలిన, తీసి పెట్టుకోగలిగే ఈ కృత్రిమ సెట్టు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే కింది దవడ అరిగిపోయి, ఎత్తు తగ్గిపోతుంది కాబట్టి ఇంప్లాంట్‌ను ఏటవాలుగా అమర్చే పద్ధతిని కూడా వైద్యులు అనుసరిస్తూ ఉంటారు.
కొన్ని హైపర్ టెన్షన్, హృద్రోగ ఔషధాలు చిగుళ్లు దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి ఈ మందుల వాడకం మొదలుపెట్టిన తర్వాత తరచూ చిగుళ్ల సమస్యలు తలెత్తుతూ ఉంటే, సంబంధిత వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. అలాగే దంత చికిత్సలను ఆశ్రయించే హృద్రోగులు, రక్తాన్ని పలుచన చేసే మందులను తాత్కాలికంగా ఆపవలసి వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. పెద్దల్లో నోరు పొడిబారిపోయే సమస్య కూడా ఎక్కువే! ఈ సమస్య కూడా దంత సమస్యలను పెంచుతుంది. ఈ సమస్య ఉన్న పెద్దలు కృత్రిమంగా లాలాజలాన్ని ఉత్పత్తి చేసే మౌత్ వాష్‌లు వాడుకోవాలి.
డాక్టర్ సి. శ రత్ బాబు
ప్రోస్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్,
మెడికవర్ హాస్పిటల్స్, హైదరాబాద్
Updated Date - Jan 21 , 2025 | 03:40 AM