Maharashtra: ప్రయాణికులపై నుంచి దూసుకెళ్లిన రైలు: పలువురు మృతి
ABN, Publish Date - Jan 22 , 2025 | 06:13 PM
Maharashtra: మహారాష్ట్రలోని జలగావ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు.
ముంబై, జనవరి 22: మహారాష్ట్రలోని జలగావ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకొన్న ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలు లక్నో నుంచి ముంబై వెళ్తోంది. బుధవారం సాయంత్రం 4.19 గంటలకు పరందా రైల్వే స్టేషన్ సమీపంలో.. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల వద్ద నుంచి భారీగా పొగలు వచ్చాయి. దీంతో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వదంతులు వ్యాపించాయి. దాంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ వెంటనే రైలు చైన్ లాగారు. పలువురు ప్రయాణికులు రైలు నుంచి కిందకి దూకారు. అనంతరం వారంతా రైలు పట్టాలను దాటేందుకు ప్రయత్నించారు.
సరిగ్గా అదే సమయంలో బెంగళూరు నుంచి వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్.. వారిపై నుంచి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.
ఈ ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
For National New And Telugu News
Updated Date - Jan 22 , 2025 | 06:48 PM