Amritsar : 104 మంది తిరిగొచ్చారు
ABN, Publish Date - Feb 06 , 2025 | 04:40 AM
అమెరికా నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులతో బయల్దేరిన విమానం బుధవారం అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. సీ-17 సైనిక విమానం మధ్యాహ్నం 1.55 గంటలకు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అమెరికా నుంచి వచ్చిన వారిలో 30 మంది పంజాబ్‌కు చెందిన వారు కాగా.. హరియాణా, గుజరాత్‌కు
అమృత్‌సర్‌లో దిగిన అమెరికా విమానం
పంజాబీలు 30 మంది,
హరియాణా-33, గుజరాత్-33
భారతీయులకు సంకెళ్లు వేసి
అవమానించారు: కాంగ్రెస్
సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం
మోదీ సర్కారుపై విమర్శలు
ఆ ఫొటోలు నకిలీవని నిర్ధారణ..
అవి గ్వాటమాలాకు తరలించిన వారివి
హెచ్1బీ వీసాదారులకు ఇక్కట్లు!
ఆటో రెన్యువల్ కాలపరిమితి పెంపు
రద్దుకు రిపబ్లికన్ల తీర్మానం
గాజాను స్వాధీనం చేసుకొని
ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం: ట్రంప్
అమృత్‌సర్, ఫిబ్రవరి 5: అమెరికా నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులతో బయల్దేరిన విమానం బుధవారం అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. సీ-17 సైనిక విమానం మధ్యాహ్నం 1.55 గంటలకు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అమెరికా నుంచి వచ్చిన వారిలో 30 మంది పంజాబ్‌కు చెందిన వారు కాగా.. హరియాణా, గుజరాత్‌కు చెందిన వారు 33 మంది చొప్పున ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, చండీగఢ్ వాసులు ఇద్దరు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలుత, విమానంలో 205 మంది వస్తున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు కేవలం 104 మందే వచ్చారు. అమృత్‌సర్ చేరుకున్న వారిలో 25 మంది మహిళలు, 12 మంది మైనర్లు ఉన్నారని.. వీరిలో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 48 మంది 25 ఏళ్లలోపు వారు ఉన్నట్లు సమాచారం. 11 మంది విమాన సిబ్బంది, వలసదారుల అప్పగింత కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 45 మంది అమెరికా అధికారులు కూడా విమానంలో వచ్చినట్లు తెలిసింది. అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అక్రమ వలసదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు. అన్ని తనిఖీలు పూర్తి చేసిన తర్వాతే అక్రమ వలసదారులను వారి సొంత ప్రాంతాలకు పంపిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, అమెరికా నుంచి వెనక్కి పంపేసిన వలసదారులకు అండగా ఉండేందుకు పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ (నాపా) పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రానికి మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, అమెరికా అధికారుల లెక్కల ప్రకారం.. 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. 17,940 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ఈఆర్‌వో) నిర్బంధంలో ఉన్నారు. తొలివిడతలో భాగంగా 104 మందిని వెనక్కి పంపించారు.
ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది. ఇప్పటికే కొంతమందిని సైనిక విమానాల్లో గ్వాటమాలా, పెరూ, హోండూరస్ తదితర దేశాలకు తరలించింది. కాగా, అక్రమ వలసదారులంటూ భారతీయుల చేతులకు సంకెళ్లు వేసి విమానంలో తరలించడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి భారతీయులను అలా అవమానకరంగా విమానంలో తరలించిన ఫొటోలు చూసి, ఒక భారతీయుడిగా ఎంతో బాధపడ్డానని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం హెడ్ పవన్ ఖేరా చెప్పారు. 2013లో భారత దౌత్యాధికారి దేవయానికి సంకెళ్లు వేసి తనిఖీలు చేసి, అవమానించినప్పుడు నాటి యూపీఏ సర్కారు తీవ్రంగా స్పందించిందని గుర్తుచేశారు. ప్రధాని మన్మోహన్ కూడా అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారన్నారు. అదేసమయంలో భారత పర్యటనకు వచ్చిన అమెరికా ప్రతినిధి బృందాన్ని కలిసేందుకు రాహుల్‌గాంధీ, మీరా కుమార్‌లు నిరాకరించారని ఎక్స్‌లో పేర్కొన్నారు. చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసిన వలసదారుల ఫొటోలపై సోషల్‌మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు భారతీయులవి కావని, నకిలీవని తేల్చారు. అవి జనవరి 30న అమెరికా నుంచి గ్వాటమాలాకు తరలించిన అక్రమ వలసదారుల ఫొటోలని ఫ్యాక్ట్‌చెక్‌లో తేల్చారు.
హెచ్1బీ వీసాదారులకు ఇక్కట్లు!
వాషింగ్టన్, ఫిబ్రవరి 5: హెచ్1బీ, ఎల్ వర్క్ పర్మిట్లపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు ట్రంప్ సర్కారు భారీ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి! ఆ వీసాల ఆటో రెన్యువల్ కాలపరిమితిని 180 రోజుల నుంచి 540 రోజులకు పెంచుతూ బైడెన్ సర్కారు కిందటి సంవత్సరం డిసెంబరులో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ రిపబ్లికన్ సెనెటర్లు జాన్ కెనెడీ, రిక్ స్కాట్ ఇటీవలే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బైడెన్ హయాంలో సవరించిన ఈ నిబంధన జనవరి 13 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే.. భారతీయులకే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఎందుకంటే హెచ్ 1బీ, ఎల్ 1 వీసాలపై ఎక్కువగా వచ్చేది భారతీయులే. వర్క్ వీసాల ఆటోమేటిక్ రెన్యువల్ కాలావధిని 540 రోజులకు పెంచడం ప్రమాదకరమని.. వలస చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా అమెరికన్లను సురక్షితంగా ఉంచాలన్న ట్రంప్ సర్కారు ప్రయత్నాలకు అది విఘాతం కలిగిస్తుందని కెనెడీ పేర్కొన్నారు. మరోవైపు.. పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిషేధించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేయనున్నట్టు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ‘కీపింగ్ మెన్ అవుటాఫ్ వుమెన్స్ స్పోర్ట్స్’ పేరుతో ఈ ఆర్డర్‌ను జారీ చేయనున్నారు.
ఆ పార్శిళ్లకు నో!
చైనాపై ట్రంప్ సుంకాల కొరడా ఝుళిపించిన మర్నాడే.. అమెరికా తపాలా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే అన్ని పార్శిళ్లనూ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, మామూలు ఉత్తరాలు, ఉత్తరాలున్న కవర్లపై మాత్రం ఎలాంటి నిషేధమూ లేదని స్పష్టం చేసింది. 800 డాలర్ల కంటే తక్కువ విలువ ఉన్న ప్యాకేజీలను ‘డి మినిమిస్’ విధానం కింద అమెరికాలోకి సుంకాలు లేకుండా అనుమతించే విధానం ఇన్నాళ్లుగా అమల్లో ఉంది. అయితే, ఆ ప్యాకేజీల ద్వారా చైనా, మెక్సికో నుంచి డ్రగ్స్ అమెరికాలోకి దిగుమతి అవుతున్నాయని ఆరోపిస్తూ ట్రంప్ తాజాగా ఈ ‘డి మినిమిస్’ నిబంధనను రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh : జగన్ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh : జగన్ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..
Updated Date - Feb 06 , 2025 | 06:03 AM