ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: మాకేంటి?.. అహ! మాకేంటి?

ABN, Publish Date - Mar 02 , 2025 | 04:51 AM

అగ్ర రాజ్యంగా, పెద్దన్నగా, ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా దేశ అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలి కూడా అచ్చం అలాగే, ఆ సినిమాలోని లక్ష్మీపతి పాత్రలాగానే ఉంది!! అన్నిటికీ ఆయనది ఒకటేమంత్రం..

పాలనను వ్యాపారంగా మార్చిన ట్రంప్‌

అప్పుల సంక్షోభంలో అమెరికా

ఇలాగే కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ

అందుకే పాత నిర్ణయాలపై సమీక్ష

ఉక్రెయిన్‌కు సాయపడినందుకు అక్కడి సహజ వనరులు ఇవ్వాలంటూ బేరం

చైనాతో సత్సంబంధాలకు తైవాన్‌తో ఇప్పటి వరకూ ఉన్న వైఖరికి నీళ్లు

డబ్బులు ఖర్చయ్యే ఒప్పందాలకు టాటా

పెద్దన్న పాత్రను వదులుకుని ఇకపై మిగతా దేశాలలో ఒకటిగా అమెరికా

‘నాకేంటి? అహ! నాకేంటి?’.. గుర్తుందా? జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్‌ సినిమా ‘అహ నా పెళ్లంట’లో లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు) అనే పిసినారి పాత్రధారి మాటిమాటికీ అనే పాపులర్‌, సూపర్‌ హిట్‌ డైలాగ్‌ ఇది! డబ్బు తప్ప మరేదీ పట్టదా పీనాసి పేరయ్యకు!! కొన్ని వందల సంవత్సరాలుగా.. అగ్ర రాజ్యంగా, పెద్దన్నగా, ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా దేశ అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలి కూడా అచ్చం అలాగే, ఆ సినిమాలోని లక్ష్మీపతి పాత్రలాగానే ఉంది!! అన్నిటికీ ఆయనది ఒకటేమంత్రం.. ‘‘నాకేంటి? అహ! నాకేంటి’’ అని!! సరిగ్గా చెప్పాలంటే.. ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు లేదు.. ఓ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీని నడిపినట్టుగా పాలనా వ్యవహారాలు చేపడుతున్నారు! పెద్దన్న పాత్ర పోషిస్తూ వివిధ దేశాలు, సంస్థలకు ఇప్పటి వరకూ మానవతా సాయం చేసిన అమెరికా ఇప్పుడు ఆ భావనకు పూర్తిగా నీళ్లు వదిలేస్తోంది.

ట్రంప్‌ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వివిధ దేశాలకు ఆర్థిక సాయం ఆపేస్తున్నారు! దేశంలో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికే ప్రత్యేకంగా ఓ విభాగాన్నీ ఏర్పాటు చేశారు. వీసాలను అమ్ముకోవడానికీ సిద్ధపడుతున్నారు.


చివరికి, అమెరికా రక్షణ బడ్జెట్‌ను సగానికి సగం తగ్గించడానికి కూడా సిద్ధమయ్యారు. అమెరికా అప్పుల సంక్షోభంలో కూరుకుపోయి.. ఆర్థిక అత్యవసర స్థితి దిశగా పయనిస్తుందన్న ఆందోళనలే వీటన్నింటికీ కారణం. 2025 జనవరి నాటికి అమెరికా అప్పు 36 లక్షల కోట్ల డాలర్లు. అంటే.. దాదాపుగా రూ.31.47 కోట్ల కోట్లు (భారతదేశం అప్పు దాదాపుగా రూ.2 కోట్ల కోట్లు. అంటే అమెరికా అప్పు మనకన్నా ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు). ఈ అప్పు ఇలా పెరిగిపోతే అమెరికా ఆర్థిక అత్యవసర స్థితిలోకి వెళ్లిపోవడం ఖాయమని మస్క్‌ చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, వివిధ దేశాల్లోని సహజ వనరులను చెరబట్టి ఆదాయం పెంచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు పరస్పర పన్నుల వాదన కూడా ఇందులో భాగమే. అమెరికా తీవ్ర ద్రవ్య లోటుతో ఇబ్బంది పడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు కాస్తా 1.9 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.160 లక్షల కోట్లు)కు చేరింది. దాని నుంచి బయటపడేందుకు పరస్పర పన్నుల విధానాన్ని తెరపైకి తెచ్చి బలవంతంగానైనా అమలుకు సిద్ధమవుతున్నారు.



ఉక్రెయిన్‌ యుద్ధంతో వ్యాపారం

ప్రపంచంలో ప్రతి విషయంలో వేలుపెట్టి పెద్దన్న పాత్ర పోషిస్తూనే, తన ఆయుధ లాబీలకు, స్వలాభానికి ఉపయోగపడే పలు నిర్ణయాలను లోపాయకారీగా తీసుకోవడం అమెరికాకు అలవాటైన విద్య. కానీ, ట్రంప్‌ వచ్చాక ఆ లోగుట్లు, లోపాయకారీ వ్యవహారాలూ ఏవీ లేవు. ప్రతి అడుగు.. ప్రతి నిర్ణయం వ్యాపారమే. ఇందులో భాగమే.. ‘‘నేను నీకు ఇన్నాళ్లూ సహాయపడ్డాను, డబ్బులిచ్చాను కాబట్టి.. నీ భూభాగంలో ఉండే అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాల్లో సగం నాకు రాసిచ్చెయ్‌’’.. అని ఉక్రెయిన్‌ను నిస్సిగ్గుగా అడగడం. రష్యాతో యుద్ధానికి 500 బిలియన్‌ డాలర్ల సాయం చేసినందుకు బదులుగా 500 బిలియన్‌ డాలర్ల సహజ వనరులు ఇచ్చేయాలంటూ ట్రంప్‌ బేరం పెట్టారు. ఇందుకు ఒప్పందం చేసుకోవాలంటూ డిమాండూ చేశారు. శుక్రవారం ఓవల్‌ ఆఫీసులో వాగ్వాదమూ ఇందులో భాగమే. అంతేనా.. ఉక్రెయిన్‌పై రష్యా తన దండయాత్రకు ముగింపు పలికి, తన సేనలను ఆక్రమిత ఉక్రెయిన్‌ నుంచి ఉపసంహరించాలంటూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేస్తే.. నాటో కూటమిలో భాగస్వాములైన యూరప్‌ దేశాలు సహా 93 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. అదే నాటో కూటమిలో భాగమై, నిన్నమొన్నటిదాకా ఉక్రెయిన్‌కు ఆర్థిక, ఆయుధ సాయం చేసిన అమెరికా.. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది. తన ఆగర్భ శత్రువుగా భావించే రష్యాతో చేతులు కలిపి ఉక్రెయిన్‌ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది అమెరికా!



అఫ్ఘానిస్థాన్‌ నుంచీ..

అమెరికా కారణంగా సర్వ నాశనం అయిపోయిన అఫ్ఘానిస్థాన్‌ కూడా ట్రంప్‌ వదలడం లేదు. మొదటిసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పుడు అప్పటికి చాలాకాలంగా అఫ్గానిస్థాన్‌లో ఉన్న అమెరికన్‌ సేనలను వెనక్కి రప్పించి ఆ దేశాన్ని తాలిబాన్ల చేతుల్లో పెట్టేయడానికి రంగం సిద్ధం చేసి, అక్కడ అమెరికన్‌ సైనికుల సంఖ్యను 13,500 నుంచి 2,500కు తగ్గించిన విషయం తెలిసిందే. అఫ్ఘానిస్థాన్‌ కొండలు గుట్టల్లో వేలాదిమంది అమెరికన్‌ సేనలను మోహరించి సాధించేదేమిటి? ఖర్చు తప్ప.. అన్నది ట్రంప్‌ వాదన. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన ట్రంప్‌.. ‘అప్పట్లో మా వాళ్లు వందల కోట్ల డాలర్ల విలువైన పరికరాలు, ఆయుధాలు, యుద్ధ వాహనాలను అక్కడ వదిలేసి వచ్చారు. వాటన్నింటినీ ఇప్పుడు మాకిచ్చేయండి’ అని డిమాండ్‌ చేస్తున్నారు.

తైవాన్‌ ఏమైతే నాకేంటి!?

ఇప్పటి వరకూ తైవాన్‌కు అమెరికా పరోక్షంగా మద్దతు ఇస్తే.. ఇప్పుడు ట్రంప్‌ ఆ బాధ్యత నుంచి వైదొలగుతున్నారు. నిజానికి.. తైవాన్‌పై అమెరికా 1979 నుంచీ ‘వ్యూహాత్మక అస్పష్టత’ విధానాన్ని అవలంబిస్తోంది! అంటే.. తైవాన్‌తో ఎలాంటి సంబంధాలూ లేనట్టు పైకి నటిస్తూనే, తెర వెనుక ఆ దేశానికి అన్ని విధాలా అండగా నిలబడడం. ఇప్పుడు ట్రంప్‌... తనకు అలాంటి శషభిషలేవీ లేవని, అలాంటి డొంక తిరుగుడు విధానం తనది కాదని.. కుండబద్దలుగొట్టి చెప్పేశారు. తైవాన్‌ ఏమైతే నాకేంటి అన్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. పైపెచ్చు తనకు చైనాతో సత్సంబంధాలు ముఖ్యమని ట్రంప్‌ తేల్చి చెప్పారు.



పెద్దన్న కాదు.. అందర్లో ఒకడే!

అగ్రరాజ్యం పేరిట అమెరికా ఇప్పటి వరకూ పెద్దన్న పాత్ర పోషించింది. ప్రజాస్వామ్య వికాసం, ఆరోగ్య సంక్షేమం తదితరాల పేరిట నిధులు ఇచ్చేది. చిన్న దేశాలను ఆర్థికంగా ఆదుకునేది. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్‌ వ్యవహారశైలి ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా మారింది. ఎలాగంటే.. బాగా డబ్బున్న ఒక వ్యక్తి.. ఆపదలో/అవసరంలో ఉన్నవారికి ఎంతో కొంత సాయంచేస్తూ.. ‘నేను నీకు ఇది ఇస్తున్నా. మరి నువ్వు నాకు ఏమిస్తావు?’ అని అడిగితే ఎలా ఉంటుంది’ ఇప్పుడు అమెరికా వైఖరీ అచ్చు ఇలాగే ఉంది!!

వీసాల అమ్మకంతో ఆదాయం

ఆదాయాన్ని పెద్దఎత్తున పెంచుకోవడం, తద్వారా, ద్రవ్య లోటును తగ్గించుకోవడమే ధ్యేయంగా అమెరికా వీసాల అమ్మకానికీ సిద్ధపడింది. 50 లక్షల డాలర్ల (రూ.43.5 కోట్లు)కు గోల్డెన్‌ వీసా ఇస్తామని ప్రకటిచించింది. ఈ క్రమంలోనే.. ఒక్కొక్కరికీ రూ.43.5 కోట్ల చొప్పున.. కోటి మందికి గోల్డెన్‌ వీసాలు అమ్మి అమెరికా అప్పు మొత్తం తీర్చేసే ప్లాన్‌ ట్రంప్‌ వేశారనే జోకులు వైరల్‌ అవుతున్నాయి.

గ్రీన్‌ల్యాండ్‌లో నిక్షేపాల కోసం..

గ్రీన్‌లాండ్‌ ద్వీపం భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలోనిదే అయినా, తొలి నుంచీ అది డెన్మార్క్‌ అధీనంలోనే ఉంది! ఇప్పుడు ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌లోని ఖనిజవనరుల కోసం డెన్మార్క్‌ను బెదిరిస్తున్నారు. ‘బలవంతుడిదే రాజ్యం’ తరహాలో.. డెన్మార్క్‌కు ఇష్టం లేకపోయినా స్వాధీనం చేసుకుంటామంటున్నారు.


ఒప్పందాల నుంచీ బయటకు..

అది ఎంత పెద్ద అంతర్జాతీయ ఒప్పందమైనా సరే.. దాన్ని గౌరవించడం ట్రంప్‌కు తెలియదు. అమెరికా ప్రయోజనాల పేరుతో తన బుద్ధికి తోచింది చేయడమే ఆయనకు తెలిసిన విద్య. ఉదాహరణకు.. పారిశ్రామిక యుగానికి ముందుతో పోలిస్తే భూతాపం 1.5 డిగ్రీలకు మించి పెరగకూడదంటూ ప్రపంచదేశాలన్నీ కలిసి 2015లో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి ట్రంప్‌ అర సెకనుపాటైనా ఆలోచించకుండా అర్ధంతరంగా వైదొలగారు! కొవిడ్‌ మహమ్మారి సమయంలో సరిగ్గా పని చేయలేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా అమెరికా వైదొలగుతున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. ఎయిడ్స్‌ వంటి మహమ్మారుల నిర్మూలనకు అమెరికా ఇప్పటి వరకూ వివిధ దేశాలకు ఆర్థిక సాయం చేసేది. ఇప్పుడు ట్రంప్‌ వాటిని నిలిపివేశారు. ట్రంప్‌ మొదటిసారి పాలనతో పోలిస్తే.. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టాక ఆయన తీరు చాలా మారింది. గత నెలన్నరగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎక్కువగా డబ్బుతో ముడిపడినవే అయి ఉండడం ఇందుకు నిదర్శనం. అగ్నికి వాయువు తోడైనట్టు.. ట్రంప్‌కు ఈసారి.. ‘పెట్టుబడిదారుడు’ అనే పదానికి నిలువెత్తు ఉదాహరణగా పేరొందిన మస్క్‌ తోడవడంతో పరిస్థితి మరింత ఘోరంగా మారింది.




ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 04:51 AM