Aga Khan : ఆగాఖాన్ కన్నుమూత
ABN, Publish Date - Feb 06 , 2025 | 04:50 AM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ‘హిజ్ హైనెస్ ప్రిన్స్’ కరీం అల్ హుస్సేనీ ఆగాఖాన్-4(88) పోర్చుగల్‌లోని లిస్బన్‌లో మంగళవారం మృతి చెందారు. స్విట్జర్లాండ్‌లో 1936 డిసెంబరు 13న జన్మించిన ఆగాఖాన్-4ని విద్యార్థిగా ఉండగా 20ఏళ్లకే ఆయన తాత(ఆగాఖాన్-3) తన
సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ
నేటి సంక్షుభిత ప్రపంచంలో ఆగాఖాన్ శాంతి, కరుణ,
సహనానికి ప్రతిరూపం: ఐరాస ప్రధాన కార్యదర్శి
ఆరోగ్యం, గృహ నిర్మాణం, విద్యారంగాల్లో 30కి పైగా
దేశాల్లో ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ సేవలు
పారిస్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ‘హిజ్ హైనెస్ ప్రిన్స్’ కరీం అల్ హుస్సేనీ ఆగాఖాన్-4(88) పోర్చుగల్‌లోని లిస్బన్‌లో మంగళవారం మృతి చెందారు. స్విట్జర్లాండ్‌లో 1936 డిసెంబరు 13న జన్మించిన ఆగాఖాన్-4ని విద్యార్థిగా ఉండగా 20ఏళ్లకే ఆయన తాత(ఆగాఖాన్-3) తన వారసుడిగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ ముస్లింల 49వ ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన ఆగాఖాన్-4 పెద్ద వ్యాపారవేత్తగా, దాతగా పేరుంది. సుదీర్ఘకాలం ఫ్రాన్స్‌లో జీవించిన ఆయన గత కొన్నేళ్లుగా పోర్చుగల్‌లో ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఆయన మృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ ముస్లింలు సంతాపం పాటించారు. నేటి ప్రపంచంలో ఆగాఖాన్ శాంతి, సహనం, కరుణకు ప్రతిరూపమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మంచి స్నేహితుడు, కారుణ్యశీలి అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కొనియాడారు. కాగా 1957 జూలైలో ఇంగ్లండు రాణి ఎలిజబెత్ ఆయనకు ‘హిజ్ హైనెస్’ గౌరవాన్ని ప్రకటించారు. మన దేశం 2015లో పద్మవిభూషణ్ అవార్డు ప్రదానం చేసింది. ఆయన స్థాపించిన ‘ఆగాఖాన్ డెవల్‌పమెంట్ నెట్‌వర్క్’అనే సేవా సంస్థ పేదల ఆరోగ్యం, గృహ నిర్మాణం, విద్య, గ్రామీణ ప్రాంతాల ప్రగతికి 30కి పైగా దేశాల్లో పనిచేస్తోంది. దీని వార్షిక బడ్జెట్ ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు. ఆయన పేరిట బంగ్లాదేశ్, తజకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి పలు దేశాల్లో పేదల కోసం ఆస్పత్రులు నిర్మించారు. ఇస్మాయిలీ ముస్లింలు భారత్‌తోపాటు తూర్పు ఆఫ్రికా, మధ్య, దక్షిణ ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో ఉన్నారు. కాగా ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన చేసిన కృషి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. ఆగాఖాన్ మృతికి విచారం వ్యక్తం చేశారు. కాగా ఆగాఖాన్-4 హైదరాబాద్ నగరాన్ని పలుమార్లు సందర్శించారు. కుతుబ్ షాహీల సమాధుల పునరుద్ధరణకు ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ద్వారా 2013లో చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో పలు వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. ఆయన మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.
నూతన ఆగాఖాన్‌గా రహీం అల్-హుస్సేనీ
కొత్త ఆగాఖాన్‌గా రహీం అల్-హుస్సేనీని నియమించారు. ఆగాఖాన్-4 కోరిక మేరకు ఆయన కుమారుడు రహీంను ఆగాఖాన్-5గా నియమిస్తూ ప్రకటన వెలువడింది. షియా ఇస్మాయిలీ ముస్లిం ఇమామ్‌ల పరంపరలో 50వ వారసుడు రహీం హుస్సేనీ.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh : జగన్ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..
Updated Date - Feb 06 , 2025 | 04:50 AM