Donald Trump : అమెరికాలో జన్మతః పౌరసత్వంపై వేటు
ABN, Publish Date - Jan 22 , 2025 | 01:55 AM
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. మొదటి రోజే ఉత్తర్వుల వర్షం కురిపించారు! ఆ దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తొలిరోజే డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో సంచలనం సృష్టించారు. అందులో ప్రధానమైనది.. అమెరికాలో పుట్టినవారికి ఆటోమేటిగ్గా
ఉత్తర్వుల ఉప్పెన!
అమెరికాలోని లక్షలాది భారతీయుల ఆశలపై నీళ్లు
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ సంచలనాలు
డజన్ల కొద్దీ పాలనా ఉత్తర్వులపై వరుసగా సంతకాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికి అమెరికా!
2015 నాటి పర్యావరణ ఒప్పందం నుంచీ నిష్క్రమణ
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు
లింగవైవిధ్యానికి చెల్లు.. ఇక స్త్రీ, పురుష లింగాలు మాత్రమే
ఫెడరల్ ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం రద్దు
క్యాపిటల్ భవనంపై దాడి నిందితులకు క్షమాభిక్ష
వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షల ఎత్తివేత
టిక్‌టాక్‌పై నిషేధం అమలు 75రోజులపాటు వాయిదా
ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికోపై 25 శాతం సుంకాలు?
వాషింగ్టన్ డీసీ, జనవరి 21: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. మొదటి రోజే ఉత్తర్వుల వర్షం కురిపించారు! ఆ దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తొలిరోజే డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో సంచలనం సృష్టించారు. అందులో ప్రధానమైనది.. అమెరికాలో పుట్టినవారికి ఆటోమేటిగ్గా పౌరసత్వాన్ని ప్రసాదించే హక్కును రద్దు చేసే ఉత్తర్వు! ఉద్యోగాల నిమిత్తం అమెరికాలో ఉంటూ.. ఆగడ్డపై పిల్లలను కనడం ద్వారా కనీసం వారికైనా పౌరసత్వం దక్కుతుందని ఆశిస్తున్న లక్షలాది మంది ప్రవాసభారతీయులకు ఈ ఉత్తర్వు అశనిపాతమే! అదొక్కటే కాదు.. ఇంధన రంగం, పర్యావరణం, వలసలు, విదేశాంగ విధానం.. ఇలా పలు రంగాలకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. సాధారణంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినవారు.. వైట్‌హౌ్‌సలోని తమ కార్యాలయానికి వెళ్లిన తర్వాత పని మొదలుపెట్టడం కద్దు! కానీ.. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసీచేయగానే, అక్కడికక్కడే తన ఉత్తర్వుల దండయాత్ర మొదలుపెట్టారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ గతంలో జారీ చేసిన 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుపై తొలి సంతకం పెట్టారు. పాలనపై తన ప్రభుత్వం పూర్తిస్థాయిలో పట్టు సాధించేదాకా ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిబంధనలూ జారీ చేయకుండా నిషేధించే ఉత్తర్వుపై మలి సంతకం.. అప్పటిదాకా సైన్యం, కొన్ని కీలక రంగాల్లో మినహా ఫెడరల్ ఉద్యోగాల నియామకాలను నిలిపివేసే ఉత్తర్వుపై మూడో సంతకం చేశారు. ఆ తర్వాత.. ఫెడరల్ ఉద్యోగులు ప్రత్యక్షంగా ఆఫీసుకు వచ్చి, పూర్తి సమయం పనిచేయడాన్ని తప్పనిసరి చేస్తూ నాలుగో ఉత్తర్వు జారీ చేశారు.
పెరుగుతున్న జీవన వ్యయం సమస్యను పరిష్కరించే బాధ్యతను అన్ని ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలపై పెడుతూ ఐదో ఉత్తర్వు.. పారి్‌సలో 2015లో కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగుతూ ఆరో ఉత్తర్వు.. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షిస్తూ ఏడో ఉత్తర్వు.. రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపే విధానానికి చెక్‌పెడుతూ (ఎండింగ్ ద వెపనైజేషన్ ఆఫ్ ఫెడరల గవర్న్‌మెంట్) ఎనిమిదో ఉత్తర్వు జారీ చేశారు! అలాగే.. తన క్యాబినెట్ సహచరులు, సీఐఏ డైరెక్టర్, ఇతరత్రా కీలక పదవులకు సంబంధించి నియామక ఉత్తర్వులపైనా సంతకాలు చేశారు. అనంతరం ట్రంప్ తన చేతిలోని పెన్నును.. ప్రమాణ స్వీకారానికి హాజరై హర్షధ్వానాలు చేస్తున్న తన మద్దతుదారుల వైపునకు విసిరేశారు! దీంతో వారి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. వారి స్పందనను గమనించిన ట్రంప్.. తన బల్లపై ఉన్న మిగతా పెన్నులను కూడా.. ఒక్కొక్కటిగా వారి వైపునకు విసరడంతో అంతా ఆ పెన్నులను పట్టుకుని వాటితో సెల్ఫీలు దిగడం కనిపించింది. అనంతరం శ్వేతసౌధంలోని తన కార్యాలయానికి చేరుకున్న ట్రంప్.. 2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో 1500 మంది నిందితులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. వారందరిపై ఉన్న అన్ని కేసులనూ కొట్టేయాలని ఆదేశాలిచ్చారు. అలా ఆయన జారీ చేసిన మరికొన్ని కీలక ఉత్తర్వులు..
పుట్టుకతో పౌరసత్వ హక్కు: ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం.. పర్యాటక/ఉద్యోగి/విద్యార్థి వీసాలపైన, మరేదైనా కారణాల వల్ల అమెరికాకు వచ్చినవారికి ఆ గడ్డపై పిల్లలు పుడితే వారికి అమెరికా పౌరసత్వం (బర్త్ రైట్ సిటిజెన్‌షి్‌ప) వస్తుంది. ఆ హక్కుపై వేటు వేస్తూ ట్రంప్ తొలిరోజే ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ ఉత్తర్వు రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధమని హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. జన్మతః పౌరసత్వహక్కు అందరికీ వర్తించదని, అందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయని (సబ్జెక్ట్ టు ద జ్యూరి్‌సడిక్షన్ దేర్ ఆఫ్) ఆ సవరణలోనే ఉన్నదని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఆ నిబంధన ప్రకారం.. అక్రమంగా అమెరికాలో ఉండే మహిళలకు జన్మించే పిల్లలకు, ఆ పిల్లల తండ్రి అమెరికన్ పౌరుడు/చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా లేనివాడు అయితే జన్మతః పౌరసత్వ హక్కువ ర్తించదు. అలాగే.. అమెరికాలో చట్టబద్ధంగానే ఉంటున్నప్పటికీ తాత్కాలికంగా (విద్యార్థి/ఉద్యోగి/పర్యాటక వీసాలపై) నివసించే మహిళలకుపుట్టే పిల్లలకు ఆ పిల్లల తండ్రి అమెరికన్ పౌరుడు/చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా లేనివాళ్లకు జన్మతః పౌరసత్వ హక్కు వర్తించదు.
పేర్ల మార్పు: గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెరికా ఈ జలసంధి పేరు మార్చేస్తే సరిపోదు. ప్రపంచమంతా ఆ పేరును గుర్తించాలంటే పలు అంతర్జాతీయ సంస్థలు ఆ మార్పును ఆమోదించాల్సి ఉంటుంది. అలాగే.. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన ‘మౌంట్ డెనాలీ’ పేరును ‘మౌంట్ మెక్‌కిన్లే’గా మార్చేశారు. నిజానికి ఆ పర్వతం పేరు మొదట్లో మౌంట్ మెక్‌కిన్లేగానే ఉండేది. 2015లో ఒబామా దాని పేరును మౌంట్ డెనాలీగా మార్చారు. ట్రంప్ పాతపేరును పునరుద్ధరించారు.
పారిస్ ఒప్పందం నుంచి వెనక్కి: పెరిగిపోతున్న భూతాపానికి అడ్డుకట్ట వేసేలా.. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు 2015లో పారి్‌సలో ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతున్నట్టుగా ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడే కాదు.. ట్రంప్ ఎప్పట్నుంచో ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికా అభివృద్ధిని అడ్డుకునే కుట్రగా ఈ ఒప్పందాన్ని ఆయన గతంలో అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకే తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క పారిస్ ఒప్పందం నుంచే కాదు.. అమెరికా అభివృద్ధికి అడ్డంకిగా మారే అన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచీ వైదొలగేలా.. ‘యూన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్’కు సంబంధించి గతంలో అమెరికా ఏదైనా ఆర్థికసాయం అందిస్తానని ప్రకటించి ఉంటే వాటి నుంచి కూడా వైదొలగేలా ఉత్వర్వులు జారీ చేశారు.
డబ్ల్యూహెచ్‌వో నుంచి నిష్క్రమణ: కొవిడ్-19 మహమ్మారి కట్టడిలో విఫలమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా నిష్క్రమించాలని ట్రంప్ తొలి హయాంలోనే నిర్ణయించారు. తర్వాత ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన బైడెన్ ఆ నిర్ణయాన్ని రద్దుచేశారు. అయితే.. తాను అధికారంలోకి వస్తే డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా వైదొలగేలా చేస్తానని ట్రంప్ అప్పట్నుంచీ చెబుతూనే వచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది కూడా ఒకటి. అమెరికా నిష్క్రమణతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఏటా 130 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1124 కోట్ల) ఆర్థికసాయం అందకుండా పోతుందని అంచనా.
లింగ నిర్వచనం, డీఈఐ కార్యక్రాల రద్దు: అమెరికావ్యాప్తంగా చాలా మంది తమ లింగానికి సంబంధించి వాస్తవాలను అంగీకరించడానికి ఒప్పుకోవట్లేదని.. పురుషులు తమను తాము అమ్మాయిలుగా ప్రకటించుకొని, మహిళలకు ఉద్దేశించిన కార్యకలాపాల్లోకి చొరబడుతున్నారని.. ఇకపై అలాంటివి చెల్లబోవని స్పష్టం చేస్తూ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీని ప్రకారం అమెరికా ఇకపై రెండు లింగాలను మాత్రమే గుర్తిస్తుంది. అవి.. స్త్రీ, పురుషుడు. పుట్టుకతో వచ్చిన ఈ లింగాలను సొంత విచక్షణ పేరుతో మార్చుకోవడం.. పురుషులు తమను తాము మహిళలుగా చెప్పుకోవడం, మహిళలు తమను తాము పురుషులుగా చెప్పుకోవడం కుదరదు. మహిళలు, బాలికలు అందరూ ‘స్త్రీ’ కేటగిరీలోకి వస్తారు. మగవారు, బాలురు ‘పురుషుల’ కేటగిరీలోకి వస్తారు. ప్రభుత్వ విధానాల్లో, ఉత్తరప్రత్యుత్తరాల్లో జెండర్ ఐడెంటిటీని, జెండర్ ఐడియాలజీని ప్రోత్సహించవద్దని ఆదేశించారు. అంతేనా.. ప్రస్తుతం అమెరికాలోని జైళ్లల్లో ఉన్న ఖైదీలలో ట్రాన్స్ మెన్ (స్త్రీగా జన్మించి తమను తాము పురుషులుగా భావించేవారు) అందరినీ మహిళల జైళ్లలో వేయాలని, అదే తరహాలో ట్రాన్స్ వుమెన్ ఖైదీలను పురుషుల జైళ్లలోకి తరలించాలని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే.. కుల, మత, జాతి, వర్ణ వివక్ష నిర్మూలనకు ఫెడరల్ ప్రభుత్వం చేపట్టిన ‘డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ (వైవిధ్యం, సమానత్వం, కలుపుకొనిపోయే తత్వం)’ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ మరో ఆర్డర్‌ను ట్రంప్ జారీ చేశారు.
టిక్‌టాక్‌కు ఊరట: టిక్‌టాక్ నిషేధానికి సంబంధించి.. బైడెన్ సర్కారు విధించిన నిషేధం అమలును 75 రోజులపాటు వాయిదావేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడం ద్వారా దాని మాతృసంస్థ ‘బైట్‌డ్యాన్స్’కు ట్రంప్ ఊరట కల్పించారు. వాస్తవానికి ఈ నిషేధం జనవరి 19నే అమల్లోకి వచ్చింది. ఈమేరకు అమెరికాలో టిక్‌టాక్ సేవలు కొన్నిగంటలపాటు నిలిచిపోయాయి కూడా. ట్రంప్ రూపంలో టిక్‌టాక్ మళ్లీ ఊపిరి పీల్చుకుంది.
ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షల ఎత్తివేత: వెస్ట్‌బ్యాంక్‌లో స్థిరపడ్డ ఇజ్రాయెలీ సెటిలర్లపై గత బైడెన్ సర్కారు 2024 ఫిబ్రవరిలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ట్రంప్ పాలనా ఉత్తర్వు జారీ చేశారు. మితవాద వర్గాలకు చెందిన ఈ సెటిలర్లు వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లపై హింసకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో బైడెన్ సర్కారు వారిపై ఆంక్షలు విధించింది. అమెరికాలో వారికి ఉన్న ఆస్తులను స్తంభింపజేసింది. అమెరికాలోని సంస్థలు, వ్యక్తులు వారితో సంబంధబాంధవ్యాలు నెరపకుండా నిషేధం విధించింది. ఈ ఆంక్షలను ట్రంప్ ఎత్తివేయడంతో వెస్ట్‌బ్యాంక్‌లో మళ్లీ హింసాత్మక వాతావరణం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కొన్ని నిర్ణయాల అమలు.. అంత వీజీ కాదు!
ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ఇచ్చిన హామీల్లో చాలావాటిని ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారానే అమలు చేయొచ్చు. కానీ, పుట్టుకతో పౌరసత్వ హక్కు వంటి మరికొన్ని నిర్ణయాల అమలుకు మాత్రం చట్టపరంగా పలు అడ్డంకులు ఎదురవుతాయి. వాటిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలవుతాయి. ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి వాటిని అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అమెరికా ప్రతినిధుల సభలో (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) రిపబ్లికన్లకు స్వల్ప ఆధిక్యం మాత్రమే ఉంది. సెనెట్‌లో సైతం.. ఏదైనా చట్టం అమలుకాకుండా సభ్యులు అడ్డుకునే వీలు కల్పించే ‘ఫిలిబస్టర్’ అనే ప్రక్రియ ఉంది. కాబట్టి, ట్రంప్ ఆ నిర్ణయాల అమలుకు డెమొక్రటిక్ సభ్యుల సహకారం తప్పనిసరి.
కెనడా, మెక్సికోపై 25 % సుంకాలు
అమెరికాలోకి అక్రమ వలసలను, మాదకద్రవ్యాలను నిరోధించడంలో విఫలమవుతున్న కెనడా, మెక్సికోపై ఫిబ్రవరి 1 నుంచి 25 % సుంకాలను విధించే ఆలోచనలో ఉన్నట్టు ట్రంప్ తెలిపారు. అంతకుముందు.. అమెరికన్ కార్మికులను, కుటుంబాలను కాపాడేందుకుగాను అమెరికా వాణిజ్యవ్యవస్థ ప్రక్షాళనను తక్షణమే ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.
దక్షిణ సరిహద్దుల్లో అత్యవసర స్థితి
మెక్సికన్ డ్రగ్ కార్టెల్స్‌ను, ఇతర నేర సంస్థలను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. అలాగే.. మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి విధించారు. దీనివల్ల కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండానే.. ఫెడరల్ నిధులతో అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు వీలు కలుగుతుంది.
Updated Date - Jan 22 , 2025 | 01:55 AM