Trump administration : సైనిక విమానాల్లో గెంటేస్తారా?
ABN, Publish Date - Jan 27 , 2025 | 04:56 AM
అనుమతి లేకుండా తమ దేశంలో అక్రమంగా నివసించేవారిని వెళ్లగొట్టడం అమెరికా చాలాకాలంగా చేస్తున్న పనే! డీపోర్టేషన్ పేరుతో ఏటా లక్షలాది మందిని పంపించేస్తుంటుంది. కానీ.. ఇప్పుడు ట్రంప్ సర్కారు అక్రమ
అక్రమ వలసదారులతో అమెరికా పంపిన రెండు విమానాలను తిరస్కరించిన కొలంబియా
గ్వాటెమాలకు.. రెండు విమానాల్లో 160 మంది
డీపోర్టేషన్‌కు మిలటరీ విమానాలు వాడడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి
సైనిక విమానాలపై మెక్సికో అభ్యంతరం నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ విమానాల్లో తరలింపు
న్యూయార్క్: అనుమతి లేకుండా తమ దేశంలో అక్రమంగా నివసించేవారిని వెళ్లగొట్టడం అమెరికా చాలాకాలంగా చేస్తున్న పనే! డీపోర్టేషన్ పేరుతో ఏటా లక్షలాది మందిని పంపించేస్తుంటుంది. కానీ.. ఇప్పుడు ట్రంప్ సర్కారు అక్రమ వలసదారులను ఆగమేఘాల మీద పంపించడానికి సైనిక విమానాలను వాడుతుండడం, అదీ అత్యంత అమానవీయంగా వారి కాళ్లు, చేతులను గొలుసులతో కట్టేసి పంపిస్తుండడంపై లాటిన్ అమెరికన్ దేశాలు మండిపడుతున్నాయి. రెండురోజుల క్రితం మెక్సికోకు ఇలాగే సైనిక విమానాల్లో కొందరిని డీపోర్ట్ చేయబోతే.. ఆ దేశం అంగీకరించలేదు. దీంతో గత్యంతరం లేక వారిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన ‘ఎయిర్ ఆపరేషన్స్’ విభాగానికి చెందిన నాలుగు విమానాల్లో పంపించింది. తాజాగా కొలంబియా దేశం కూడా.. తమ దేశానికి అమెరికా పంపిన రెండు సైనికవిమానాలను తిరగ్గొట్టింది. వలసదారులను అమెరికా ప్రభుత్వం నేరగాళ్లలా చూస్తోందంటూ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మండిపడ్డారు. తమ దేశానికి చెందిన వలసదారులను అమెరికా పౌరవిమానాల్లో పంపితే స్వాగతిస్తామని.. ట్రంప్ సర్కారు వారిని మర్యాదతో, గౌరవంతో చూడాలని ఆయన ట్వీట్ చేశారు.
అటు బ్రెజిల్ విదేశాంగ శాఖ కూడా.. వలసదారుల చేతులు, కాళ్లకు గొలుసులు వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. నిజానికి అమెరికా చరిత్రలో ఇలా మాస్ డీపోర్టేషన్‌కు మిలటరీ ఎయిర్‌క్రా్‌ఫ్ట్సను వాడడం ఇదే మొదటిసారి. గురువారం నుంచి ఆ ప్రక్రియను చేపట్టిన ఆ దేశ ఇమ్మిగ్రేషన్ విభాగం.. ఇప్పటికి ఆరు విమానాల్లో అక్రమవలసదారులను దేశం నుంచి గెంటేసింది. ఒక్కో సైనిక విమానంలో ఎనభై మంది చొప్పున... రెండు విమానాల్లో 160 మందిని, వారి చేతులు, కాళ్లకు గొలుసులు కట్టి గ్వాటెమాలాకు విమానాల్లో పంపింది. మెక్సికో నుంచి వచ్చి అమెరికాలో తీవ్ర నేరాలకు పాల్పడినవారిని మరో నాలుగు సైనిక విమానాల్లో పంపాలని భావించింది. కానీ.. మెక్సికో అభ్యంతరం చెప్పడంతో వారిని మాత్రం ఇమ్మిగ్రేషన్ విభాగానికి చెందిన ఎయిర్ ఆపరేషన్స్ (ఏఐవో) విమానాల్లో డీపోర్ట్ చేసింది. కాగా, ట్రంప్ చేపట్టిన మాస్ డీపోర్టేషన్‌లో ఇంకా మనోళ్ల వంతు రాలేదుగానీ.. అమెరికా కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషణ్ గణాంకాల ప్రకారం.. 2019 నుంచి 2024 వరకు 6,395 మంది భారతీయులను డిపోర్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్..
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 27 , 2025 | 05:00 AM