ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రపంచ ప్రయాణం 19వ శతాబ్దంలోకి..?

ABN, Publish Date - Jan 24 , 2025 | 06:08 AM

మనుషుల సంతోషాన్ని విస్తృతపరుస్తూ సమాజం ముందుకే వెళుతుందని మనం నమ్ముతాం. మొన్నటికంటే నిన్న మిన్నగా.. నిన్నటి కంటే నేడు ఘనంగా.. నేటి కంటే రేపు మరింత అద్భుతంగా ఉంటుందంటూ...

మనుషుల సంతోషాన్ని విస్తృతపరుస్తూ సమాజం ముందుకే వెళుతుందని మనం నమ్ముతాం. మొన్నటికంటే నిన్న మిన్నగా.. నిన్నటి కంటే నేడు ఘనంగా.. నేటి కంటే రేపు మరింత అద్భుతంగా ఉంటుందంటూ రెండుమూడు వందలేళ్లల్లో చాలా రచనలు వచ్చాయి. ఆశలు లేకపోతే అడుగులే పడవు. భవితకు భరోసా కనపడకపోతే మన ప్రయత్నాల్లో ఊపూ ఉత్సాహం ఉండదు. సుదీర్ఘ కాలప్రవాహంలో సమాజం ముందుకు నడవటం నిజం! స్థూలంగా చరిత్ర చెప్పేది ఇదే! కానీ వెనుకంజ లేని సమాజమూ జీవితమూ ఉండవు. ఆ వెనుకంజ ఒక్కోసారి భయం కొల్పుతుంది. గతాన్ని నెత్తిమీదకు తెచ్చిపెడుతుంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచిన నాటి నుంచి ఒక వెనుకంజ గురించి తరచూ వినపడుతోంది. అంతర్జాతీయ వ్యవహారాల వ్యాఖ్యాత, ప్రముఖ పాత్రికేయుడైన ఫరీద్‌ జకారియా ఇటీవల తన ‘గ్లోబల్‌ పబ్లిక్‌ స్క్వేర్‌’ టీవీ కార్యక్రమంలో ట్రంప్‌ విజయంతో 19వ శతాబ్దం నాటి సామ్రాజ్యవాదపు (ఇంపిరియలిజం) పోకడలు మళ్లీ విజృంభిస్తాయా అనే ప్రశ్నను లేవనెత్తారు. సంతృప్తికరమైన జవాబు మాత్రం రాలేదు. సమాధానాలు రానంత మాత్రాన ప్రశ్నల విలువలు తగ్గిపోవు. చరిత్రలో జవాబులకంటే ప్రశ్నలకే బలం ఎక్కువ. మనిషి అన్వేషణలన్నీ ప్రశ్నలతోనే మొదలయ్యాయి. మహామహా ఆవిష్కారాలన్నీ వాటితోనే సాధ్యమయ్యాయి. వస్తువులను, పరికరాలను సృష్టించుకుని మనుగడ సాగిస్తున్న మనుషులకు ప్రపంచ సృష్టికి కూడా ఎవరో కారణమై ఉంటారనే ప్రశ్న తట్టి.. జవాబుల కోసం సాగించిన చింతనాన్వేషణతోనే మతాలన్నీ ఊపిరులు పోసుకున్నాయి. ఒక పథకంతో, శ్రమతో చేసే వస్తు, పరికర సృష్టే మానవ జీవనసారం కాబట్టి ఈ చరాచర ప్రపంచమూ అటువంటి సృష్టిజనితమేనని మనిషి అనుకున్నాడు. కాబట్టి ప్రశ్నకున్న విశిష్ట పాధాన్యత నుంచి చూస్తే 19వ శతాబ్దం నాటి సామ్రాజ్యవాద పోకడలు మళ్లీ విజృంభిస్తున్నాయా? అన్నది సందర్భోచితమైందిగానే తోస్తుంది. లోతుగా పరిశీలిస్తే ఆ ప్రశ్నకు సమాధానం అవుననే కొంతమేరకు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆనాటి పోకడలు కొన్ని ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇవి ఎంత బలపడితే అంతగా ప్రపంచం వెనుకడుగులు వేస్తున్నట్లుగా కచ్చితంగా భావించొచ్చు.


19వ శతాబ్దంలో సామ్రాజ్యవాదాన్ని అనుసరించిన దేశాలన్నీ జాతీయవాదంతోనే తమ ఆక్రమణలను, ఆధిపత్యాన్ని సమర్థించుకున్నాయి. తమ దేశమే అన్ని రంగాల్లోనూ ముందుండాలనే వాదననే ప్రచారాస్త్రంగా చేసుకుని ప్రజలను యుద్ధోన్ముఖంగా నడిపించాయి. మొదటి ప్రపంచయుద్ధం ఆ విధంగానే వచ్చింది. అగ్రస్థానం కోసం అన్ని నియమాలనూ కాలదన్నాయి. వెనుకబడిన దేశాల ప్రజలకు నాగరికతనూ ఆధునికతనూ సాంకేతిక–శాస్త్ర విజ్ఞానాన్నీ అందివ్వటానికే ఆక్రమణలూ ఆధిపత్యాలూ యుద్ధాలూ అవసరమని వాదించాయి. సామ్రాజ్యవాదం ప్రత్యక్ష ఆక్రమణ రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. కీలుబొమ్మ ప్రభుత్వాలను పెట్టి కీలక నిర్ణయాలన్నీ గుప్పెట్లో పెట్టుకుని సంపదను తరలించుకుపోయే పరోక్ష సామ్రాజ్యవాదమూ ఉంటుంది. రెండిటిలోనూ జరిగేది ఒకటే. ముడిసరుకుల సరఫరా కేంద్రంగా ఆక్రమిత దేశాలను మార్చివేయటం, పారిశ్రామిక ఉత్పత్తులకు కొనుగోలు మార్కెట్లుగా దిగజార్చటం సామ్రాజ్యవాదంలో ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడైతే కాలుష్యకారక పరిశ్రమలను పెద్దఎత్తున తరలిస్తున్నారు. అన్ని వ్యవస్థలనూ సామ్రాజ్యవాదం తన అవసరాలకు అనుగుణంగా మార్చివేస్తుంది. రాజకీయాలు మారిపోతాయి. పండే పంటలు మారిపోతాయి. చేసే ఉత్పత్తులు మారిపోతాయి. భూములపై హక్కులు మారిపోతాయి. పాతవర్గాలు పోతాయి. కొత్త వర్గాలు పుట్టుకొస్తాయి. ఇక రైల్వేలు, పోర్టులు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఆధునిక విద్యా సౌకర్యాలు.. శాంతిభద్రతల స్థాపన లాంటివన్నీ సామ్రాజ్యవాద అవసరాల్లో భాగంగా కొంతమేరకు వస్తాయి. సామ్రాజ్యవాదం అహంకారపూరిత జాతీయవాదం చాలా సందర్భాల్లో పెనవేసుకునే ఉంటాయి.


అమెరికా అగ్రస్థానంలో ఉండాలని పదేపదే వినిపిస్తున్న వాదనను పరిశీలిస్తే ఆ తరహా జాతీయవాదమే కనపడుతుంది. ఇతర దేశాల పట్ల అనుసరించాల్సిన మర్యాదలను విపరీత జాతీయవాదం పాటించదు. పన్నుల్లో అసంబద్ధత ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవటం ఆధునిక దౌత్యనీతి. ట్రంప్‌ హెచ్చరికలను చూస్తే ఆ దౌత్యనీతి ఛాయలు ఎక్కడా కనిపించవు. ఇంతపన్ను విధిస్తాం.. అంత పన్ను విధిస్తాం.. అనే ఏకపక్ష ప్రకటనలే మనం వింటున్నాం. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలనీ, గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామనీ, పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామనీ చేసే ప్రకటనలు సామ్రాజ్యవాద కాలాన్ని గుర్తుకు తెస్తాయి. దౌత్యపద్ధతులను, ఒప్పందాలను ఖాతరు చేయకపోవటం సామ్రాజ్యవాదంలో ఒక ప్రధాన లక్షణంగా ఉండేది. పరస్పర అంగీకారాల ద్వారా ఏర్పడిన సంస్థలను తప్పుపట్టటం, వాటి నుంచి వైదొలగటం ఆనాటి పోకడల్లో భాగమే. ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచీ ప్రపంచ పర్యావరణ ఒప్పందం నుంచీ తప్పుకోవటాన్ని ఇంకోలా అర్థం చేసుకోలేం. దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం జరగాలనీ దిగుమతులు–ఎగుమతులపై పన్నులు కనీస స్థాయిలో ఉండాలనీ ఆర్థిక సంస్కరణల పేరిట వివిధ దేశాలకు నిర్దేశించిందీ అమెరికా పాలకులే. ఇప్పుడు దానికి భిన్నంగా 19వ శతాబ్దంలో చేసినట్లు అధిక పన్నులను విధించి చౌక ఉత్పత్తులతో తమకు పోటీదారులుగా మారిన దేశాలను కట్టడి చేయాలనీ చూస్తున్నారు. చైనాతో వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనం. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇప్పటి ధనిక దేశాలన్నీ ఆనాటి పోటీ దేశాల ఉత్పత్తులపై విపరీతంగా పన్నులు వేసి వినియోగదారులు వాటిని కొనకుండా చేశాయి. భారత–చైనా సంప్రదాయ ఉత్పత్తులను అలాగే దెబ్బతీశారు. అధికపన్నుల విధింపులనే ‘టారిఫ్‌ వాల్స్‌’గా పిలుస్తారు. ట్రంప్‌ హెచ్చరికలు కూడా ఆ ‘వాల్స్‌’ లాంటివే. ట్రంప్‌ దూకుడు చూస్తుంటే ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి కూడా వైదొలగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


పర్యావరణ విధ్వంసం 19వ శతాబ్దంలో విపరీతంగా పెరిగింది. 1869–1914ల మధ్య కాలాన్ని సామ్రాజ్యవాదం ఉచ్ఛదశగా చరిత్రకారులు పరిగణిస్తారు. ఆ కాలంలో జరిగిన పర్యావరణ విధ్వంసంతో ఏ యుగాన్ని పోల్చలేం. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో పర్యావరణం గణనీయ మార్పులకు లోనైంది. ప్రకృతిని మనుషుల మనుగడకు ఆధారమని భావించకుండా దాన్ని జయించటం నాగరికత పరమార్థంగా ఆనాడు మారింది. పర్యావరణ పరిరక్షణ అనే భావనే ఆనాడు పాలకుల్లో లేదు. శిలాజ ఇంధనాలు కలగచేసే నష్టాలు తెలియవు. అడవుల కొట్టివేత విపరిణామాలు తెలియవు. పరిశ్రమల కాలుష్యం అరికట్టే విధానాలూ లేవు. విషయపరిజ్ఞానమూ లేదు. కొన్ని హెచ్చరికలు ఉన్నా లాభాలపై యావతో చెవికెక్కించుకోలేదు. 1970ల తర్వాతే పర్యావరణ చైతన్యం పెరిగింది. ఉష్ణోగ్రతలను పారిశ్రామిక విప్లవం నాటి కంటే రెండు డిగ్రీలు కిందకు దించకపోతే మానవాళి మనుగడే ప్రశ్నార్థకం అవుతుందనే హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా 19వ శతాబ్దం నాటి సామ్రాజ్యవాద పోకడలతో పర్యావరణ పరిరక్షణ చర్యలను ఈసడించుకోవటం స్పష్టంగా కనపడుతుంది. పర్యావరణ విపరిణామాలతో ఆర్కిటిక్‌ మంచుఫలకాలు కరుగుతున్నా ఉపేక్షిస్తూ అక్కడున్న గ్రీన్‌ల్యాండ్‌ను నియంత్రణలోకి తీసుకోవాలన్న ప్రతిపాదన వెనుకా అదే కన్పిస్తుంది. అక్కడున్న అరుదైన లోహాలు, చమురు సంపదపై ధ్యాసతో పాటు సైనిక ప్రయోజనాలే లక్ష్యంగా గ్రీన్‌ల్యాండ్‌ స్వాధీనం కోసం అడుగులు పడుతున్నాయి. పనామా కాలువను ఎట్లాగైనా స్వాధీనం చేసుకుంటామని చెబుతున్న ట్రంప్‌.. అసలు ఆ కాలువను కట్టిందే అమెరికానేనని చేస్తున్న వాదన వెనుక పెద్ద చరిత్రే ఉంది. పనామా ఒకప్పుడు కొలంబియా దేశంలో ఒక రాష్ట్రంగా ఉండేది. 19వ శతాబ్దం చివరి నాటికి హవాయి, ఫిలిప్పీన్స్‌లను చేజిక్కించుకున్న అమెరికాకు అట్లాంటిక్‌–పసిఫిక్‌ సముద్రాలను కలిపేలా కాలువ కావాల్సివచ్చింది. ఆ కాలువలో యుద్ధనౌకలు తిరగటం ఆనాడు అమెరికాకు అత్యవసరం. కాలువకు భూభాగం అడిగితే కొలంబియా అంగీకరించలేదు. 1903లో పనామాలో తిరుగుబాటు జరిగితే వెంటనే అమెరికా మద్దతు ప్రకటించి ప్రత్యేక దేశంగా గుర్తించింది. ప్రతిఫలంగా కాలువ తవ్వే హక్కునీ కాలువకు అటూఇటూ 8 కిలోమీటర్ల భూమినీ అమెరికాకు అప్పగించింది. కాలువ తవ్వకం 1914 ఆగస్టు 15న పూర్తయింది.


గత ఒప్పందాలన్నీ తిరగతోడితే దేశాల సరిహద్దులే చెదరిపోతాయి. ఏనాడో వదులుకున్న హక్కులను ఇప్పుడు కావాలనుకుంటే దేశాల తలరాతలు మారిపోతాయి. ఉక్రెయిన్‌తో పాటు మధ్య ఆసియా దేశాలపైనా రష్యా హక్కులు కోరొచ్చు. తైవాన్‌ను చైనా బలవంతంగా స్వాధీనం చేసుకోవచ్చు. అంతెందుకు మెక్సికో తాను అమెరికాకు కోల్పోయిన భూభాగాలనూ తిరిగి అడగొచ్చు.

19వ శతాబ్దం నాటి సామ్రాజ్యవాదం పోకడలనే కాకుండా దాని విశ్వరూపం తెలుసుకుంటే ఇప్పటి తరాలకు ఆశ్చర్యంగా ఉంటుంది. జర్మన్‌ భౌగోళిక శాస్త్రవేత్త అలెగ్జాండర్‌ సుపన్‌ 1900లో ఇచ్చిన లెక్కల ప్రకారం.. అమెరికా, యూరపు దేశాలు ఆఫ్రికా ఖండంలో 90.4 శాతం, పసిఫిక్‌ ఐలాండ్స్‌లో 98.9 శాతం, ఆసియాలో 56.5 శాతం, ఆస్ట్రేలియాలో 100 శాతం, అమెరికాలో 27.2 శాతం భూభాగంపై ఆధిపత్యం సంపాదించాయి. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ, పోర్చుగల్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం, ఇటలీ... అంటే తొమ్మిది దేశాలు ప్రపంచాన్ని ఆ రీతిలో పంచుకున్నాయి.

అమెరికాలో ట్రంప్‌ కోరుకున్నట్లుగా అన్నీ జరిగితే 21వ శతాబ్దం కచ్చితంగా కొన్ని అంశాల్లోనైనా 19వ శతాబ్దంలోకి పరకాయప్రవేశం చేస్తుంది. ఆనాటి సామ్రాజ్యవాద ఆత్మను ఆవాహన చేసుకుంటుంది. జాతి ఆధిక్యతా–న్యూనతా భావాల సుడిలో చిక్కుకుంటుంది. పర్యావరణ పరిరక్షణపై నిబద్ధత పలచబారిపోతుంది. ఇంటాబయటా వైవిధ్యాలను ఆక్షేపించే ఉపద్రవాన్ని తెస్తుంది. అసమానతలపై ఉపేక్షతను ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ సంస్థల మనుగడకు ప్రమాదం వస్తుంది. శరణార్ధులకు చోటు కరువవుతుంది. భిన్న లైంగిక ప్రవర్తన బలిపీఠం ఎక్కుతుంది. అబార్షన్‌ హక్కుకు విఘాతం కలుగుతుంది. జాతీయవాదానికి స్వార్థమే పరమార్థమవుతుంది. చివరకు ఉదార ప్రజాస్వామ్యమే కుదేలవుతుంది!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - Jan 24 , 2025 | 06:08 AM