ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP : ఢిల్లీలో కొత్త ఆరంభం

ABN, Publish Date - Feb 22 , 2025 | 05:04 AM

రాజకీయాల్లో కాకలు తేరిన పురుష పుంగవులకు కాకుండా అక్షరాలు దిద్దుతున్న రేఖాగుప్తాకు అప్పగించడం విచిత్రమే.

మూడుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసి, తొలిసారి ఎమ్మెల్యే అయిన ఒక మహిళ నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం విశేషమే. దేశరాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఓ యుద్ధమే చేసిన భారతీయ జనతాపార్టీ, ఆ విలువైన స్థానాన్ని రాజకీయాల్లో కాకలు తేరిన పురుష పుంగవులకు కాకుండా అక్షరాలు దిద్దుతున్న రేఖాగుప్తాకు అప్పగించడం విచిత్రమే. ముఖ్యమంత్రుల ఎంపికలో కొత్తదనాన్ని చూపుతూ వస్తున్న బీజేపీ, ఆప్‌ అధినేతనే ఓడించిన మాజీ ముఖ్యమంత్రి తనయుడిని సైతం పక్కనబెట్టింది. ముమ్మారు నెగ్గిన వ్యక్తిని స్పీకర్‌ పదవిలో కూచోబెట్టింది. బీజేపీకి ఉన్న పద్నాలుగుమంది ముఖ్యమంత్రుల్లో ఏకైక మహిళ రేఖ. పరివార్‌ మూలాలతో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎదిగివచ్చిన ఆమె సమర్థత విషయంలో అనుమానాలు లేకున్నా పాలనానుభవం లేనిమాట నిజం.

ఢిల్లీ ఓటర్లలో మహిళలు ఎక్కువ, బీజేపీ ఓటర్లలోనూ పైచేయి వారిదే కనుక రేఖను సీఎం చేశారని ఓ విశ్లేషణ. ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న వ్యాపారవర్గాన్ని సంతృప్తిపరచే ఉద్దేశమూ ఉన్నదట. ఇప్పటివరకూ ఉన్న ఏకైక మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అన్నివిధాలా పోటీపెట్టడానికేనని కొందరంటారు. మహిళా ఓటుబ్యాంకును బీజేపీ నమ్ముకుందని, పలుపథకాలు, హామీలతో దానిని విస్తరించుకున్నదని కొందరు గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీవాసులకు పరిచయం ఉన్న, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ పోటీచేసిన నాయకులకంటే,‍ పెద్దగా ప్రచారంలో లేని, చెడ్డపేరుకు అవకాశమేలేని ఓ కొత్తమొఖం ఉత్తమమని పార్టీ పెద్దలు అనుకొని వుంటారు. ఒక మహిళ ఉన్నతస్థానంలోకి వస్తే దానికదే చర్చనీయాంశం కనుక, రేఖ రాకమీద మరికొంతకాలం విశ్లేషణలు సాగవచ్చు. అన్ని సామాజికవర్గాలకు సముచిత ప్రాతినిథ్యంతో మంత్రివర్గం ఏర్పాటు, ఆయుష్మాన్‌ భారత్‌లోకి ఢిల్లీని తీసుకురావడం ఇత్యాది నిర్ణయాలతో రేఖ పాలన మొదలైంది.


ఆప్‌ సుదీర్ఘపాలనమీద విరక్తిచెందారో, ఆ పార్టీ ఉన్నంతకాలం బీజేపీతో నిత్యఘర్షణలవల్ల తమకు అన్యాయం జరుగుతుందనుకున్నారో తెలియదు కానీ ఊహించనంత ఘనంగా బీజేపీకి ఢిల్లీ ప్రజలు అధికారం కట్టబెట్టారు. కేజ్రీవాల్‌ నిర్ణయాలకు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మోకాలడ్డటం, సీఎంగా ఉంటూ కూడా ఈయన దీక్షలు, ధర్నాలు చేయడం, ఎల్‌జీ అధికారాలు, పరిధులు, పరిమితులమీద న్యాయస్థానాల్లో సుదీర్ఘపోరాటాలు సాగడం ఢిల్లీ వాసులకు విరక్తి కలిగించివుంటాయి. సుప్రీంకోర్టు పలుమార్లు జోక్యం చేసుకున్నా, ఇద్దరి మధ్యా హద్దులు గీసినా తెగని ఆ పంచాయితీ చూసి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ పరిష్కారమని అనుకొని ఉంటారు. ఇకపై ఏ సమస్యా ఉండదు. ఎవరి అధికారాలు ఏమిటో ఎవరూ చెప్పనక్కరలేదు, ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాలు ఉండవు. ఎవరిమాట వినాలో, ఎవరి ఆదేశాలు బేఖాతరు చేయాలో తెలియని గందరగోళస్థితి అధికారులకు సైతం ఉండదు. పాలనకూ, ప్రభుత్వానికి సంబంధించి కిందనుంచి పై వరకూ సమస్త వ్యవస్థలూ బీజేపీ చేతుల్లోకి వచ్చేసినందున ఏలుబడి సవ్యంగా, నల్లేరుమీద నడకవుతుందని ఆశించాలి. అధిష్ఠానం ఆశీస్సులు దండిగా ఉన్న కొత్త ముఖ్యమంత్రి వారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాజ్యం చేయవచ్చు. తమపార్టీ ప్రభుత్వాలే ఉన్న హర్యానా, యూపీల సహాయసహకారాలను పొందవచ్చు.


కేజ్రీవాల్‌ను కూల్చడం ఇప్పుడు కాకుంటే ఇప్పట్లో కాదన్నరీతిలో బీజేపీ ఎన్నికల యుద్ధం చేసింది. ఆయనను అవినీతిపరుడిగా చిత్రించేందుకు వ్యవస్థలన్నింటినీ దింపి, జైలుకు సైతం పంపింది. మోదీ పరిభాషలో చెప్పాలంటే మిగతా పార్టీలకంటే ఎక్కువగా రేవడీలను ప్రకటించి, రెండున్నర దశాబ్దాల తరువాత రాజ్యాన్ని గెలుచుకుంది. ఆప్‌ ఆరంభించిన పథకాలన్నింటినీ ఏ లోటుపాట్లు లేకుండా కొనసాగించడంతో పాటు, భారీ నగదు బదిలీలతో సహా, అన్ని ఎన్నికల హామీలను అమలు చేయడం కొత్త ప్రభుత్వం విధి. వాయు, జల కాలుష్యాలతోనూ, ట్రాఫిక్‌ సమస్యలతోనూ సతమతమవుతున్న ఢిల్లీవాసులను నిర్దిష్టమైన ప్రణాళికలతో ఒడ్డునపడవేయడం కొత్తప్రభుత్వం విధి. సభలో మూడింట రెండువంతుల సంఖ్యాబలం ఉన్న కొత్తముఖ్యమంత్రి ఢిల్లీని ఎక్కడికో తీసుకుపోతాననీ, ఏదేదో చేసేస్తాననీ చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. వీధిపోరాటాల్లో ఆరితేరిన ఆప్‌ ప్రభుత్వాన్ని కనిబెడుతూనే ఉంటుందని, ప్రశ్నిస్తూనే ఉంటుందని రేఖాగుప్తా గుర్తుపెట్టుకోవాలి.

Updated Date - Feb 22 , 2025 | 05:04 AM