ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రష్యా దిగివస్తుందా?

ABN, Publish Date - Jan 24 , 2025 | 06:04 AM

యుద్ధం ఆపకపోతే మరిన్ని ఆంక్షలతో పీల్చిపిప్పిచేస్తానని అధికారంలోకి వచ్చీరాగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికలకు రష్యా తాపీగా, శాంతంగా...

యుద్ధం ఆపకపోతే మరిన్ని ఆంక్షలతో పీల్చిపిప్పిచేస్తానని అధికారంలోకి వచ్చీరాగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికలకు రష్యా తాపీగా, శాంతంగా ప్రతిస్పందించింది. చర్చలకు తాము సిద్ధమేననీ, కానీ ఆంక్షలకే ట్రంప్‌ అత్యుత్సాహపడుతూంటారని క్రెమ్లిన్‌ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఒకపక్క పుతిన్‌ను ప్రశంసిస్తూనే, ఆయనతో సాన్నిహిత్యం ఉన్నదని అంటూనే, రష్యాను ఇబ్బందిపెట్టడం తన ఉద్దేశం కాదని చెబుతూనే ట్రంప్‌ చాలా విమర్శలు చేశారు. దారికొచ్చి సంధికుదర్చుకోనిపక్షంలో వివిధ రకాల పన్నులు, సుంకాలు, ఆంక్షలతో రష్యాను దెబ్బతీస్తానని హెచ్చరించారు. తానేగనుక అధికారంలో ఉండివుండే అసలు ఈ యుద్ధమే మొదలయ్యేది కాదని ట్రంప్‌ మళ్ళీ గొప్పచెప్పుకున్నారు. పుతిన్‌ వల్లే రష్యా నాశనం అవుతోందనీ, ఆర్థికంగా పతనమైపోతోందనీ ఒకపక్క శాపాలు పెడుతూనే తామిద్దరి మధ్యా మంచి అవగాహన ఉన్నదని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ట్రంప్‌ వ్యాఖ్యలను బట్టి, ఆయన ఎప్పటినుంచో హామీ ఇస్తున్నట్టుగానే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సాధ్యమైనంతవేగంగా ముగించే ప్రయత్నమైతే ఆరంభిస్తున్నట్టు కనిపిస్తోంది.


ఉక్రెయిన్‌ యుద్ధం నాలుగో ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, అర్థంపర్థంలేని ఈ యుద్ధాన్ని ఇంకా పొడిగించడానికి వీల్లేదనీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటున్నారనీ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లోగా శాంతి తెస్తానంటూ ఆయన తనకు ప్రమాణంచేశారని జెలెన్‌స్కీ కూడా చెబుతున్నారు. మొత్తంగా యుద్ధాన్ని ముగించడానికో, అందుకు వీలుగా చర్చలకో రంగం సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది. యుద్ధం పరిష్కారం కాదని నరేంద్రమోదీ వంటివారు ప్రపంచవేదికలమీద ప్రవచిస్తున్నప్పుడల్లా పుతిన్‌ సైతం సానుకూలంగా స్పందిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చిన ఒక్కరోజులోనే యుద్ధాన్ని ఆపేస్తానంటూ ప్రకటించిన ట్రంప్‌కు అది అంత సులభం కాదని తెలియకపోదు. యుద్ధంలో రెండుపక్షాలూ పీకలోతున సుదీర్ఘకాలంగా ములిగి ఉండటం, అపారనష్టాలను మూటగట్టుకోవడం, ఎంతోకొంత కోల్పోనిదే కాలువెనక్కుతీసుకోలేకపోవడం వంటివి పరిష్కారాన్ని జటిలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయపక్షాలనూ కూడా బుజ్జగింపులు, బెదిరింపులతో దారికి తేక తప్పదు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధ సరఫరాలతోనో, రష్యాను మరిన్ని ఆంక్షలతో శిక్షించడంవల్లనో యుద్ధాన్ని ఆపడం అసాధ్యం. ఉభయపక్షాలకూ ఎంతోకొంత లబ్ధిచేకూర్చి, రాజీపడేట్టుగా చేయడం తప్ప మార్గం లేదు. ఇన్నేళ్ళు యుద్ధం చేసి కూడా తనకు పక్కలోబల్లెంలాగా ఉంటున్న ఉక్రెయిన్‌ను అలాగే వదిలేయడం పుతిన్‌కు ససేమిరా ఇష్టం ఉండదు. ఉక్రెయిన్‌తో ఇకమీదట ఏ సమస్యా రాకుండా, అది నాటోతో కలిసి తన నెత్తినెక్కే అవకాశాలు లేన్నప్పుడే రష్యా దిగివస్తుంది. ట్రంప్‌ బృందం ప్రతిపాదనలకు ఉక్రెయిన్‌ సరేనంటే, అది ఐదోవంతు భూభాగాన్ని రష్యాకు వదులుకోవలసి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఆ మేరకు రష్యాను సంతృప్తిపరచి, మిగతా ఉక్రెయిన్‌ను పునర్నిర్మించడానికీ, ఆర్థికంగానూ, ఆయుధపరంగానూ అండగా ఉండటానికీ అమెరికా హామీ పడవచ్చు.


గెలిచిన యుద్ధాలతోనే కాదు, నిలిపినవాటితోనూ, నిలువరించినవాటితోనూ తాను విజయాన్ని లెక్కిస్తానని ట్రంప్‌ చెప్పుకున్నారు. పదిహేను నెలలుగా సాగుతున్న గాజాయుద్ధాన్ని ముగించడానికి చాలాకాలం ప్రయత్నాలు జరిగినమాట నిజం. ట్రంప్‌ అధికారంలోకి రావడానికి ముందే చర్చలు మొదలైనా, దిగిపోతున్న బైడెన్‌మాటకంటే, మరో నాలుగేళ్ళు అధ్యక్షుడుగా ఉండబోతున్న ట్రంప్‌ హెచ్చరికలకే నెతన్యాహూ దిగివచ్చారని అంతా నమ్ముతున్నారు. కాల్పుల విరమణతో పడిన ఆ తొలి అడుగు అంతిమశాంతికి దారితీస్తుందని భావిస్తున్నారు. స్వల్పకాలంలోనే ఉక్రెయిన్‌ను గెలవగలనని, అంతిమంగా తనదే పైచేయి అవుతుందని దానితో యుద్ధాన్ని ఆరంభిస్తున్న కొత్తలో పుతిన్‌ నమ్మారు. కానీ, అనేకశక్తుల రంగప్రవేశంతో యుద్ధం మరింత విస్తరిస్తూవచ్చింది, వెయ్యిరోజులకుపైగా ఎడతెగకుండా కొనసాగుతోంది. ఇంకా ఎంతకాలం సాగినా అంతిమంగా విజేతలంటూ ఎవరూ లేకపోయినా, అణ్వాయుధ వినియోగం ప్రమాదం కూడా పెరగవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఇచ్చిన హమీకి అనుగుణంగా అడుగులు పడితే సంతోషించాల్సిందే.

Updated Date - Jan 24 , 2025 | 06:11 AM