ఉక్రెయిన్ భవిష్యత్తు ఏమిటి?
ABN, Publish Date - Feb 23 , 2025 | 02:34 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య మాటలయుద్ధం చూస్తుంటే ఉక్రెయిన్‌ను అమెరికా పూర్తిగా ఒంటరి చేసేలా కనిపిస్తున్నది. యురోపియన్ యూనియన్ దేశాలు...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య మాటలయుద్ధం చూస్తుంటే ఉక్రెయిన్‌ను అమెరికా పూర్తిగా ఒంటరి చేసేలా కనిపిస్తున్నది. యురోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఆ దేశాలు ప్రస్తుతానికి అమెరికాపైనే ఆధారపడి ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు నాలుగుదారుల కూడలిలోకి చేరుకుంది. ఏ యుద్ధం అయినా ఏదో ఒకరోజు ముగియవలసిందే. అయితే, మొదలుపెట్టిన వారికి అనుకూలంగానే యుద్ధం ముగియాలని గ్యారెంటీ ఏమీ లేదు. కానీ కీలకమైన యుద్ధాల ముగింపు ప్రపంచ బలాబలాలలో మార్పులు తెస్తాయి. నూతన కూటములు, నూతన అధికార క్రమాలు మొదలవుతాయి.
2021 ఆగస్టులో అమెరికా తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచి, మంచి మంచి ఆయుధాలను వదిలిపెట్టి, ఆఫ్ఘనిస్తాన్ నుండి పలాయనం చిత్తగించింది. ఈ పరిణామం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ధైర్యాన్నిచ్చింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఎప్పటినుండో రగులుతున్న ఘర్షణలను సైనికంగా పరిష్కరించాలనుకున్నాడు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోబోతున్నట్లుగా ప్రకటనలు ఇవ్వడం, నాటో కూడా ప్రయత్నాలు మొదలుపెట్టడంతో పుతిన్‌కు ఇది సాకుగా ఉపకరించింది. రష్యా భద్రతకు ప్రమాదం ఏర్పడబోతున్నదనే పేరుతో 2022 ఫిబ్రవరి 14న ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం మొదలుపెట్టాడు.
పుతిన్ 2014లో ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న క్రిమియాను తిరిగి రష్యాలో విలీనం చేసినప్పటినుండే, నాటో ఉక్రెయిన్‌ను సైనికంగా బలోపేతం చేస్తూ వస్తున్నది. ప్రపంచాధిపత్య పోరులో భాగంగా రష్యాను కట్టడి చేయడం కొరకు ఉక్రెయిన్ సైనిక శక్తిని పెంచడం అమెరికాకు అవసరం కూడా. ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేసి యుద్ధానికి దిగడంతో ప్రారంభంలో రష్యాకు తీవ్రనష్టాలు ఎదురైనాయి. యుద్ధం ప్రారంభంలో, జెలెన్‌స్కీ దేశం విడిచిపోయేందుకు అమెరికా సహకరిస్తుందని ప్రకటించిన జో బైడెన్, రష్యాకు జరిగిన నష్టాలను చూసిన తర్వాత ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆర్థిక, ఆయుధ సహాయం చేయడం మొదలుపెట్టాడు. రష్యాపైన అంతా పెద్దఎత్తున ఆంక్షలు విధించారు. మొదట్లో సమస్య పరిష్కారం కొరకు ఒకటి రెండు సమావేశాలు జరిగినా, యుద్ధక్షేత్రంలో రష్యాకు గట్టిజవాబు చెప్పగలమని నాటో దేశాలు విశ్వసించాయి.
అమెరికా, నాటోదేశాలు ఉక్రెయిన్‌కు అన్ని రకాల ఆయుధసాయం చేశాయి. ఉపగ్రహ సమాచారాన్ని, ఆధునిక డ్రోన్లను ఇచ్చాయి. అయితే పాశ్చాత్య మీడియా ప్రచారం చేసినట్లుగా రష్యా శక్తి అంతరించిపోలేదు. కాకపోతే 2022 ఆగస్టులో నాటో ఆయుధాలతో ఉక్రెయిన్ చేసిన బలమైన ఎదురుదాడితో యుద్ధస్థితిలో ప్రతిష్టంభన ఏర్పడింది. అక్కడి నుండి ఈ యుద్ధం మన పౌరాణిక సినిమాలలో చూపినట్టు–ఒకరు నిప్పుల బాణాలు వేస్తే మరొకరు నీళ్ల బాణాలు వేసినట్లు– సాగింది. ఉక్రెయిన్ సైన్యాలు నాటో అందించిన కొత్త ఆయుధాలను ఉపయోగించినప్పుడల్లా రష్యా కొద్దిగా వెనక్కు తగ్గేది. వాటి గురించి అర్థం కాగానే ఎదురు దెబ్బతీసేది. అమెరికన్ అబ్రాం ట్యాంకులు, జర్మన్ లెపర్డ్ ట్యాంకులకు ఎదురే లేదని నాటో చెప్పుకుంది కానీ, వాటినీ రష్యా ధ్వంసం చేసింది. అన్ని రకాల క్షిపణులను రష్యన్ సైన్యాలు కూల్చివేశాయి. ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను అధిగమించి ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబులు కురిపిస్తూ పోయింది. ఒకదశలో నాటో సైనిక సలహాదారులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఉక్రెయిన్ సైన్యాలు అకస్మాత్తుగా, ప్రధాన యుద్ధ రంగానికి దూరంగా రష్యాకు చెందిన కురుస్క్ ప్రాంతంలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నాయి. కురుస్క్‌ను రక్షించుకోవడం కొరకు ప్రధాన యుద్ధరంగం నుండి కొంత సైన్యాన్ని రష్యా ఉపసంహరించుకొని అక్కడకు పంపుతుందని నాటో ఆశించింది. కానీ, ఈ పురాతన ఎత్తుగడను సైతం రష్యా సులువుగా తిప్పికొట్టింది. ఉక్రెయిన్ సైన్యాన్ని కురుస్క్ నుండి వెళ్లగొట్టడానికి రష్యన్ సైనికులకు తోడుగా నార్త్ కొరియా సైనికులు కూడా వచ్చారు.
ఇంతలోగా అమెరికా ఎన్నికలు ముంచుకొచ్చి ఉక్రెయిన్ పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు అయింది. ట్రంప్ వస్తే ఉక్రెయిన్‌కు అమెరికా సహాయం ఆగిపోవచ్చునని అందరూ ఊహించినదే. పదవి చేపట్టడంతోనే ఆయన ఈ యుద్ధం ముగింపు కొరకు రష్యాతో చర్చల కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈయూ, ఉక్రెయిన్‌కు ఈ చర్చలలో స్థానం లేకుండా చేశాడు. ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది కాని దాని పాత సరిహద్దులు మారిపోవచ్చు అని ట్రంప్ అంటున్నారు. అంటే రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం రష్యాకే పోతుందని అర్థం. అలాగే ఉక్రెయిన్ రక్షణ గ్యారంటీలో అమెరికా సైన్యం ఉండదట. యుద్ధానికి మూలకారణమైన నాటో సభ్యత్వం ఉక్రెయిన్‌కు ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదని కూడా ట్రంప్ తెగేసి చెప్పారు. అమెరికా వైఖరితో దిగ్భ్రాంతిచెందిన ఈయూ దేశాలు చర్చల్లో తమనూ, ఉక్రెయిన్‌ను భాగం చేయనందుకు అమెరికాను విమర్శిస్తున్నాయి.
యుద్ధం ముగింపు కొరకు జరుగుతున్న చర్చల క్రమాన్ని, ఈయూ, అమెరికా మధ్య పెరుగుతున్న అపనమ్మకాన్ని, అమెరికా రష్యాల మధ్య చిగురిస్తున్న స్నేహాన్ని చూసినప్పుడు కొత్తకూటముల ఉదయమేదో జరగబోతున్నట్లు కనిపిస్తున్నది. రష్యాకు అమెరికా స్నేహహస్తాన్ని అందిస్తూనే మరోవైపు చైనాతో కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు అమెరికాకు ప్రధాన శత్రువు చైనానే. చైనా నాయకత్వంలోని బ్రిక్స్‌తోనే అమెరికాకు ప్రమాదం. రష్యా చైనాలను ఒకేసారి ఎదుర్కోవడం సాధ్యం కాదని ఉక్రెయిన్ యుద్ధంతో తేలిపోయింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యాకు అనుకూలంగా పరిష్కరించి రష్యాను మంచి చేసుకుని చైనాను ఒంటరి చేయాలనేది అమెరికా ఆలోచన కావచ్చు. 1970లలో రష్యాను ఒంటరి చేయడానికి కిసింజర్ దౌత్యనీతితో చైనాను అమెరికా దగ్గరికి తీసుకున్నది. అప్పటివరకు తైవాన్ ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తించిన అమెరికా, చైనాతో దోస్తీ కొరకు తైవాన్‌ను చైనా అంతర్భాగంగా గుర్తించింది. అదే అమెరికా వారం క్రితమే తైవాన్ స్వాతంత్ర్యాన్ని గుర్తించే విధంగా తన వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. రష్యా దోస్తీ కొరకు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాన్ని రష్యాలో భాగమే అని కూడా అమెరికా అనవచ్చు. ఈ నేపథ్యంలో యూరప్ దేశాలు కొన్ని చైనాకు దగ్గర కావచ్చు, కొన్ని అమెరికా వైపు ఉండవచ్చు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపులో నూతన కూటములు ఏర్పడే క్రమం కూడా ఉంది. అలాగే, అమెరికా కొత్త కూటమికి అనుకూలంగా ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారమవుతుందనీ అనుకోవచ్చు.
లంకా పాపిరెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి...
AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే
Read Latest AP News And Telugu News
Updated Date - Feb 23 , 2025 | 02:34 AM