ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాతంత్ర తెలంగాణతోనే సంగంరెడ్డికి నివాళి

ABN, Publish Date - Jan 21 , 2025 | 06:03 AM

‘తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు, మోసపడితివా నీవు గోస పడతవు’ అంటూ మేల్కొలుపు పాడిన ఆ గొంతుకు సరిగ్గా 92 ఏళ్లు. దోపిడీ, వివక్ష, అణచివేత, అవమానాలకు వ్యతిరేకంగా సాగిన మహత్తర ప్రత్యేక తెలంగాణ...

‘తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు, మోసపడితివా నీవు గోస పడతవు’ అంటూ మేల్కొలుపు పాడిన ఆ గొంతుకు సరిగ్గా 92 ఏళ్లు. దోపిడీ, వివక్ష, అణచివేత, అవమానాలకు వ్యతిరేకంగా సాగిన మహత్తర ప్రత్యేక తెలంగాణ పోరాటంలో అగ్రగణ్యుడు సంగంరెడ్డి సత్యనారాయణ. ఓరుగల్లుకు కూతవేటు దూరంలో మూడు చెరువులు, ముప్పయి కుంటలు, మూడు వందల మోటబావులతో అలగులుబారి అలరారిన ముచ్చర్లలో 1933 జనవరి 21న సంగంరెడ్డి నర్సయ్య, నర్సమ్మ దంపతులకు జన్మించారు. ఊరు పేరే ఆయన ఇంటి పేరుగా స్థిరపడింది. కవిగా, రచయితగా, పాత్రికేయుడిగా, గాయకుడిగా, నాయకుడిగా, ఉద్యమకారుడిగా, శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా 1952లో నాన్‌ ముల్కీ గోబ్యాక్‌ ఉద్యమ నేతగా, తెలంగాణ తొలిదశ–మలిదశ ఉద్యమాలకు దిక్సూచిగా ఆయన నిలిచారు.


ఆంధ్రప్రదేశ్‌ అవతరణ, ఆరు సూత్రాల పథకం, పెద్ద మనుషుల ఒప్పందం, వాటి నిరంతర ఉల్లంఘనలు, తెలంగాణ పట్ల వివక్ష, అణచివేత, అవమానాలు, వనరుల దోపిడీ అంతర్గత వలసపాలనతో తెలంగాణ పల్లెలు ఘొల్లుమన్న సందర్భంలో విద్యార్థి నాయకుడిగా చుట్టిన తలపాగా, కాష్టం కాలేంత వరకు తీసేయని నికార్సయిన నేత. ప్రశ్నించిన వారికి జైళ్లు, ప్రతిఘటించిన వారికి ఉరితాళ్లుగా దిగజారిన చోరస్వామ్యంపై ముచ్చర్ల నుంచే సంగంరెడ్డి జంగ్‌ సైరన్‌ ఊదారు. కళ్లు తెరవండంటూ కలానికి పదును పెట్టారు. తెలంగాణను, దామోదరం సంజీవయ్య వంటి దళితులను ఈసడించిన నీలం సంజీవరెడ్డి మీద తన కలం గళం ఎక్కుపెట్టారు. ‘అయ్యయ్యో రామ రామా–సంజీవరెడ్డి మామా, పాడేంగే పాయిజామా– సంజీవరెడ్డి మామా –బందర్‌ కే కార్నామా’ అంటూ పల్లెపల్లెనా దిక్కులు పిక్కటిల్లే విధంగా ప్రతిఘటన జెండా రెపరెపలాడించారు. తొలిదశ ఉద్యమంలో విద్యార్థుల శరీరాలను తూటాలు తూట్లు పొడుస్తున్నా నిర్లిప్తంగా కూర్చున్న తెలంగాణ కురువృద్ధులను ముల్లుగర్రతో పొడిచి లేపారు సంగంరెడ్డి సత్యనారాయణ.

‘రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావోయి ఎర్రి చెన్నారెడ్డి’ అంటూ సంగంరెడ్డి పాడితే చెన్నై రాజ్‌భవనే కదిలిపోయింది. ఇంద్రారెడ్డి, కేసీఆర్‌ వంటివారు తెలంగాణ కోసం పార్టీ పెడితే వారికి సంగంరెడ్డి దారిదీపం అయినారు. తెలంగాణ రాష్ట్రసమితి స్థాపకుడిగా, తొలి అధ్యక్షవర్గంలోని నలుగురిలో ఒకడిగా అగ్రభాగాన నడిచారు. కానీ, వ్యక్తుల ప్రవర్తన నచ్చక టీఆర్‌ఎస్‌కు దూరమైనప్పటికీ ఏ వర్గం వారు సభలు పెట్టినా ఏ ఆందోళన చేపట్టినా శషభిషలు లేకుండా పాల్గొన్నారు. తెలంగాణ కోసం రాజకీయ ఉద్యమానికి సమాంతరంగా సామాజిక ఉద్యమాలు కూడా నడపాలని సంగంరెడ్డి పోరాటం చేశారు. ధోతి విప్పితే, మరో ధోతి లేని; చొక్కా విప్పితే, మరో చొక్కా లేని సంగంరెడ్డి కూడా ఎన్నికల్లో పోటీ చేసే మొనగాడా? అని హయగ్రీవాచారి ఎద్దేవా చేస్తే, కసి పెంచుకుని పోటీచేసి విజయం సాధించారు సత్యనారాయణ.


భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం... నాటి ఒరిస్సా గవర్నర్ సయ్యద్ ఫజల్ అలీ చైర్మన్‌గా రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేస్తే సంగంరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రాబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించిన సత్యనారాయణ ‘తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు, మోసపోతివా నీవు గోస పడతవు’ అంటూ హెచ్చరించారు. ఆయన ఊహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దమనుషుల ఒప్పందాన్ని, ఆరు సూత్రాలను నిర్లజ్జగా ఉల్లంఘించారు.

సంగంరెడ్డి సత్యనారాయణ రాసి పాడిన పాటలు ప్రజలను పోరాటం వైపు ఉరికించాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, వివక్ష ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపించేవి. సామాజిక వివక్షను కూడా సత్యనారాయణ తన గేయాల్లో ఎండగట్టారు. ‘మా పెంట మీది కోడి మీకు వంటయినప్పుడు, మేము అంటరానోళ్లం ఎట్లయితం?’ అని దళిత బహుజనుల వాణిగా ముక్కుసూటిగా ప్రశ్నించారు. వరంగల్‌లో తెలంగాణ సంస్కృతిని, వంటకాలను ఈసడించిన ఆంధ్రా వ్యాపారి రత్తమ్మ హోటల్‌పై ఆయన రాసిన పాట గల్లీగల్లీలో మారుమోగింది. ‘రత్తమ్మా.. రత్తమ్మా, నీ దుకాణం ఎత్తమ్మ’ అని ఆయన ఘోషించారు. తెలంగాణకు వలస వచ్చి, ఇక్కడి ప్రజల భాషను, యాసను, సంస్కృతిని అవహేళన చేసే ఆధిపత్య వర్గాలను ఆయన తూర్పారపట్టారు. సత్యనారాయణ కలలుగన్న విధంగా ప్రజా పాలనగా తెలంగాణ రాష్ట్రం పరిఢవిల్లాలి. తెలంగాణలో సమైక్య పాలకులు మూసేసిన నిజాం షుగర్స్‌, ఆల్విన్, ఐడీఎల్, ఐడీపీఎల్, హెచ్ఎంటి, ప్రాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్ట్, డిబీఆర్ మిల్లు, నేతాజి స్పిన్నింగ్ మిల్లు, ఆజంజాహీ మిల్లు వంటి పరిశ్రమలను తిరిగి తెరవాలి. స్మశాన వాటికలుగా మారిన పారిశ్రామిక వాటికలు నాచారం, ఉప్పల్, చర్లపల్లి, సనత్‌నగర్, ఆజామాబాద్, బాలానగర్, జీడిమెట్ల, కాటెదాన్, కొత్తూరు తిరిగి సైరన్‌ మోతలతో, చిమ్నీల పొగతో జీవకళ నింపుకోవాలి. పారిశ్రామిక, వ్యవసాయ పునరుజ్జీవంతో, కుటీర పరిశ్రమలతో గ్రామీణ పునర్వికాసం సాధించాలి. చెరువులు, కుంటలు జలకళతో తొణికిసలాడే విధంగా, పునర్నిర్మాణాన్ని ప్రజల పర్యవేక్షణలో గ్రామపంచాయతీలకే అప్పగించాలి. ప్రజల తెలంగాణగా, ప్రజాస్వామిక క్షేత్రంగా, ఆర్థిక స్వావలంబనతో ఉత్పత్తి వ్యవస్థగా, పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా వికసించాలంటే ఉద్యమశక్తులే చోదకశక్తులుగా అంకుశం చెలాయించాలి.


అరవయ్యేళ్ల సుదీర్ఘ పోరాటంలో అమరులయిన వారి త్యాగాలను, 20 ఏళ్ల మలిదశ ఉద్యమంలో నిరంతరం శ్రమించిన యోధుల స్ఫూర్తిని ఈ సందర్భంగా స్మరించుకోవాలి. గోడమీది నుంచి గద్దె మీదికొచ్చిన పిల్లులను, రంగులు మారుస్తున్న ఊసరవెల్లులను, గుంటకాడి నక్కలను ఓ కంట కనిపెట్టాలి. ప్రకృతి విధ్వంసం కాకుండా, పేదల భూములు కార్పొరేట్‌ కంపెనీల పాలు కాకుండా, వనరులు రాక్షసుల పాలు కాకుండా, ప్రజలు కట్టిన పన్నులు కాంట్రాక్టర్ల పాలు కాకుండా ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా, వారి ఆత్మగౌరవమే పతాకగా తెలంగాణ పునర్నిర్మాణం ఆరంభమైతేనే సంగంరెడ్డి సత్యనారాయణ వంటి తెలంగాణ ఉద్యమకారులకు అసలు సిసలు నివాళి అవుతుంది.

l కౌడె సమ్మయ్య

జర్నలిస్టు

(నేడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి, రవీంద్రభారతిలో సభ)

Updated Date - Jan 21 , 2025 | 06:04 AM