రాస్తున్న క్రమంలోనే నవల రూపం దాల్చుతుంది
ABN, Publish Date - Mar 03 , 2025 | 01:05 AM
ఓల్గా ఒక ఫెమినిస్ట్ ఆల్కెమీ. ఆమె పేరే సంకెళ్లు తెగుతున్న సంగీతమై మధుర మంజులంగా మనని ఆవహిస్తుంది. ఓల్గా నామవాచకం కాదు, సర్వనామం. ఆమె కోరుకున్న స్వేచ్ఛ ఆమెకు మాత్రమే...
నవలా శిల్పం
ఓల్గా ఒక ఫెమినిస్ట్ ఆల్కెమీ. ఆమె పేరే సంకెళ్లు తెగుతున్న సంగీతమై మధుర మంజులంగా మనని ఆవహిస్తుంది. ఓల్గా నామవాచకం కాదు, సర్వనామం. ఆమె కోరుకున్న స్వేచ్ఛ ఆమెకు మాత్రమే పరిమితమైంది కాదు, స్త్రీలందరికీ సంబంధించింది. వేల సంవత్సరాలుగా అంగీకృతమైపోయిన స్త్రీల అణచివేతనీ, దోపిడీనీ, బానిసత్వపు పద్ధతులనీ ప్రతిఘటించి ఎదుర్కొనే చైతన్యాన్ని ఇస్తూ, స్త్రీలకు తమ చరిత్రను తాము అర్థం చేసుకునే సదవకాశాన్ని కలిగించిందామె సాహిత్యం. స్త్రీలను బుద్ధిజీవులుగా నిలబెట్టడమే ఆమె సాహిత్యోద్యమం సాధించిన విజయం. ఓల్గా రాసిన తొమ్మిది నవలలూ మనందరి హృదయాల మీద ముద్రించుకుపోయినవే. ఇది ‘నవలా శిల్పం’ శీర్షికన ఆమెతో చేసి సంభాషణ.
ఇంటర్వ్యూ : వి. ప్రతిమ
మీరు నాన్‌ఫిక్షన్, ఫిక్షన్ రెండూ విస్తృతంగా రాశారు. వ్యాస ప్రక్రియలో ఒక భావజాలాన్ని, ఒక సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం సులువే. కానీ నవలా ప్రక్రియలో మీరు నమ్మిన సిద్ధాంతాన్ని అర్థం చేయించడం, ఆ భావాలని ఒప్పుదలగా పంచడం కష్టం కాలేదా?
నేను ఒక సిద్ధాంతాన్ని, భావజాలాన్ని నవలల్లో రాశానని, లేదా వాటిని చెప్పటం కోసం నవలలు రాశాననీ అందరూ అనుకుంటారు, అంటారు. చివరకు నేనూ నిజమే అనుకునేంతగా ఆ మాట స్థిరపడింది. దీని గురించి విపులంగా ఆలోచిస్తే– సిద్ధాంతం గానీ, భావజాలం గానీ ఎలా పుడతాయి? సిద్ధాంతకర్తలు ఒక సిద్ధాంత నిర్మాణాన్ని ఎలా చేస్తారు. సమాజంలో మానవుల బాధలను, వేదనలను, దుఃఖాన్ని, వాటికి కారణమైన దోపిడిని, అణచివేతను అర్థం చేసుకునే ప్రయత్నం చేసేటపుడు, వారు కనుగొన్న కారణాలను ఒక పద్ధతిలో చెప్పినప్పుడు అది సిద్ధాంతమవుతుంది గదా! అంటే సామాజిక మానవ జీవితం గురించిన లోతైన అవగాహనే సిద్ధాంతం. ఆ జీవితం గురించి ఒక చిన్న పరిధిలో, కొందరు వ్యక్తులను మాత్రమే తీసుకుని, వాస్తవికతతో పాటు కాల్పనికతనూ కొంత జోడించి, సూటిగా, రసవంతంగా రాస్తే అది సాహిత్యమవుతుంది. వాస్తవికత, కాల్పనికతల మేళవింపు ఎంత చిక్కగా, అందంగా రాయగలిగాడనేదే రచయిత వ్యక్తిగత శైలి, శిల్పం అవుతుంది. సిద్ధాంతంపై గట్టి పట్టు ఉండటం వల్ల మానవ జీవితాన్ని అర్థం చేసుకునే వీలు కలిగి రాయాలనుకున్న విషయంపై స్పష్టత వచ్చి, రచయిత శైలి మెరుగుపడుతుంది. అందువల్ల ఎలాంటి వ్యాసాలు రాసినా నవలలు రాయటానికి ఏ ఇబ్బందీ రాదు. వ్యాసాలు రాయటం వల్ల నవలల్లో ఒక సరళత, సూటిదనం వస్తుంది. రెండింటికీ మంచే జరుగుతుంది. కొ.కు., చలం వీళ్ళంతా ఈ మార్గం వేశారు.
ఒక నవలకు మీ మనసులో మొదటి విత్తు పడటం, రాయటానికి ఉపక్రమించటం... ఈ రెండు దశల మధ్య మీ ఆలోచనా ప్రయాణం ఎలా ఉంటుంది?
నవల కోసం ఇతివృత్తం అనుకున్న తర్వాత చాలా రోజులు రాయకుండా ఉంటాను. దాని గురించి ఆలోచన కూడా సబ్ కాన్షస్ మైండ్‌లో జరుగుతుంది. పనిగట్టుకుని ఆలోచించను. నోట్స్ రాసుకోను. కొన్నాళ్ళ తర్వాత ఆ నవల రాసుకుంటూ వెళ్తాను. రాస్తున్న క్రమంలోనే నవల రూపం దాల్చుతుంది. మొదటి నవలలు, అంటే ‘గులాబీలు’ (1992) వరకూ, ఫెయిర్ చేసేటపుడు చిన్న చిన్న మార్పులు జరిగేవి. ఆ తర్వాత ఒకేసారి ఫెయిర్ రాయటం మొదలైంది. రాసి కుటుంబరావుకి చదవమని ఇవ్వటం, అతను బాగుందనటం, అంతే– ఆ తర్వాత ఇక దానిని మళ్ళీ చదివే పని పెట్టుకోను. అచ్చయిన తర్వాత కూడా చదవను. ఇక ఆ రచన నాది కాదు. పాఠకులది. దానితో నా రిలేషన్ పూర్తవుతుంది. దానిని గౌరవించుకుంటాను. అదే సమయంలో దానితో కొంత దూరాన్ని పాటిస్తాను. మళ్ళీ మళ్ళీ దానితో జోక్యం చేసుకోను.
మీ మొదటి నవల రాసే క్రమంలో రచనా పరంగా ఎదుర్కొన్న సవాళ్ళూ, ఇబ్బందులు?
మొదటి నవల ‘సహజ’. నలుగురు స్నేహితురాళ్ళ కథ. పెళ్ళికి ముందు వారి జీవితాలలో, పెళ్ళయ్యాక వారి జీవితాలలో ఎలాంటి మార్పు వచ్చింది, ఆ మార్పు వల్ల ఊపిరాడని ఇద్దరు స్త్రీలు తమ జీవితాలను మార్చుకోవటానికి ఎలా సాహసించారు. ఆ సాహసానికి వారిని ప్రేరేపించిన స్నేహితురాలి జీవితం ఎందుకు, ఎలా భిన్నంగా ఉంది? – ఈ విషయాన్ని చాలా తక్కువ పేజీలలో రాయాలి. ‘చతుర’ మాస పత్రికలో ఒక నవలంతా వచ్చేది. దానికి పేజీల పరిమితి ఉండేది. అందువల్ల ఇన్ని విషయాలను సూటిగా, స్పష్టంగా, అర్థవంతంగా, చదివించే గుణం ఉండేలా రాయటం ఒక సవాలే. ఈ పరిమితులున్నాయి, ఈ లక్ష్యం ఉంది అనేది బాగా అర్థం చేసుకున్న తర్వాత అది కష్టం కాలేదు. సులువగానే రాసేశాను. పైగా నా గురువులని చెప్పుకోగలిగిన చలం, కొ.కు.లు రాసినవి కూడా చిన్న నవలలే. చెప్పినవి లోతైన విషయాలు. విపరీతమైన రీడబిలిటి. వారి బాటలో ప్రయాణం చేశాను.
మీరు నాలుగు దశాబ్దాల క్రితమే రాసిన ‘మానవి’ నవలలో అస్తిత్వవాదాల వెలుతురు లోంచి స్త్రీల జీవితాలని– ముఖ్యంగా వైవాహిక, కుటుంబ వ్యవస్థలను– లోతులకు వెళ్లి విశ్లేషించారు. పితృస్వామ్య నియంత్రణల కుట్రని ఏ క్రమంలో అర్థం చేసుకుని, ఏ పరికరాలను ఉపయోగించి ‘మానవి’ నవల రచనకు మొగ్గారు?
పితృస్వామ్యం కేవలం కుట్ర కాదు. అది ఒక సామాజిక వ్యవస్థ. అది ఎప్పటికప్పుడు రూపం మార్చుకుని స్త్రీలను నియం త్రిస్తుంది. ఒకప్పటి భూస్వామ్య పితృస్వామ్యం, ఇప్పటి పితృస్వామ్యం రెండింటి రూపాలు వేరు. సారాంశం మాత్రం అణచివేతే. పితృస్వామ్యం దానికి అవసరమైన ఆధిపత్య, హింసా రూపాలను ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటుంది. దీనితో పోరాటం వర్గపోరాటం కంటే కష్టం. శత్రువులు మనవాళ్ళే, ఆయుధాలు చేతిలోంచి సులువుగా జారిపోతాయి. ఐతే స్త్రీలు తమ జీవితాలు తమ చేతుల్లోకి తీసుకోవాలి. తప్పయినా, ఒప్పయినా తమ నిర్ణయాలకు తామే బాధ్యత వహించాలి. ఈ పనులు చేయాలంటే సమాజం విధించిన పాత్రల నుండి (భార్య, తల్లి, కూతురు మొదలైనవి) బైటపడి ముందు మనిషిగా, మానవిగా మారాలి. దాని కోసం స్త్రీలు తమ జీవిత పోరాటాలను చేయాలి అనేది అర్థం చేయించటం కోసం ‘మానవి’ నవల రాశాను.
మీ నవలల్లో ‘స్వేచ్ఛ’ తెలుగు నేలపై స్త్రీవాదానికి సంబంధించి అత్యంత మౌలికమైన రచన. ఆ నవల తీవ్ర వివాదాలకు, దాడులకు కారణమైంది. అప్పటి స్థితి నేపథ్యంలో ఆ నవల గురించి కొత్త తరం పాఠకుల కోసం చెప్పగలరా?
‘స్వేచ్ఛ’ నవల 1987 ఫిబ్రవరిలో విడుదలయింది. మార్చి నుంచీ నా వ్యక్తిగత జీవితం మీద దాడి, నా వ్యక్తిగత జీవితానికి, నా రచనకు ముడిపెట్టి ఇంకోవైపు దాడి మొదలైంది. ఆ నవలలో నేను ప్రతిపాదించిన లేక చర్చకు పెట్టిన గృహిణీత్వానికి, పౌరసత్వానికి మధ్య ఉన్న వైరుధ్యం, దాని పరిష్కారానికి జరిగే ఘర్షణ, ఆ ఘర్షణకు కావలసిన స్వేచ్ఛాకాంక్ష, స్వేచ్ఛ– వీటిని ఒక మామూలు మధ్యతరగతి యువతి జీవితంలో చూపే ప్రయత్నం చేశాను. అలాగే వివాహంలో బందీ కావటం, దాని వల్ల జీవితాశయాలకు దూరమవటం కంటే సహజీవనం మెరుగేమోననే ప్రతిపాదన చేశాను. ఈ రెండూ ఉద్యమకారులకు నచ్చలేదు. స్త్రీలు గృహిణి పాత్రలో ఉంటూ, అది అనుమతించిన మేరకే సామాజిక జీవితంలోకి రావాలని చాలామంది అనుకుంటారు. కుటుంబాలు నిలబడవు అంటారు. స్త్రీల జీవితాలను తొక్కేస్తూ కుటుంబాలు నిలబడాలా? కుటుంబం నిలబడటానికి, పడిపోవటానికి స్త్రీలు మాత్రమే కారణమా? ఇలా అనేక విషయాల మీద కథలు, నవలలు రాయటానికి నాకు ‘స్వేచ్ఛ’ నవల మీద జరిగిన దాడి ఉపయోగపడింది. వ్యక్తిగతంగా జరిగిన దాడి నేను మరింత బలంగా, మానవీయంగా, క్షమాగుణం పెంచుకునేలా, మొరటువారిని, మూర్ఖులను చూసి నవ్వుకునే శక్తిగల దానిగా తయారు చేసింది.
దళిత సమస్యనీ, స్త్రీల సమస్యనీ ఏకకాలంలో చిత్రించిన నవల ‘ఆకాశంలో సగం’. ఆ ఇతివృత్తం మిమ్మల్ని ఎందుకు ఆకర్షించింది? జసింత వంటి యోధ ఐన పాత్ర సృష్టి ఎలా జరిగింది?
‘ఆకాశంలో సగం’ పూర్తి కల్పితం కాదు. ఒక గ్రామంలో రెండు పార్టీల మధ్య పంచాయితీ ఆఫీసు ఎక్కడ కట్టాలనే చిన్న విషయం మీద పెద్ద తగాదాలు, ఘర్షణలు జరిగాయి. బహుశా అనేక గ్రామాల్లో జరుగుతాయి. వాటిలో స్త్రీల ప్రమేయం ఉండదు. స్త్రీలకు ఆ ఘర్షణలు ఇష్టం లేకపోయినా భర్తల కోసం భరిస్తారు. తమ వారికి దూరమవుతారు. దీనిని ఎవరు ఎదుర్కోగలరు? ఒక దళిత యువతి, చదువుకున్న చైతన్యవంతమైన యువతి మాత్రమే ఎదుర్కోగలదని నాకు అనిపించింది. ఉద్యమాలలో అలాంటి యువతులను నేను చూశాను. కానీ వారికి నాయకత్వ లక్షణాలు ఎంత ఉన్నతంగా ఉన్నా, నాయకత్వంలోకి రానివ్వని పరిస్థితులనూ చూశాను. ఒక దళిత యువతికి ఆ పోరాట పటిమ, వ్యూహ రచన, నలుగురిని కూడగట్టగల చొరవ ఉండటం నాకు తెలుసు. ఆ యువతికి నిజ జీవితంలో దొరకని నాయకత్వాన్ని నా నవలలో నేను ఇచ్చాను. ‘జసింత’ పాత్ర రూపుదిద్దుకుంది. నిజంగా స్త్రీలు నాయకత్వం వహిస్తే, పురుషులు వారి వెనక నడిస్తే ఉద్యమాలు విజయవంతమవుతాయని నమ్ముతాను.
ఓల్గా
బొమ్మలు: అక్బర్
సాహిత్య వేదిక
Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా
Updated Date - Mar 03 , 2025 | 01:05 AM