ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మన కాలపు హరిశ్చంద్రుడు

ABN, Publish Date - Jan 20 , 2025 | 12:38 AM

1987 ఫిబ్రవరి మాసం. పొద్దు గూకే వేళ అప్పుడే చలి ముసురుకుంటా వుంది. తెనాలి సత్యనారాయణ టాకీస్‌ రోడ్‌లో వుండే బాబు రికార్డింగ్‌ షాపు వచ్చిపోయే కస్టమర్లతో సందడిగా వుంది. పూటుగా మందు తాగిన ఇద్దరు ఆగంతకులు...

1987 ఫిబ్రవరి మాసం. పొద్దు గూకే వేళ అప్పుడే చలి ముసురుకుంటా వుంది. తెనాలి సత్యనారాయణ టాకీస్‌ రోడ్‌లో వుండే బాబు రికార్డింగ్‌ షాపు వచ్చిపోయే కస్టమర్లతో సందడిగా వుంది. పూటుగా మందు తాగిన ఇద్దరు ఆగంతకులు రికార్డింగ్‌ షాపు యజమాని ఉమామహేశ్వరరావు గారి ఎదురుగా నిల్చున్నారు. వారిలో సన్నగా బక్క పల్చగా వున్న వ్యక్తి ‘ఏమండీ, మీ దగ్గర ఏమేమి క్యాసెట్లు దొరుకుతాయి?’ అని అడిగాడు. వాళ్ల వాలకం చూసిన యజమాని ‘అసలు నీకేం కావాలో ముందు చెప్పవయ్యా?’ అన్నారు నిరాసక్తంగా. ‘హరిశ్చంద్ర పద్యాలు డి.వి., బండారువి కాక, ఇంకెవరివైనా దొరుకుతాయా?’ అడిగాడా వ్యక్తి. తలవంచుకొని ఏదో పని చేసుకుంటున్న ఉమా గారు, ‘ఆ వున్నాయయ్యా! కెవి రెడ్డి, అరిగెల జేమ్సు, ఈ నడుమ కొత్తగా పాడుతున్న బండారు గారి కుమారుడు రవి కుమార్‌వి ఇవ్వమంటారా,’ అన్నాడు కొంచెం ఆసక్తిగా. మళ్ళీ తనే ‘ఈమధ్య చక్కగా పాడుతు న్నాడని పేరొచ్చిన చీమకుర్తి నాగేశ్వరరావు క్యాసెట్‌ చేయాల నుకున్నాము. ఆయన మాకు దొరకలేదయ్యా’ అన్నారు కించిత్‌ బాధ పడుతూ. ఆయన మాటలు వింటున్న ఆగంతకుడు కిలకిలా నవ్వుతూ, ‘సార్‌! నేనేనండీ ఆ చీమకుర్తిని’ అన్నాడు. ఆ షాపు యజమాని సంతోషానికి అవధులు లేకపోయాయి. తెనాలి లోనే వుంటూన్న హార్మోనిస్ట్‌ అంకయ్య గారిని అప్పటి కప్పుడే పిలిపించి, హరిశ్చంద్ర పాత్ర వారణాసి, కాటిసీను పద్యాలు ఏకపాత్రగా, ఏకధాటిగా చీమకుర్తి చేత పాడించి రికార్డు చేశారు ఉమామహేశ్వరరావు గారు. ఆ రోజు అర్ధరాత్రి వరకూ వారణాసి, కాటి సీను లోని జాషువా పద్యాలు కొత్త రాగాలతో అద్భుతంగా పాడాడు చీమకుర్తి. ‘ఇదంతా నిన్న మొన్ననే జరిగినట్లుందండీ.


మళ్లీ పుడతాడా అటువంటి మహా నట గాయక చక్రవర్తి!’ కళ్ళు చెమర్చుతుండగా ఈ అపురూప జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు బాబు రికార్డింగ్‌ యజమాని ఉమామహేశ్వరరావు గారు. చీమకుర్తి తన జీవితంలో మొదటి సారి ఇచ్చిన రికార్డింగ్‌ అది. తన స్వంత బాణీలో పద్యాలు పాడి ‘ఎవరీ చీమకుర్తి’ అని అందరూ ఉలికిపడే విధంగా తెలుగు పద్య నాటక ప్రపంచాన్ని సంభ్రమానికి గురి చేసిన వాడు. ఇప్పుడా క్యాసెట్‌ని ఎవరెవరో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. మిలియన్స్‌ వ్యూస్‌గా వైరలయ్యి డబ్బులు సంపాయించి పెడుతోంది వాళ్ళకు. కానీ అంత ప్రయాసపడి ఆ క్యాసెట్‌ను రికార్డింగ్‌ చేసినవారికి గానీ, తన మధుర గాత్రంతో శ్రోతలను ఉర్రూతలూగించిన చీమకుర్తి సంబంధీకులకు గానీ ఏ ప్రయోజనం లేకపోయింది. ‘వెంట వచ్చునది అదే యశస్సు, సత్యము’ అని ఆయనే పాడినట్లు, కీర్తి మాత్రమే మిగిలుంది.


అది 2002వ సంవత్సరం. ఏప్రిల్‌ నెల ఎండలు మండిపోతున్నాయి. కడప పాత బస్టాండ్‌లో పోస్టర్లు వేశారు– పెద్ద చెప్పలిలో ఎల్లమ్మ తిరునాళ్ల సందర్భంగా హరిశ్చంద్ర నాటకం వేస్తున్నారని, ‘వారణాసి’ హరిశ్చంద్రుడుగా చీమకుర్తి నాగేశ్వరరావు వస్తున్నాడని. ఆ కరువు సీమలో చుట్టుపక్కల వందల గ్రామాల నుంచీ వేలమంది ప్రజలు చెప్పలి ఎల్లమ్మ తల్లి తిరునాళ్లకు హాజరవుతారు. ఎంతో భక్తితో ఎల్లమ్మ తల్లిని సేవించుకుని, ఆ రాత్రి ప్రదర్శించే నాటకాన్ని చూసి, తెల్లవారి గ్రామాలకు తరలిపోతారు. ఆరోజు ‘సత్యహరిశ్చంద్ర నాటకం’లో ఆంధ్ర దేశంలో పేరు గాంచిన ఉద్దండులైన నటీనటులు– గుమ్మడి విమల కుమారి, బద్వేలు శ్రీహరిరావు, విజయరాజు, వై. గోపాలరావు, రామచంద్ర నాయుడు మొదలైన ఎందరో పెద్దలు ఉన్నారు. నేను కడపలో నా పనులు ముగించుకుని రాత్రి సమయానికి చెప్పలమ్మ తిరునాళ్లు జరిగే చోటుకు చేరుకున్నాను. అక్కడ మేకప్‌ రూంలో చూస్తే చీమకుర్తి కనిపించలేదు. విచారిస్తే, ‘ఎక్కడో తాగి పడిపోయి వుంటాడు, చూడు పో’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు అక్కడున్న వాళ్ళు. అప్పటికి నాటకం మొదలై ‘వేట సీను’ హరిశ్చంద్రుడుగా గుమ్మడి విమల కుమారి అద్భుతంగా పాడి దిగినారు. ‘అడవి సీను’ హరిశ్చంద్ర పాత్రధారి బద్వేలు శ్రీహరి రావు వేదిక ఎక్కినారు. కానీ ‘వారణాసి’ హరిశ్చంద్రుడి జాడే లేదు. తరువాత వారణాసి సీను కాబట్టి ఇప్పుడాయన మేకప్పు వేసుకుంటూ వుండాలి. సరే ఎక్కడైనా పడుకుండిపోయాడే మోనని, ఆయన్ని వెతుకుతూ వేదిక చుట్టూ తిరు గుతూ వున్నా. అక్కడ ఒక చోట ‘అబ్బ చీమలు! దానికి తోడు ఉబ్బగా ఉంది. అట్లా విసురు వెంకమ్మా!’ అంటున్న గొంతు వినపడింది. అక్కడ, పుట్ట పక్కనే నేలపై తువ్వాలు పరుచు కుని, చీమకుర్తి పడుకుని వున్నాడు. ‘అన్నా! ఇక్కడున్నావా? అడవి సీను అయిపోవచ్చింది!’ అన్నాను. ‘అయ్యా వచ్చావా? ఆ కాంట్రాక్టర్‌ రెడ్డి కనపడలేదా? కనీసం అన్నం కూడా పెట్టించలేదయ్యా!’ అన్నాడు ఎంతో బాధగా. ఆయనని వెంటపెట్టుకొని పోయి అన్నదానం దగ్గర భోజనం పెట్టించి, మేకప్‌ రూమ్‌ దగ్గరకి వచ్చాము. అడవి సీను అయి పోయింది.

హడావిడిగా మేకప్‌ ముగించుకుని వేదిక ఎక్కినాడు చీమకుర్తి. ప్రక్కన చంద్రమతీ లోహితాస్య నక్షత్రక సమేతంగా వారణాసి ఘట్టంలోకి ప్రవేశించినాడు. ‘దేవీ కష్టము లెట్లుండిననూ, పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి చూడూ, ఈ వారణాసీ,’ అని డైలాగు చెప్పి, ‘భక్తయోగపదన్యాసి వారణాసి’ అని పాడగానే జనం వన్స్‌మోర్‌ వన్స్‌మోర్‌లు కొడుతూ చప్పట్లూ కేకలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది! తిరిగి అదే పద్యాన్ని భాగేశ్వరీ రాగంలో సమ్మోహనంగా పాడాడు చీమకుర్తి. పద్యాల ప్రభంజనం మొదలయ్యింది! ‘అంతటి రాజచంద్రునకు ఆత్మజవై – కకుబంత కాంత విశ్రాంత యశోవిశాలుని త్రిశంకు నృపాలుని యిల్లు జొచ్చి’ అని చీమకుర్తి ముఖారి రాగం హెచ్చు స్థాయిల్లో పాడుతుంటే వింటున్న జనం ఏడుస్తున్నారు. ఆ ప్రాంతమంతా నిశ్శబ్దమైపోయింది. తనని బానిసగా విక్రయించినప్పుడు చంద్రమతి పతీ వియోగ దుఃఖంతో హరిశ్చంద్రుని పాదాలపై పడి మొరపెట్టుకునేవేళ, రారాజు బిడ్డయైన దేవికి ఇంతటి కష్టం తెచ్చిపెట్టినందుకు ఒకింత చింతిస్తూ, ‘ఛీ ఛీ కఠినాత్మా హరిశ్చంద్రా! నీవు నిక్కముగా కిరాతులకు జన్మించవలసిన వాడవు గదా!’ అని డైలాగు చెప్పి పద్యం చదివేవేళ, ‘పట్టపుందేవినమ్మితే బానిస గనూ’ అంటూ కళ్ళ వెంబడి పెల్లుబికిన కన్నీటి బిందువులామె శిరస్సుపై జారిపడటం ప్రేక్షక హృదయాలను కలచివేసిన దృశ్యం. కమలాపురం ప్రాంతానికి చీమకుర్తిని తొలిసారి బుక్‌ చేసినారు. ఎట్లా పాడి రక్తి కట్టిస్తాడో మరి ఈ నాటకాన్ని అనుకున్నాను. కానీ ఆ రోజు చీమకుర్తి ఒక్క చుక్క కూడా మందు ముట్టలేదంటే ఎవరూ నమ్మలేని నిజం. కొత్త ప్రాంత మని భయమో బిడియమో తెలియదు గానీ ఆ నాటకంలో చిరస్మరణీయంగా పాడినాడు. ఈలలతో కేకలతో ఆ పేదజనం డబ్బుల దండలతో చీమకుర్తిని ముంచేశారు. వేదిక ఎక్కక ముందు ఆయన అనామకుడే. పాడి దిగిన తర్వాత ఆయన చుట్టూ వున్న జన సమూహాన్ని దాటుకుని ఆయన్ని చేరుకో వడానికి చాలా సమయం పట్టింది.


పగలంతా పని చేసి అలసిపోయిన శ్రమ జీవులకు తన గాన మాధుర్యంతో 30 ఏళ్ళ పాటు సేద తీర్చిన మహాకళాకారుడు చీమకుర్తి. ఆంధ్ర రాష్ట్రమే గాక ఇతర రాష్ట్రాలలో దాదాపు 3000 ప్రదర్శనలు ఇచ్చి రంగస్థలాన హరిశ్చంద్ర పాత్రకు జీవం పోసి తెలుగు గుండెలపై చెరగని ముద్ర వేసిన కళాకారుడు. తన ముందు తరం ‘హరిశ్చంద్ర’ పాత్రధారులైన బండారు రామారావు, డి.వి. సుబ్బారావు గార్లను అనుకరిస్తూనే అరుదైన స్వంత బాణీని ఏర్పరచుకున్నాడు. ఆ నడుమ కీ.శే. ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం తన ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్‌లో ఔత్సాహిక గాయకుల చేత చీమకుర్తి పద్యాలు పాడించి ‘ఇటువంటి సంగీతకారుణ్ణి నా జీవితంలో వినలేదు కనలేదు’ అని వేనోళ్ళ పొగిడారు. ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న చీమకుర్తి గురించి ప్రస్తావిస్తూ, ‘కళ తప్ప ఇంకేమీ తెలియని వాడు. భారతరత్నకు అర్హుడు’ అని ప్రశంసించినారు. తెలుగు నాట రోజుకో పద్యమైనా వినకుంటే పూట గడవని మాస్‌ ఫాన్స్‌ వున్నారు చీమకుర్తికి.


2006లో చీమకుర్తి చివరి నాటకం నెల్లూరు టౌన్‌ హాల్‌లో జరిగింది. బొత్తిగా చిక్కిపోయినాడు. ఎముకల గూడుకు వేషం వేసినట్లుగా వుంది ఆయన రూపం. ‘భక్తయోగ పదన్యాసి’ పద్యమే పాడలేకున్నాడు. వేదిక ముందు అశేష జనవాహిని టిక్కెట్టు కొని మరీ వచ్చి వున్నారు. ఆ పద్యం కాకపోతే ఇంకో పద్యమైనా పాడతాడు అనుకుంటూ పడిగాపులు పడ్డారే గానీ, చీమకుర్తిని పల్లెత్తు మాట అనలేకపోయారు. ‘అయ్యా! నా ఆరోగ్యం బాగులేదు. డి.వి., బండారు– మేమంతా తాగి తాగి ఇట్టయినాము. మాలాగా ఎవరూ కాకూడదు’ అంటూ మధ్య మధ్యలో జనానికి హితవు చెపుతున్నాడు. గాత్రం సహక రించక మధ్యలోనే స్టేజీ దిగిపోయాడు. దిగేముందు కన్నీటి పర్యంతమవుతూ చేతులు జోడించి నమస్కరిస్తూనే వున్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే దేహయాత్ర చాలించాడు.

ఈమధ్య ఒకసారి చీమకుర్తికి పోయి రావాలనుకున్నాను. నాగేశ్వరరావు సగభాగం వెంకమ్మ గారు అక్కడే వున్నారు. అప్పుడే ఆయన వెళ్ళిపోయి 18ఏళ్లయ్యింది. ఆమె ఎలా ఉందో, ఆ కుటుంబం ఎలా వుందో చూసి రావాలనిపించింది. చీమకుర్తికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఎన్నోసార్లు అగ్రహారం వచ్చినాను గానీ, ఇప్పుడు ఇల్లు కనుక్కోలేకపోయినాను. ఆ వీధి మొత్తం మారిపోయింది. ఎవరో ఇల్లు చూపించారు. కనీసం విద్యుత్‌ సరఫరా లేని ఆ చీకటి ఇంట్లోకి అడుగుపెట్టగానే కుక్కి మంచంలో లేవలేని స్థితిలో వున్న వెంకమ్మ నన్ను చూసి లేవబోయారు. ఆ స్థితిలో ఆమెను చూడగానే నా కళ్ళ వెంట కన్నీళ్లు కారాయి. ఒక్కగానొక్క కుమారుడు కూలిపని చేస్తూ వండి పెడుతున్నాడు. వెంకమ్మ గారు కాలు చెయ్యి ఆడి, తిరిగే రోజుల్లో పూట గడవక కూలి పనులకు వెళ్లేవారట. చీమకుర్తి నడిబొడ్డున అభిమానులు నాగేశ్వరరావు గారి విగ్రహం నిలిపిన చోట గంపలో జామకాయలు, వేరుశెనక్కాయలు పెట్టి అమ్ముకునే వారట. ఇప్పుడు అదీ లేదు. ‘హృదయమున దుఃఖమింతేనియున్‌ పదిల పడదూ – మరతునన్నా సతీసుతుల్‌ మరుపురారు’ అని పరితపిస్తూ కాటిసీన్లో భార్యాబిడ్డల్ని తలచుకొని దుఃఖించిన చీమకుర్తి నేడు వారి దీనస్థితిని చూడలేక ముదురు తమస్సులో మునిగిపోయినాడు. చీమకుర్తి కొండల్లో గుంకినాడు.

(జనవరి 21 చీమకుర్తి నాగేశ్వరరావు వర్ధంతి)

పుట్టా పెంచల్దాస్‌

63055 22467

Updated Date - Jan 20 , 2025 | 12:38 AM