Political Pressures: వర్గీకరణ మెడపై ‘371డి’ కత్తి!
ABN, Publish Date - Mar 08 , 2025 | 06:35 AM
ఇప్పటికే ఆ కమిషన్ ఎస్సీ రిజర్వేషన్లను ఎ, బి, సి అనే మూడు గ్రూపులుగా విభజించింది. అయితే తర్వాత వచ్చే నివేదికలో నాలుగు గ్రూపులుగా చేస్తుందా? మాదిగల రిజర్వేషన్ శాతాన్ని 11 లేదా 12 శాతానికి పెంచుతారా?
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏర్పాటు చేయబడిన జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికపై ఎమ్మార్పీఎస్ అభ్యంతరాల నేపథ్యంలో ఆ కమిషన్ గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇప్పటికే ఆ కమిషన్ ఎస్సీ రిజర్వేషన్లను ఎ, బి, సి అనే మూడు గ్రూపులుగా విభజించింది. అయితే తర్వాత వచ్చే నివేదికలో నాలుగు గ్రూపులుగా చేస్తుందా? మాదిగల రిజర్వేషన్ శాతాన్ని 11 లేదా 12 శాతానికి పెంచుతారా? అలా పెంచితే ఎవరికి తగ్గిస్తారు? అంటే మాలలకు 5 శాతంగా కేటాయించిన దాన్ని 4 లేదా 3 శాతానికి తగ్గిస్తారా? అలాగే మాల, మాదిగ కాని కులాలు గతంలో లాగానే అవే గ్రూపులో ఉంటాయా, వేరే గ్రూపుల్లోకి మార్చబడతాయా? వారు డిమాండ్ చేసినట్లు వారి రిజర్వేషన్ శాతాన్ని కూడా గతం కంటే పెంచుతారా? – అనే వాటికి సమాధానాల కోసం వేచి చూడాలి.
ఇలా రాజకీయ ఒత్తిడితోను, రాజకీయ ప్రయోజనాల కోసమూ మార్పులు, చేర్పులు చేయిస్తే అంతిమంగా అది సుప్రీంకోర్టులో నిలబడుతుందా అనే సమస్య ఎలాగూ ఉన్నది. అలాగే తెలుగు రాష్ట్రాలలో ఉనికిలో ఉన్న ఆర్టికల్ 371డి అనే మరో పెద్ద సమస్య కూడా ఉన్నది. కానీ దీన్ని గురించి ఎవరూ మాట్లాడటం లేదు.
ఈ ఆర్టికల్ 371డి అనేది 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉనికిలోకి వచ్చింది. దేశంలో కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉద్దేశించబడినది. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలను, వెనుకబాటుతనాన్ని తగ్గించడం కోసం ఉద్యోగ నియామకాలు జోనల్, జిల్లా, స్థానిక స్థాయిల ఆధారంగా జరగాలని నిర్దేశిస్తున్నది. ఈ 371డి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఉనికిలో ఉంది. అటువంటప్పుడు కేవలం రాష్ట్ర సగటు ఆధారంగా వర్గీకరణ గ్రూపులు చేస్తే అది రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించటమే అవుతుంది కదా. కాబట్టి జోనల్, జిల్లా, స్థానిక స్థాయిలలో కూడా రిజర్వేషన్లను వర్గీకరణ చేయాలి. రాష్ట్ర సగటులు జిల్లాలలో పనిచేయవు. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ జిల్లాలలో మాదిగలు ఎక్కువ, తక్కువ జిల్లాలలో మాలలు ఎక్కువ సంఖ్యలో ఉండటం కనబడుతుంది. ఉదాహరణకి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలో మాదిగల జనాభా ఎక్కువ. అక్కడ జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించి రాష్ట్ర సగటుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడితే వారు నష్టపోతారు. కాబట్టి 371డి ప్రకారంగా జిల్లా స్థాయిలోనే గాక జోనల్, స్థానిక స్థాయి ఆధారంగా కూడా వర్గీకరణ జరగాలి. అప్పుడు జోనల్‌లో జరిగిన వర్గీకరణ జిల్లాలో ఉండదు. జిల్లాలో వర్గీకరణ స్థానిక స్థాయిలో ఉండదు. ఈ విధంగా ఒక దగ్గర ఉన్న గ్రూపులో ఉన్న కులాలు మరో దగ్గర ఉండవు. ఎక్కువ జనాభా కలిగిన మాదిగ, మాల కులాలకు ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉండవచ్చు కానీ వందల్లో వేలల్లో జనాభా కలిగిన ఇతర షెడ్యూల్ కులాలకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
మరి దీని నుంచి బయటపడే మార్గం ఏమి లేదా? అంటే ఉంది. అదేమంటే, వర్గీకరణను కులాల వారి జనాభా శాతాన్ని బట్టి కాక, ఆయా కులాలలో జరిగిన అభివృద్ధి, వెనుకబాటుతనం ఆధారంగా చేపట్టడం. అంటే వారిలో విద్య, ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాల ఆధారంగా ముందు వరుసలో ఉన్న వారిని గుర్తించాలి. అదే సమయంలో ఇంకా ఆయా కులాలలో భూమి లేక రెక్కాడితే గానీ డొక్కాడని వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వారే ఇప్పటివరకు రిజర్వేషన్ల అవకాశాలను పొందటంలో వెనకబాటుకు గురయ్యారు. కాబట్టి వీరి అభివృద్ధి, వెనుకబాటు ఆధారంగా వర్గీకరణ చేయడం వల్ల 371డి సమస్య ఉత్పన్నం కాదు. రిజర్వేషన్లు ఇప్పటివరకు ఎవరికైతే అందటం లేదో వారికి అందాలంటే ఈ పద్ధతే శాస్త్రీయం
ఇలాగాక కులాలవారీగా వర్గీకరణ చేయడం వల్ల ఆయా కులాల్లో ఇప్పటికే రిజర్వేషన్ పొంది అభివృద్ధి చెందినవారు ఇప్పుడు కులాలవారీగా కల్పిస్తున్న రిజర్వేషన్ అవకాశాన్ని తిరిగి పొందటంలో ముందు వరుసలో ఉంటారు. అందువల్ల ఆయా కులాలలో ఉన్న పేదలు మరలా రిజర్వేషన్లను పొందలేని స్థితిలోకి నెట్టబడతారు. ఏ ఉద్దేశం కోసమైతే రిజర్వేషన్లు వర్గీకరించాలని కోరుతున్నామో ఆ లక్ష్యం నెరవేరదు.
అన్ని కులాలలో అభివృద్ధి చెందిన వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారందరూ ఒక గ్రూపులో ఉండటం వల్ల వారి సంఖ్య ఆధారంగా వారికి తక్కువ రిజర్వేషన్ ఉండటంతో ఆ రకంగా వారు ఎక్కువగా రిజర్వేషన్ పొందే అవకాశం ఉండదు. అప్పుడు ఎక్కువగా ఉండే పేదలకు అదే శాతంలో రిజర్వేషన్ అందుబాటులోకి వస్తుంది. సామాజిక న్యాయం అంటే ఇదే కదా. ఇప్పటికైనా వైషమ్యాలు తగ్గించి ఐక్యతను పెంచే, కుల నిర్మూలనకు బాట వేసే శాస్త్రీయ వర్గీకరణ జరగాలని కోరుదాం.
డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు
Updated Date - Mar 08 , 2025 | 06:35 AM