ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హితవు పలికే ముందు గతం చూసుకోరా?

ABN, Publish Date - Jan 21 , 2025 | 06:01 AM

కల్వకుంట్ల కవిత ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం (‘కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయం’ –జనవరి 8) ముగింపులో ‘రామన్న’ పై అక్రమ కేసులు పెట్టారని, అట్టి కేసులను తెలంగాణ ప్రజలు వ్యతిరేకించాలని...

కల్వకుంట్ల కవిత ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం (‘కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయం’ –జనవరి 8) ముగింపులో ‘రామన్న’ పై అక్రమ కేసులు పెట్టారని, అట్టి కేసులను తెలంగాణ ప్రజలు వ్యతిరేకించాలని, రాష్ట్రాన్ని పాలిస్తున్న దగాకోర్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని హితవు పలికారు. ప్రతి ఐదేళ్ళకోసారి ఎన్నికలు వచ్చినప్పుడు తప్పక ప్రజలు ఆ పని చేస్తూనే ఉన్నారని గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రుజువు చేసిన విషయం కల్వకుంట్ల కవితకు తెలియనిదేమీ కాదు.

గత 75 సంవత్సరాల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేకమంది ముఖ్యమంత్రులు తమ పాలనలో కేవలం రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించారు. ఎన్నుకున్న ప్రజలకు దగా చేయలేదు. కల్లబొల్లి మాటలు అలవి కాని వాగ్దానాలు చేసి ఎన్నుకున్న తర్వాత ప్రజలను దగా చేయడం మన తెలంగాణ రాష్ట్రంలోనే మొదలైన విషయం కల్వకుంట్ల కవితకు గుర్తులేదు కావచ్చు కానీ తెలంగాణ బాధిత ప్రజలు మాత్రం ఇంకా మర్చిపోలేదు.


దశాబ్దాల తరబడి రాష్ట్రం కొరకు పోరాడి ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు త్యాగాలు చేసిన ఉద్యమకారులకు మొండి చేయి చూపించి అవమానపరిచి దగా చేసింది ఎవరో చరిత్రలో మిగిలే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని వందల పర్యాయాలు వాగ్దానం చేసిన కేసీఆర్‌ రాష్ట్రం అవతరించిన తర్వాత వరుసగా తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి దళితులకు దగా చేయలేదా? తెలంగాణ ప్రజల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కుటుంబ పార్టీగా ఎలా మార్చుకున్నారో ప్రజలకు తెలియనిదా? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సర్వం త్యాగం చేసిన అనేకమంది ఉద్దండులైన దళిత, బహుజన నాయకులను అవమానపరిచి పొగ పెట్టిన ఉదంతాలు కల్వకుంట్ల కవిత మరిచిపోయినా తెలంగాణ ప్రజలు మాత్రం ఇంకా మరిచిపోలేదు.

ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన ప్రవేశపెట్టి రాష్ట్ర క్యాబినెట్‌లో కుటుంబ సభ్యులనే నలుగురిని ఉన్నతస్థాయి మంత్రి పదవులు ఇచ్చి 55శాతం జనాభా ఉన్న వెనుకబడిన కులాలకు దగా చేయలేదా? తెలంగాణ ఉద్యమకారులకు ప్రతినెల రూ.3000 పింఛను ఇస్తానని 2019 ఎన్నికల ముందు ప్రకటించి ఐదేళ్ళు గడిచినా చిల్లిగవ్వ కూడా విదిలించలేదు. భూస్వాముల దగ్గర కొనుగోలు చేసి దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న పేద, చిన్న రైతుల భూములను ధరణి పోర్టల్ ద్వారా తిరిగి దొరలకు, భూస్వాములకు పట్టా పాసు బుక్కులు అప్పచెప్పారు. రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల అప్పుచేసి ఇక కొత్త ప్రభుత్వానికి తిరిగి అప్పు దొరకకుండా చేసి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు లేకుండా చేశారు. వెనుకబడిన కులాలకు స్థానిక సంస్థలలో ఉన్న 33శాతం రిజర్వేషన్ 18 శాతానికి తగ్గించారు. పేదల విద్య వైద్య రంగాలకు నిధులు కేటాయించక అధ్యాపక, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయక నిర్వీర్యం చేశారు.


పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూముల ఇండ్ల నిర్మాణం చేస్తామని చెప్పి మచ్చు కొరకు మీ సొంత నియోజకవర్గాల్లో పంపిణీ చేసి ఇతర ప్రాంతాల పేదలకు దగా చేశారు. కనీసం ఇళ్ల స్థలాలు కూడా పంచకుండా పట్టణ ప్రాంతాల్లోని భూములను ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని విలువైన భూములను కారు చౌకగా అమ్ముకున్నారు. ఎకరాల కొద్ది భూములను పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం వాడుకున్నారు.

కల్వకుంట్ల కవిత కనీసం ఇప్పటికైనా తమ కుటుంబ పాలనలో జరిగిన తప్పులను మర్చిపోకుండా ప్రజల ముందు లెక్కిస్తే ప్రజలు అభినందించేవారు. పదేళ్ళ విధ్వంస పాలన నుండి విముక్తి పొందాలని ప్రజలు ఎదురుచూస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా గత శాసనసభ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రస్తుత ప్రభుత్వం సంవత్సరానికి 32 నుండి 40 వేల కోట్ల రూపాయలు కేవలం అప్పులు, వడ్డీలు చెల్లించాల్సిందే. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు పెన్షన్‌దారులకు ప్రతి నెల 15వ తేదీ వరకు కూడా జీతభత్యాలు ఇవ్వలేని దుస్థితి నుండి ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైన విషయం కల్వకుంట్ల కవితకు గుర్తు రావడం లేదా?


ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయలేని దుస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్న విషయం విజ్ఞులైన ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రజలపై ఇంకా అదనపు పన్నులు, ఎక్సైజ్ సుంకాలు, ధరల పెంపుకు అవకాశమే లేదు. పోనీ గత ప్రభుత్వం వలె ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చే అవకాశం అంతకూ లేదు. ఇప్పుడు విలువైన ప్రభుత్వ భూములు అమ్మితే ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రస్తుత పాలకపక్షం ఇచ్చిన అన్ని హామీలను సంపూర్ణంగా అమలు చేయలేక పోతుందని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అలవి గాని హామీలను ఇవ్వడం అన్ని రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. అందులో అన్ని రాజకీయ పార్టీలకు ఈ విద్య నేర్పింది భారత రాష్ట్ర సమితి నాయకత్వమే అంటే అతిశయోక్తి కాదేమో. గత ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు పది సంవత్సరాల కాలంలో కూడా అమలు చేయలేదు. అందుకే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. లోకసభ ఎన్నికలలో గుండు సున్నా మార్కులు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాల పాలన పూర్తి అయ్యే నాటికి ఇచ్చిన వాగ్దానాలు, హామీలు సంపూర్ణంగా అమలుచేయకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నాయకులకు ప్రజలు వాళ్ల పనితనాన్ని బట్టి మాత్రమే మార్కులు వేస్తారు.


కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులను, అరెస్టులను అడ్డుకోవాలని, వాటిని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డున పడాలని కల్వకుంట్ల కవిత ప్రజలకు హితవు చెప్పేముందు గత పదేళ్ళలో జరిగిన అణచివేతలు, అరెస్టులు, ఆర్థిక విధ్వంసం, అవినీతి పాలనను గుర్తు చేసుకుంటే బాగుండేది. చట్టాన్ని అతిక్రమించిన ఏ వ్యక్తికైనా విచారణ, అవసరమైతే శిక్షల పద్ధతి ఒకే తీరుగా ఉంటుంది. తమ కుటుంబ సభ్యులు అందుకు అతీతులు కాదని కవిత తెలుసుకోవాలి.

ప్రొఫెసర్ కూరపాటి వెంకట్‌నారాయణ

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ చైర్మన్

Updated Date - Jan 21 , 2025 | 06:01 AM