అసర్ నివేదిక రట్టు చేసిన ‘నాడు–నేడు’ గుట్టు!
ABN, Publish Date - Feb 08 , 2025 | 06:28 AM
విద్యా వికాసమే లక్ష్యంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన వైసీపీ ప్రభుత్వం, ఐదేళ్లు పాఠశాల విద్యావ్యవస్థతో ఆడుకొన్నది. జగన్ అనాలోచిత వెర్రి, మొర్రి ప్రయోగాలతో విద్యావ్యవస్థ మొత్తంగా పడకేసింది. 117 జీఓతో ఏమి జరిగిందో, ఐదేళ్ల తర్వాత అర్థమైంది. చివరికి ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అయిపోయాయి. జీరో పిల్లల పాఠశాలలుగా,
విద్యా వికాసమే లక్ష్యంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన వైసీపీ ప్రభుత్వం, ఐదేళ్లు పాఠశాల విద్యావ్యవస్థతో ఆడుకొన్నది. జగన్ అనాలోచిత వెర్రి, మొర్రి ప్రయోగాలతో విద్యావ్యవస్థ మొత్తంగా పడకేసింది. 117 జీఓతో ఏమి జరిగిందో, ఐదేళ్ల తర్వాత అర్థమైంది. చివరికి ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అయిపోయాయి. జీరో పిల్లల పాఠశాలలుగా, ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. నాడు–నేడు పేరుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాథమిక పాఠశాలలు పిల్లలు లేక వెలవెలపోయాయి. హేతుబద్ధీకరణ పేరిట నాలుగు, అయిదు తరగతులను కిలోమీటర్ల దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి వందలాది ప్రాథమిక పాఠశాలలు వాటికవే మూతపడ్డాయి. ఉన్న పళాన ఆంగ్ల మాధ్యమాన్ని రుద్దటం, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోవటం వంటి చర్యలన్నీ డ్రాపౌట్లకు కారణమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 2021–22లో 45 లక్షల మంది విద్యార్థులు ఉంటే, ఆ సంఖ్య 2023 విద్యా సంవత్సరంలో 38 లక్షలకు పడిపోయింది. రాష్ట్ర పాఠశాలల్లో సగటున రోజువారీ గైర్హాజరు 24.3 శాతానికి పెరిగింది. నాలుగో వంతు విద్యార్థులు రోజూ బడికి రాలేని పరిస్థితి వచ్చిందంటే, రాష్ట్రంలో విద్యాప్రమాణాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా విద్యాదానంలో తరిస్తున్న ఎయిడెడ్ పాఠశాలల విలువైన భూములపై కన్నేసి, ఎయిడెడ్ పాఠశాలలను వెంటాడి వేధించి భ్రష్టుపట్టించింది.
తేలిక పదాలతో కూడిన రెండో తరగతి తెలుగు పాఠాన్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లోని ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో 47 శాతం మంది తప్పుల్లేకుండా చదవలేకపోయారు. 2014లో ఇలాంటి స్థితిలో 20.5 శాతం మంది విద్యార్థులుండగా, ఇప్పుడది రెండింతలకు పైగా పెరిగింది. వైసీపీ పాలనలో సంస్కరణల పేరిట పాఠశాల విద్యలో సృష్టించిన విధ్వంస విధానం విద్యార్థుల చదువుల సామర్థ్యాన్ని దారుణంగా దెబ్బతీసిందని ప్రథమ్ సంస్థ వెల్లడించిన వార్షిక విద్యా స్థితిగతుల 2024–(అసర్) నివేదిక బయటపెట్టింది. అలాగే రెండో తరగతి తెలుగు పాఠాన్ని ఐదో తరగతి విద్యార్థులలో 62.5శాతం మంది చదవలేకపోయారని, మూడో తరగతిలో 85.3శాతం మందికి చదవడమే రావడం లేదని నివేదిక తేల్చింది. రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన 390 గ్రామాల్లో 7,721 కుటుంబాలు, 3–16 ఏళ్ల వయస్సున్న 12,697 మంది పిల్లలను సర్వే చేశారు. 352 ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 3, 5, 8 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను విడివిడిగా విడుదల చేసింది అసర్ కమిటీ. మాతృభాషలో అక్షరాలు, పదాలు, ఒకటి, రెండో తరగతి స్థాయి పాఠాలు, గణిత అంకెలు, తీసివేతలు, భాగహారాలు ఇచ్చి విద్యార్థుల సామర్థ్యాలను గణించారు. 14–16 ఏళ్ల వయసు పిల్లల్లో డిజిటల్ అక్షరాస్యతపైనా సర్వే చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి చూస్తే, అబ్బాయిల కంటే అమ్మాయిలు మెరుగ్గా ఉన్నట్లు అసర్ నివేదిక తేల్చింది.
ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. 70.8శాతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది లోపే విద్యార్థులున్నారని, మధ్యాహ్న భోజనం తయారీకి 22.9శాతం బడుల్లో వంట గదులు లేవని, వైసీపీ ప్రభుత్వం నాడు–నేడు పేరుతో ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించామని ఉత్తుత్తి ప్రకటనలు చేసిందే తప్ప, పనులు చేయలేదని అసర్ నివేదిక వాస్తవాలు వెల్లడించింది. 55.9శాతం బడుల్లోనే తాగునీటి సదుపాయం ఉండగా, 26.2శాతం బడుల్లో సదుపాయం ఉన్నా, తాగునీరు లేదని పేర్కొంది. అలాగే 78.4శాతం బడుల్లోనే మరుగుదొడ్లు వాడకంలో ఉన్నాయని, 77.2శాతం బడుల్లో బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండగా, 9.8శాతం స్కూళ్లలో ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నా వాడకంలో లేవని కూడా అసర్ నివేదిక నాడు–నేడు గుట్టు రట్టు చేసింది. వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను రాజకీయ ప్రయోగశాలగా మార్చింది. విద్యకు రూ.70వేల కోట్లు ఖర్చు చేసామంటున్న వైసీపీ ప్రభుత్వం అంత ప్రజాధనాన్నే కాదు, అంతకుమించి ఒక తరం విద్యార్థుల భవిష్యత్తును కూడా బలిపీఠం పైకి నెట్టింది.
విద్యారంగానికి గొడ్డలి పెట్టుగా మారిన జీవో 117కు స్వస్తి పలికేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగుదేశం హయాంలో ఆంధ్రప్రదేశ్ నాణ్యమైన విద్య అందించడంలో 3వ స్థానంలో ఉండగా, జగన్ హయాంలో 19వ స్థానానికి దిగజారిందని అసర్ నివేదిక నిగ్గుతేల్చింది.
l నీరుకొండ ప్రసాద్
Updated Date - Feb 08 , 2025 | 06:29 AM