ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Turmeric : పసుపు సేద్యం

ABN, Publish Date - Jan 18 , 2025 | 04:18 AM

మన సంస్కృతీ సంప్రదాయాలలో పసుపు ప్రాధాన్యం గురించి సంపూర్ణ అవగాహన లేనివారు సైతం ఆ సుగంధ ద్రవ్యం ఆరోగ్యవర్ధిని అని చెప్పడం కద్దు. ముఖ్యంగా కోవిడ్‌ భయానక అనుభవాలను ఇంకా మరచిపోనివారు ఆ విషయాన్ని మరీ ఘంటాపథంగా

మన సంస్కృతీ సంప్రదాయాలలో పసుపు ప్రాధాన్యం గురించి సంపూర్ణ అవగాహన లేనివారు సైతం ఆ సుగంధ ద్రవ్యం ఆరోగ్యవర్ధిని అని చెప్పడం కద్దు. ముఖ్యంగా కోవిడ్‌ భయానక అనుభవాలను ఇంకా మరచిపోనివారు ఆ విషయాన్ని మరీ ఘంటాపథంగా ఘోషిస్తారు. ఆ విపత్కర కాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు నెలల తరబడి రోజూ పాలలో చిటికెడు పసుపు పొడి కలుపుకుని తాగిన వారు సంఖ్యానేకంగా ఉన్నారు. పసుపు ఆరోగ్య ప్రదాయిని మాత్రమే కాదు, ఐశ్వర్య ప్రదాయిని కూడా. ఆ ఐశ్వర్యాభివృద్ధిలో రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకై కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసింది.

రాజకీయాలతో ముడివడని వ్యవహారం ఈ రోజుల్లో ఏదీ ఉండదు కదా. అందునా రైతులకు సంబంధించిన విషయాన్ని పాలకులు ఖాయం చేయడమనేది అంత త్వరగా జరగదు. కనుకనే రైతులు పసుపు బోర్డుకై మొక్కవోని దీక్షతో పోరాడారు. ఈ క్రమంలో ఒక నాయకురాలిని పార్లమెంటుకు ఎన్నుకోవడానికి నిరాకరించారు, అంతకంటే ముఖ్యంగా 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని పైనే పోటీ చేసేందుకు నిజామాబాద్‌ నుంచి వారణాసి వెళ్లి నామినేషన్లు వేశారు. తెలంగాణ పసుపు రైతుల డిమాండ్‌కు సరైన రీతిలో ప్రతిస్పందించడంలో కాలవిలంబన చేసినా మోదీ అంతిమంగా శ్రేయోదాయకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.


మకర సంక్రాంతి రోజున నిజామాబాద్‌లో ప్రారంభమైన పసుపు బోర్డు ‘మోసుకొచ్చాం స్వరాజ్యమ్మూట మూట విప్పితే ఏమీ లేదు’ చందం కాకూడదు. ఒక నిర్దిష్ట పంట అభివృద్ధికి ప్రత్యేకంగా ఏర్పడే బోర్డుకు కొత్త వంగడాలు సృష్టించడం, తెగుళ్ల నివారణకు కృషి చేయడం, దిగుబడుల నాణ్యత పెంచడం, మార్కెట్‌ విస్తరించడం, కొత్త మార్కెట్‌ సృష్టించడం మొదలైన బాధ్యతలు ఉంటాయి. తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలోని పసుపు రైతుల సంక్షేమ సాధనకు ఈ జాతీయ బోర్డు బాధ్యత వహిస్తుంది. అయితే దేశంలో ఆర్థికంగా వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉన్న అవిభక్త నిజామాబాద్‌ జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం మరే ప్రాంతంలో కంటే ఎక్కువ. కనుక ఈ గోదావరీ తీరస్థ ప్రాంతం రైతుల (బోర్డు కోసం పోరాడడంలో ముందున్నదీ వీరే కదా) అభ్యున్నతిపై పసుపు బోర్డు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.


పసుపు సేద్యం, వాణిజ్యంలో భారత్‌ ప్రపంచ అగ్రగామిగా ఉన్నది. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 70 శాతం వాటా, వాణిజ్యంలో 62 శాతం వాటా భారత్‌ సొంతం. 2023–24లో 226.5 మిలియన్‌ డాలర్ల విలువైన 1.62 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తులను భారత్‌ ఎగుమతి చేసింది. అంతర్జాతీయ పసుపు విపణిలో మరింత వాటాను సాధించుకోగల సత్తా మన దేశానికి ఉన్నది. అయితే అందుకు నవీన సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా మరింత నాణ్యమైన పసుపును ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టవలసిన అవసరమున్నది. 2030 సంవత్సరం నాటికి 100 కోట్ల డాలర్ల విలువైన పసుపు ఎగుమతులను లక్ష్యంగా కేంద్రం నిర్దేశించింది. ఈ లక్ష్య పరిపూర్తిలో పసుపు బోర్టు బృహత్తర పాత్ర నిర్వహించవలసి ఉన్నది. ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో పసుపును విరివిగా వాడుతున్నందున అంతర్జాతీయంగా ఈ సుగంధ ద్రవ్యానికి మంచి గిరాకీ ఉన్నది. విదేశీ మార్కెట్లకు మరింతగా సరఫరా చేయడం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని ఇతోధికంగా పెంచుకోవచ్చు. అంతర్జాతీయ విపణి అవసరాలకు అనుగుణంగా దేశీయ పసుపు సాగు పద్ధతులు మార్చుకోవల్సిన అవసరమున్నది. నాణ్యమైన పసుపును ఎగుమతి చేసినప్పుడు ఈ సుగంధ ద్రవ్యం ద్వారా దేశానికి సమకూరుతున్న ఆదాయం మరింతగా పెరుగుతుంది.

పసుపు సాగుతో సొంత ఆదాయాన్ని, స్వరాష్ట్ర, స్వదేశ ఐశ్వర్యాన్ని మరింత సమృద్ధం చేయగల అవకాశం నిజామాబాద్‌ రైతులకు లభించింది. శతాబ్దాల క్రితం తెలుగునాట ఒక కొత్త ధర్మాన్ని (బౌద్ధం) తొట్టతొలుత ప్రవేశపెట్టిన బావరి అనే జ్ఞాని ఈ ప్రాంతీయుడే. జ్ఞానాన్వేషణలో కొత్త భావాలను ప్రవేశపెట్టి తెలుగు వారి బౌద్ధిక చరిత్రకు ఆద్యుడైన అలనాటి బావరి స్ఫూర్తితో ఈనాటి రైతులూ పసుపు బోర్డు సహకారంతో వినూత్న సాగు పద్ధతులతో పసుపు ఉత్పత్తిలో తద్వారా ఐశ్వర్యాభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కాలి. పసుపు సాగులో కొత్త అధ్యాయానికి నాంది పలకడంతో పాటు ఇదే ప్రాంతంలో నిన్నగాక మొన్నటివరకు సిరులు సృష్టించిన నిజాం చక్కెర కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు బావరి నడయాడిన ప్రాంత రైతులు, ప్రజాహితులు వినూత్న ఆలోచనలతో సమష్టిగా కృషి చేయాలి.

Updated Date - Jan 18 , 2025 | 04:18 AM