ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గతించని గతం

ABN, Publish Date - Jan 29 , 2025 | 12:17 AM

‘ఆష్విట్జ్‌ మారణ హోమం తరువాత కవిత్వం రాయడం అనాగరికం’ అన్నాడు జర్మన్‌ తత్వవేత్త థియోడర్‌ అడోర్నో. ఆయన భావమేమిటి? ప్రసన్న చిత్తంతో మననశీలుడైన కవి ఆష్విట్జ్‌...

‘ఆష్విట్జ్‌ మారణ హోమం తరువాత కవిత్వం రాయడం అనాగరికం’ అన్నాడు జర్మన్‌ తత్వవేత్త థియోడర్‌ అడోర్నో. ఆయన భావమేమిటి? ప్రసన్న చిత్తంతో మననశీలుడైన కవి ఆష్విట్జ్‌ మృత్యుకూప యాంత్రీకృత, ఆత్మరహిత, పారిశ్రామిక పాశవికతను వ్యక్తం చేసేందుకు సరైన శబ్దాలను కనుగొనలేడు. కవిత్వం అనేది ఆనందప్రదమైన, రమణీయమైన మానసోల్లాస సృష్టి. నరమేధం బీభత్సాన్ని వ్యక్తీకరించేందుకు అది అననుగుణమైనది.


గత శతాబ్ది ప్రథమార్థంలో జర్మనీని పాలించిన జాత్యహంకారులైన నాజీలు యూదు మతస్థులను సంపూర్ణంగా తుదముట్టించేందుకు చేసిన మహా అమానుషంలో భాగమే ఆష్విట్జ్‌ నిర్బంధ శిబిరం. ఐరోపాలో తాము ఆక్రమించిన అన్ని దేశాల నుంచి యూదులను ఆక్రమిత పోలెండ్‌లో ఏర్పాటు చేసిన ఆ నిర్బంధ శిబిరానికి తరలించి గ్యాస్‌ చాంబర్లలోకి పంపి హతమార్చారు. పదకొండు లక్షల మందికి పైగా యూదులను ఆ ఒక్క నిర్బంధ శిబిరంలోనే మట్టుపెట్టారు. ఆ మారణ హోమం మానవాళి చరిత్రలోనే మహాకిరాతకమైనది. 1945 జనవరి 27న సోవియట్‌ యూనియన్‌ ఎర్రసైన్యం ఆష్విట్జ్‌ను నాజీల నుంచి విముక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి నిర్ణయం ప్రకారం ప్రతి జనవరి 27ను అంతర్జాతీయ హోలోకాస్ట్‌ స్మారక దినంగా పాటిస్తున్నారు.


ఆష్విట్జ్‌ పాపం నాజీ జర్మన్లదే అయినా ఆ ముష్కరుల దుర్మార్గాలు తమ దృష్టికి వచ్చినప్పటికీ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఉపేక్షించాయి. 1945లో ఇంకెప్పుడూ అటువంటి రాక్షసత్వాన్ని చోటు చేసుకోనివ్వకూడదని సంకల్పం చెప్పుకున్నాయి. ఆ సంకల్పానికి కట్టుబడి ఉన్నాయా? 1975–79 మధ్య కంబోడియాలో ఖ్మేర్‌ రూజ్‌ కమ్యూనిస్టులు తమ ఆదర్శ రాజ్య స్థాపనకు 20 లక్షల మందికి పైగా ప్రజలను హతమార్చారు. ర్వాండాలో టుట్సీ, హూటు తెగల మధ్య అంతర్యుద్ధంలో పదిలక్షల మంది బలైపోయారు. 1995లో బోస్నియాలో వేలాది ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. సూడాన్‌లో ఈ శతాబ్ది తొలి సంవత్సరాలలో ప్రజ్వరిల్లిన హింసాకాండలో రెండు లక్షల మందికి పైగా చనిపోయారు. ఈ మారణ కాండల వెనుక అగ్ర రాజ్యాల స్వార్థ ప్రయోజనాలు, గర్హనీయమైన నిర్లక్ష్యం ఉన్నాయని మరి చెప్పనవసరం లేదు. ఇప్పుడు గాజాలో జరుగుతోన్న మారణకాండే అందుకు మరో తిరుగులేని దృష్టాంతం. గాజాలో జరుగుతున్నది గ్యాస్‌ ఛాంబర్లు లేకుండా ఆష్విట్జ్‌ పునరావృతమేనని మౌంగ్‌ జార్నీ అనే మానవ హక్కుల ఉద్యమకారుడు తెగేసి చెప్పారు. అమెరికాతో పాటు జర్మనీతో సహా అనేక యూరోపియన్‌ దేశాలలో కరడుగట్టిన మితవాదులు, మితవాద రాజకీయ పక్షాలు అంతకంతకూ ప్రాబల్యం పొందడాన్ని గమనిస్తే ఆ భయంకర గతం గురించిన భయాలు ఇంకా గతించలేదని, గతించబోవని చెప్పక తప్పదు. ఆష్విట్జ్‌లో సంభవించిందేమిటో నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటేనే ఆ ఘోర చరిత్రకు చరమగీతం పాడడం సాధ్యమవుతుంది.


ఆష్విట్జ్‌ జర్మన్ల నేర కృత్యం కాదని జర్మన్‌ యూదు అయిన అడోర్నో గట్టిగా విశ్వసించాడు. పారిశ్రామిక నాగరికతలోని అమానవత్వమే ఆ మారణహోమానికి దారితీసిందని ఆయన భావించారు. నాజీల దుర్మార్గాలు బహిర్గతమైన తరువాత ఆ దుష్కృత్యాలకు తాము నైతికంగా బాధ్యులమని సామాన్య జర్మన్లు చిత్తశుద్ధితో భావించారు. తమ తాతల ఉదాసీనత మూలంగా జరిగిన ఘోరాలకు నేటి జర్మన్లు మనస్ఫూర్తిగా నైతిక బాధ్యత వహిస్తున్నారు. అపరాధ భావన అనేది వారి మనసుల్లోంచి తొలగిపోలేదు, పోదు కూడా. ఇంకా చెప్పాలంటే గోథే భాష, బీథోవెన్‌ సంగీతం, కాంట్‌ తాత్త్వికత వలే ఆష్విట్జ్‌ కూడా జర్మన్లతో ముడివడిపోయింది. ఆ మారణహోమం కఠోర వాస్తవాన్ని అంగీకరించడం ద్వారానే వారు మానవతకు, తమ అస్తిత్వానికి కొత్త బాటలు నిర్మిస్తున్నారు.


ఒక కొత్త ప్రపంచ అవ్యవస్థ సమస్త దేశాలను కలవరపరుస్తున్న ప్రస్తుత సందర్భంలో మన భారత గణతంత్ర రాజ్యం ఆ పరిస్థితులను మార్చివేయగలుగుతుందా? మన రిపబ్లిక్‌ ఆవిర్భావంలోనే కుల మతాలు, జెండర్‌ ఇతర అంతరాలకు అతీతంగా వయోజనులు అందరికీ ఓటు హక్కు కల్పించడమనేది ప్రజాస్వామిక చింతన, ఆచరణలో ఒక గొప్ప విప్లవాత్మక ముందంజ. ప్రాచీన గ్రీసులో థేలీజ్‌ అనే తత్వవేత్త దృగ్గోచర ప్రపంచమంతటికీ ఒక మూల పదార్థం ఉందని వివేచించి, వైజ్ఞానిక ఆలోచనా సరళికి నాందీ వాచకం పలకడం ద్వారా పాశ్చాత్య మేధో ప్రస్థానంలో సాధించిన మౌలిక పురోగతితో మన గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుల ప్రజాస్వామిక భావ సాహసాన్ని పోల్చవచ్చు. అయితే మహోన్నత సంస్కృతీ నిర్మాతలయిన జర్మన్లు అస్తిత్వ ఆందోళనలతో అనుద్దేశపూర్వకంగా, నాజీ అనాగరికులకు అధికారమిచ్చి తమకు తామే హాని చేసుకున్నట్టుగా మనమూ మన పురా సామాజిక సంప్రదాయాల ప్రభావంతో మానవతా విరుద్ధమైన పోకడలు పోతున్నాం. జర్మన్ల అపరాధ భావనవలే ఈ వాస్తవాన్ని గుర్తించే నైతిక జాగృతి మనకు ఇప్పుడు అవసరం. తప్పు చేస్తున్నామనే భావనే కాకుండా ఆ దుశ్చర్యకు బాధితులవుతున్న వారి కలతలు, కష్టాలు తీర్చే కొత్త ప్రగతిశీల ఆలోచన కూడా ఆ నైతిక జాగృతిలో భాగంగా ఉండాలి. తద్వారా మాత్రమే మనం గతించని గతం నుంచి బయటపడి, ఒక కొత్త ప్రజాస్వామిక ప్రపంచానికి వేగుచుక్క కాగలుగుతాము.


Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 12:17 AM