శ్రేయో మేధ
ABN, Publish Date - Feb 11 , 2025 | 12:20 AM
బ్రహ్మంగారి కాలజ్ఞానం కృత్రిమ మేధను ఊహించిందో లేదో గానీ ఈ అధునాతన సాంకేతికత మనలను కాలం అంచులకు తీసుకువెళ్లుతోంది. నాగరికత ప్రారంభమయింది మొదలు మానవాళి...
బ్రహ్మంగారి కాలజ్ఞానం కృత్రిమ మేధను ఊహించిందో లేదో గానీ ఈ అధునాతన సాంకేతికత మనలను కాలం అంచులకు తీసుకువెళ్లుతోంది. నాగరికత ప్రారంభమయింది మొదలు మానవాళి సాంకేతికతల మార్పులు చవిచూస్తూనే ఉన్నది. మానవ సమాజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సాంకేతిక పరిజ్ఞానాలు ఎన్నో ఉన్నాయి. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్– ఎఐ) విప్లవాత్మక సాంకేతికతలు అన్నిటిలోకి విప్లవాత్మకమైనది. మానవుని సమస్త అనుభవాలను మార్చివేస్తోంది. ‘ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను’ అని చెప్పటం ద్వారా మానవ అస్తిత్వ ప్రధాన లక్షణం ఆలోచనాశీలత అనే భావనను ఫ్రెంచ్ తాత్త్వికుడు డెకార్ట్ సుస్థిరం చేశాడు. మానవ సామర్థ్యాలు అన్నిటినీ సంతరించుకుంటున్న ఎఐ అంతిమంగా ఆలోచనాశీలి కూడా కాగలిగితే మానవ అస్తిత్వ ప్రత్యేకత ఏమిటి అనేది అనేక మందిని కలవరపెడుతోంది. ‘జీవితంలో భయపడవలసింది ఏదీ లేదు, కాకపోతే అర్థం చేసుకోవలసి ఉంటుంది’ అన్న మ్యారీ క్యూరీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఆ వ్యాకులతను జయించవచ్చు.
కృత్రిమ మేధ ప్రస్తుత ప్రస్థానం మూడు ప్రధాన సమస్యలకు దారితీస్తోంది: ఎఐపై నియంత్రణ ఉన్నవారు, దానిని ఉపయోగించుకుంటున్న వారి మధ్య పెరుగుతున్న అసమానతలు; ఎఐ అభివృద్ధి కొద్ది మంది వ్యక్తుల, సంస్థల పరిధిలో కేంద్రీకృతమై, ఆ పురోగతిలో ఇతరులు భాగస్వాములు అయ్యేందుకు సమ అవకాశాలు కొరవడడం; ఈ వినూత్న సాంకేతికతను ప్రజాహితానికి ఉపయోగించే ప్రయత్నాలు సంఘటితంగా జరగకపోవడం వల్ల మానవాళిని పీడిస్తున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో చోటుచేసుకుంటున్న జాప్యం, నిర్లక్ష్యం.
ఈ సమస్యలను అధిగమించేందుకే పారిస్‌లో ఈ సోమ, మంగళవారాలలో ‘ఎఐ యాక్షన్ సమ్మిట్’ను ఫ్రాన్స్ నిర్వహిస్తోంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చొరవతో నిర్వహిస్తున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహ అధ్యక్షుడుగా ఉండడం విశేషం. స్వతంత్ర, భద్రమైన, విశ్వసనీయమైన ఎఐని సమస్త దేశాల వారికి అందుబాటులో ఉంచడం, పర్యావరణ హితకరమైన కృత్రిమ మేధను అభివృద్ధిపరచడం. ఈ కొత్త సాంకేతికత వ్యవహారాల అంతర్జాతీయ నిర్వహణ ప్రభావశీలంగా, సమ్మిళితంగా ఉండేలా చేయడం అనేవి పారిస్ ఎఐ యాక్షన్ సదస్సు లక్ష్యాలుగా ఉన్నాయి.
కృత్రిమ మేధపై ఈ తరహా అంతర్జాతీయ సదస్సు ఇదే మొదటిది కాదు. 2023 నవంబర్‌లో బ్రిటన్‌లోని బ్లెట్చెలే పార్క్‌లో మొదటి సదస్సు జరిగింది. ఎఐ సాంకేతికతలను మానవ కేంద్రితంగా అభివృద్ధి పరచాలని ఆ సదస్సు పిలుపునిచ్చింది. నేరపూరిత కార్యకలాపాలకు ఈ సాంకేతికత ఉపయోగపడకుండా నిరోధించడంపై జాగ్రత్త వహించాలని ఆ సదస్సు నొక్కి చెప్పింది. ఈ మేరకు బ్రిటన్ ఎఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్ నొకదాన్ని నెలకొల్పింది. రెండో శిఖరాగ్ర సదస్సు మే 2024లో సియోల్‌లో జరిగింది. ఈ సదస్సు స్ఫూర్తితో ఎఐ సాంకేతికతల రక్షణపై ప్రపంచ దేశాలు మరింతగా శ్రద్ధాసక్తులు చూపడం ప్రారంభమయింది. ఇప్పుడు పారిస్‌లో జరుగుతున్న సదస్సు కేవలం ఆ సాంకేతికత రక్షణ విషయాలకే పరిమితమవకుండా దాని సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే అజెండాతో జరుగుతుంది. ఎఐ అభివృద్ధి సమష్టి కృషితో జరగాలని ఈ అజెండా నిర్దేశిస్తోంది.
పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు, ఎఐ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న టెక్ దిగ్గజ కంపెనీలకు సవాల్‌గా పరిణమిస్తూ డీప్ సీక్ అనే చైనీస్ ఎఐ మోడల్ ప్రపంచ ప్రజల ముందుకు వచ్చిన నేపథ్యంలో పారిస్ ఎఐ యాక్షన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ నవీన సాంకేతికత రంగంలో చైనా సాధించిన అద్భుత పురోగతి పాశ్చాత్య దేశాలను ముఖ్యంగా అమెరికాను అమితంగా కలవరపరుస్తోంది. ఏఐలో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత దూరమైనా వెళతారు, ఎంతకైనా సాహసిస్తారు. అపార భాగ్యరాశులను పోగేసుకున్న అమెరికన్ టెక్ కంపెనీలు ఎఐ రంగంలో తమ గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నాయి. గుత్తాధిపత్యం ఉన్నచోట సమ అవకాశాలు ఎలా లభిస్తాయి? పారిస్ సదస్సు నిర్వాహకుల లక్ష్యం ఎలా ఉన్నా అమెరికా, ఆ దేశ టెక్ దిగ్గజాల ఆధిపత్యాన్ని అదుపుచేయడం సాధ్యమవుతుందా? అమెజాన్, గూగిల్, మైక్రోసాప్ట్ మొదలైన కంపెనీలతో పాటు ఎఐ చిప్‌ల డిజైన్, ఉత్పత్తిపై నియంత్రణ ఉన్న ఓపెన్ ఎఐ, ఆంత్రోపిక్, డీప్‌మైండ్, మిస్ట్రాల్, ఎన్‌విడియా మొదలైన ఎఐ ల్యాబ్స్ గుత్తాధిపత్యాన్ని తగ్గించడంలో పారిస్ సదస్సు కించిత్ విజయం సాధించినా ఎఐ యాక్షన్ సమ్మిట్ అన్న నామకరణం సార్థకమవుతుంది. విప్లవాత్మక సాంకేతికతల వలే మౌలిక రాజకీయ పరిణామాలు, సామాజిక పరివర్తనలు మానవాళికి శుభకరాలు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ‘మనుష్యుడే నా సంగీతం/మానవుడే నా సందేశం’ అన్నది ఏ సాంకేతిక విప్లవానికైనా ఆదర్శంగా, లక్ష్యంగా ఉండాలి. కృత్రిమ మేధ విషయంలో అటువంటి స్ఫూర్తి వెల్లివిరిస్తే ఆ అపూర్వ సాంకేతికత సమస్త మానవులకూ తప్పక శ్రేయో మేధ అవుతుంది.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?
Also Read: అప్పు చేయడం తప్పు కాదు కానీ..
For Telangana News And Telugu News
Updated Date - Feb 11 , 2025 | 12:20 AM