శాంతి...నిజంగానే?!
ABN, Publish Date - Jan 22 , 2025 | 01:57 AM
‘గాజా కాల్పుల విరమణ ఒప్పందం సృష్టికర్త డోనాల్డ్ ట్రంప్ కదా..?’ అంటూ వెనకనుంచి వినిపించిన ఓ వ్యాఖ్యలాంటి ప్రశ్నను జో బైడెన్ చిన్నచిరునవ్వుతో జోక్ అని తీసిపారేశారు. హమాస్–ఇజ్రాయెల్ చర్చల్లో అప్పటికి....
‘గాజా కాల్పుల విరమణ ఒప్పందం సృష్టికర్త డోనాల్డ్ ట్రంప్ కదా..?’ అంటూ వెనకనుంచి వినిపించిన ఓ వ్యాఖ్యలాంటి ప్రశ్నను జో బైడెన్ చిన్నచిరునవ్వుతో జోక్ అని తీసిపారేశారు. హమాస్–ఇజ్రాయెల్ చర్చల్లో అప్పటికి కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూత కూడా ఉన్న విషయం తెలిసిందే. పదిహేను నెలల భీకరమైన విధ్వంసం తరువాత, సదరు కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారంనుంచి అమల్లోకి రావడమే కాదు, ఉభయపక్షాలనుంచి బందీల అప్పగింత కూడా ఎటువంటి అడ్డంకులూ లేకుండా జరిగింది. కేవలం ట్రంప్ హెచ్చరికతోనే, బైడెన్ మాదిరిగా ఆయనను సులువుగా పెరట్లోకట్టేసుకోవడం సాధ్యం కాదని తెలిసినందునే నెతన్యాహూ దిగివచ్చాడనీ, ఒప్పందం అమల్లోకి వచ్చిందనీ అంతా అనుకున్నారు. కానీ, అమెరికా అధ్యక్షుడైన వెంటనే తనకు ఈ ఒప్పందం ఎక్కువకాలం నిలుస్తుదన్న నమ్మకంలేదని ట్రంప్ తీసిపారేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలోని దశలన్నీ దాటేట్టుగా ఆయన చూస్తాడని, గట్టిగా నిలబడతాడని అనుకుంటున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేవే.
ఆదివారం ఉదయం ఎనిమిదిన్నరనుంచి కాల్పుల విరమణ అమల్లోకి రావాల్సి ఉండగా, తొలివిడతగా విడుదలచేయాల్సిన ముగ్గురు బందీల జాబితాను హమాస్ ఇవ్వలేదన్న సాకుతో మరింత ఉధృతంగా దాడులను కొనసాగించింది ఇజ్రాయెల్. ముగ్గురు యువతులను రెడ్‌క్రాస్‌కు అప్పగించేలోగా ఓ పాతికమంది ప్రాణాలు తీసింది. కాల్చేస్తా, పేల్చేస్తా అంటూ నెతన్యాహూ ఓ పక్క అంటున్నా, కాల్పులు నిలిచిపోవడం, బందీల విడుదల జరగడం ఓ అతిపెద్ద ఉపశమనం. ఇజ్రాయెల్ బాంబుదాడులకు నేలమట్టమైపోయిన అల్‌సరయా స్వ్కేర్‌లో చోటుచేసుకున్న ఈ అప్పగింత కార్యక్రమాన్ని, హమాస్ అందించిన గిఫ్ట్‌బ్యాగులతో రెడ్‌క్రాస్ వాహనాల్లో కూచున్న ఆ యువతులను ఇజ్రాయెల్ ఆసుపత్రులకు తరలించడాన్ని ప్రపంచమంతా ఆనందంగా గమనించింది. ఇందుకు ప్రతిగా, 90మంది పాలస్తీనా మహిళలూ పిల్లలను ఇజ్రాయెల్ వదిలిపెట్టడమూ జరిగింది. శనివారం మరో నలుగురు బందీలను అప్పగించబోతున్నట్టు హమాస్ మంగళవారం చేసిన ప్రకటన ఆ సంస్థ ఈ ఒప్పందానికి కట్టుబడివున్నదనడానికి నిదర్శనం. ఆహారసరఫరాలతో గాజాలోకి వందలాది ట్రక్కులు ప్రవేశించడం ఓ అరుదైన దృశ్యం. గాజావాసులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, కూలిన ఇళ్ళను చూసి దుఃఖిస్తున్నారు. 470 రోజులకు పైగా భయంకరమైన విధ్వంసాన్ని చవిచూసిన వారికి నిరవధికంగా ఆహారం, మందులు, ఇతర సరఫరాలు అందాల్సి ఉంది.
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ప్రతీ ఇజ్రాయెలీ బందీకీ ప్రతిగా పదులూ వందలసంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టవలసి రావడం నెతన్యాహూకు ఇబ్బందికరమైన స్థితే. ఒప్పందంపై ఇజ్రాయెలీలు ఏమనుకుంటున్నారో కచ్చితంగా తెలియదు కానీ, నెతన్యాహూ కూటమి ప్రభుత్వంలో మాత్రం లుకలుకలు ఆరంభమైనాయి. కొందరు మంత్రివర్గ సహచరులను, కొంత మద్దతును ఆయన కోల్పోవలసి రావచ్చు. ఇద్దరు ఉన్నతస్థాయి సైనికాధికారులు హఠాత్తుగా రాజీనామా చేయడానికి ఈ ఒప్పందమే కారణమని అంటారు. ఈ ఆగ్రహాన్ని ఉపశమింపచేయడం కోసం కాబోలు, ఒకపక్క హమాస్‌తో యుద్ధం ఆపి, మరోపక్క వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌లో ఇజ్రాయెల్ సైన్యం తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.
తొలిదశ ఆరువారాలూ సవ్యంగా గడిస్తే కాల్పుల విరమణ ఒప్పందం కచ్చితంగా నిలుస్తుంది. హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారిలో ముప్పైమూడుమంది విడుదలై, 1900మంది పాలస్తీనియన్ ఖైదీలు బయటకువస్తే ఇరుపక్షాలమధ్య నమ్మకం పెరుగుతుంది. మధ్య గాజానుంచి, ఈజిప్ట్‌సరిహద్దులనుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించుకున్నపక్షంలో వాతావరణం మరింత మెరుగుపడుతుంది. గత పదిహేను నెలలకాలంలో హమాస్ బాగా దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుత సంధికాలం అది తిరిగిశక్తిని పుంజుకొనేందుకు ఉపకరిస్తుందన్న అనుమానాలు బాగా ఉన్నాయి. కాల్పుల విరమణ అమల్లోకి రాగానే ఆయుధాలు చేబూనిన హమాస్ మిలిటెంట్లు వీరవిహారం చేస్తున్న దృశ్యాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అపనమ్మకాలను, ఉద్రిక్తతలను పెంచే ఇటువంటి సందర్భాలు రాబోయే రోజుల్లో మరిన్ని చూడవలసి రావచ్చు. బైడెన్‌ను దాటి ఇజ్రాయెల్‌కు సాయపడటానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారనడానికి అధికారంలోకి రాగానే ఇజ్రాయెల్‌కు ఆయన ఇచ్చిన బాంబులూ వరాలే నిదర్శనం. ఒప్పందానికి ముఖ్యకారకుడని అనుకుంటున్న ఆయనే దానిని ఆఖరువరకూ నిలిచేట్టు చూడాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. శాంతిని పెంచడం కష్టం కానీ, తుంచడం సులువే.
Updated Date - Jan 22 , 2025 | 01:57 AM