Land Acquisition : చిన్న లగచర్ల మీద పెద్ద పిడుగు
ABN, Publish Date - Jan 18 , 2025 | 04:22 AM
మన దేశంలో అభివృద్ధి పేరిట భారీ పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసిన సందర్భాలలో భూమి ఎక్కువగా ఉన్నవాళ్లకే అధిక ప్రయోజనం చేకూరుతున్నది. గత పదేళ్ళుగా అన్ని రకాల భూ సేకరణలు 2013
మన దేశంలో అభివృద్ధి పేరిట భారీ పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసిన సందర్భాలలో భూమి ఎక్కువగా ఉన్నవాళ్లకే అధిక ప్రయోజనం చేకూరుతున్నది. గత పదేళ్ళుగా అన్ని రకాల భూ సేకరణలు 2013 భూసేకరణ చట్టం ఆధారంగానే జరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం 632 ఎకరాల 26 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో సగం వరకు ప్రభుత్వ భూములు. కొన్ని దశాబ్దాల క్రితం లావునీ/ అసైన్మెంట్ పట్టాలు పొందిన గిరిజన లంబాడీ తెగవారు సాగు చేస్తున్నారు. మిగతావి ఎస్సీలు, బడుగు, బలహీన కులాలకు చెందినవి. గమనించవలసిన విషయం ఏమిటంటే– ఆధిపత్య కులాలుగా ఉన్న రెడ్డి సామాజికవర్గాల భూములు ఇందులో కేవలం ఒక ఎకరా పందొమ్మిది గుంటలు మాత్రమే!
అందుకనే సామాజికంగా బలహీనులైన వారికి హక్కులు కల్పించే చట్టాలు వాటంతట అవి అమలు కావు. వాటి సాధనకు పోరాటాలు చేయాలి. 2013 చట్టంలో సామాజిక అంచనా అని ఒక వెసులుబాటు ఉన్నది. ౭5 శాతం భూ యజమానులు ‘‘మా భూములు ఇవ్వం’’ అని అసమ్మతి తెలియజేస్తే అట్టి భూసేకరణను నిలుపుదల చేయాలి. ఇలాంటి హక్కులు ఉన్నాయని ప్రజలకు తెలియదు. వాటిని తెలియజేసే సంస్కృతి మన పాలనా యంత్రాంగానికి లేదు.
2011 జనాభా లెక్కల ప్రకారం లగచర్ల గ్రామంలో 2092 మంది జనాభా ఉన్నది. ఇప్పుడు పెరిగి ఉంటుంది. గ్రామంలో మొత్తం 372 ఇళ్ళు ఉన్నాయి. ఎస్టీలు (లంబాడీ) తెగలు 33శాతం, ఎస్సీలు 9.8శాతం ఉండగా, మిగతా అంతా బడుగు బలహీన వర్గాల కుటుంబాలు. ఇళ్ళు అన్నీ తాండూరు, షాబాద్ బండలు పైకప్పులుగా ఉన్నాయి. ఈ మధ్యనే భూముల ధరలు పెరిగి కొన్ని సిమెంటు స్లాబులు వచ్చాయి. 39 శాతం అక్షరాస్యత ఉంది. అందరివీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈ ప్రాంత ప్రజల జీవితాలు పూర్తిగా ప్రకృతి తోనే ముడిపడి ఉన్నాయి. ఇక్కడ ఒక ఫార్మా కంపెనీ అనేది ఊహకందని ఆలోచన. అభివృద్ధి పేరుతో వాళ్ల భూములు పోతాయన్న బాధతో గ్రామస్థులంతా మా చిన్న లగచర్ల మీద పెద్ద పిడుగు పడింది అన్న విషయం తెలుసుకొని గత రెండు నెలల నుంచి నిరసనలు చేస్తున్నారు. ఏ కమ్యూనిస్టులు, ఇతర రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, హక్కుల సంఘాలు వీరిని పలకరించ లేదు.
జిల్లా కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా లగచర్లకు చేరగానే నిరసనలు మొదలయ్యాయి. అక్కడి ప్రజలకు వచ్చిన వ్యక్తి కలెక్టరా, అంతకంటే చిన్న అధికారా, పెద్ద అధికారా అనే విషయం తెలియదు. వాళ్ళ భూములు పోతున్నాయన్న బాధలో ఎవ్వరు వచ్చినా అడ్డగించాలని చూస్తారు. ప్రజలను రెచ్చగొట్టడంలో ప్రతిపక్షాలు విజయం సాధించి ఉండవచ్చు. కానీ, కలెక్టర్ మీద దాడి అంటూ అక్కడి యువతపై, రైతు కూలీలపై, రైతులపై అనేక క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. అరెస్టు అయిన వారిని సంగారెడ్డి జైలుకు తీసుకువెళ్ళి అక్కడ చాలా రోజులు నిర్బంధంలో ఉంచారు. నిరసన తెలిపే హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించిందనేది మరవరాదు.
‘‘రెవిన్యూ రికార్డులలో ప్రభుత్వ భూములుగా ఉన్న అసైన్మెంట్ పట్టాలు. ప్రభుత్వం తన భూములను తాను తీసుకుంటుంది. అయినా డి–ఫారం పట్టా పొంది సాగు చేసుకుంటున్న వారికి ఎకరాకు రూ.10 లక్షలు, పట్టా భూములకు రూ.15 లక్షలు ఇస్తారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తుంది’’ అంటూ మరో పక్క దళారీలు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ గ్రామస్థుల చెవులు కొరుకుతూనే ఉన్నారు. ఒక పక్క పిల్లల అరెస్టులు, మరోవైపు భూములు పోవడం, ఎలా బతకాలనే బాధ, భయాలతో గ్రామస్థులంతా ఊరు వదిలి బయటకు వెళ్ళిపోతున్నారు. లగచర్ల, హకీంపేట, పోలేపల్లి... ఈ ఊళ్ళలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల సంఖ్యకూ, ప్రభుత్వం ఇవ్వజూపిన ఉద్యోగ ఉపాధి అవకాశాల సంఖ్యకూ ఎక్కడా పోలికే ఉండదు. అంతేగాక అక్కడున్న పచ్చని వాతావరణం అంతా కలుషితం అవుతుంది. అసలే అరకొర పంట పొలాలు, అవి కూడా పనికిరాకుండా పోతాయి. పరిశ్రమల స్థాపన పేరిట హైదరాబాద్ చుట్టూ పటాన్ చెరువు, జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, ఐడీఏ నాచారం, ఐడీఏ కాటేదాన్ ఈ ప్రాంతాలన్నీ వాతావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాలను, వాయువును, నీటిని కలుషితం చేశాయి అన్నది మనం గుర్తు పెట్టుకోవాలి.
కొడంగల్ అసెంబ్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (కాడ) పేరిట అభివృద్ధిలో భాగంగా ఈభూములన్నీ కలుషితం అవుతాయి. దానికి తోడు ఎంతోమంది రైతులు భూ నిర్వాసితులుగా రోడ్డున పడతారు. ప్రభుత్వాలు, మీడియా వీరిని మరిచిపోతాయి. ఇది పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఇక్కడి ప్రజలు సరైన ఉపాధి పనులు లేక వలసలు వెళుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే– ఏ స్థాయిలో ఉపాధి, ఉద్యోగాలు దొరకుతాయో చూడాలి. నా నియోజకవర్గ ప్రజలకు నేను అన్యాయం చేస్తానా అంటూనే అభివృద్ధి జరగాలి అంటే భూములు కావాలి అంటున్నారు ముఖ్యమంత్రి. అలాగే ముఖ్యమంత్రి తన స్వంత నియోజకవర్గ ప్రజల మీద అభిమానంతో లగచర్ల ప్రజలపై నమోదైన క్రిమినల్ కేసులు వెనక్కి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికీ కొనసాగుతున్న వేటను ఆపమని అడుగుతున్నారు. భూసేకరణతో విస్తాపనకు గురి కాబోతున్న లగచర్ల గ్రామ ప్రజల బతుకు తెరువు కోసం వారికి ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నారు.
ఇది పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఇక్కడి ప్రజలు సరైన ఉపాధి పనులు లేక వలసలు వెళుతుంటారు. ముఖ్యమంత్రి తన స్వంత నియోజకవర్గ ప్రజల మీద అభిమానంతో లగచర్లలో నమోదైన క్రిమినల్ కేసులు వెనక్కి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లగచర్ల గ్రామ ప్రజల బతుకు తెరువు కోసం వారికి ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నారు.
వి. బాలరాజు
తహశీల్దారు రిటైర్డు
Updated Date - Jan 18 , 2025 | 04:22 AM