ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అలవాటైన నిర్లక్ష్యం!

ABN, Publish Date - Feb 18 , 2025 | 12:23 AM

మహాకుంభమేళాతో ముడివడిన మరో దుర్ఘటన ఇది. ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణం కట్టిన సామాన్యులను భద్రంగా గమ్యానికి చేర్చని మన రైల్వేవ్యవస్థ బాధ్యతారాహిత్యానికి...

మహాకుంభమేళాతో ముడివడిన మరో దుర్ఘటన ఇది. ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణం కట్టిన సామాన్యులను భద్రంగా గమ్యానికి చేర్చని మన రైల్వేవ్యవస్థ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం ఇది. తొక్కిసలాటలను ఊహిస్తామా, కలగంటామా అన్న అడ్డగోలువాదనలకు ఇక్కడ తావులేదు. లక్షలాదిమంది రైళ్ళలో ప్రయాగ్‌రాజ్‌కు పయనమవుతున్నందున ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో అన్ని ఏర్పాట్లు చేయాలి, అడుగడుగునా వారిని కనిపెట్టుకోవాలి. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అత్యంత విషాదకరమైంది. ఆప్తులను కోల్పోయిన లోటు ఎన్నటికీ తీర్చలేనిది. తండ్రి కళ్ళెదుట కుమార్తె శిరస్సు ఛిద్రమైన ఘోరం సహా తొక్కిసలాట తీవ్రత ఏ స్థాయిలో, ఎంత దారుణంగా ఉన్నదో తెలియచెబుతూ పలు కథనాలు వెలుగుచూశాయి. ఎముకలు విరిగి, అవయవాలు దెబ్బతినిపోయిన క్షతగాత్రుల వేదన మరో రకమైనది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌ సమీప భవిష్యత్తులో ఎంత అద్భుతంగా ఉండబోతున్నదో చూడండి అంటూ ఐదేళ్ళక్రితం అప్పటి రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ విడుదల చేసిన కొన్ని చిత్రాలు ఇప్పుడు తిరిగి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. వేలాదికోట్లు ఖర్చుచేసి రైల్వేస్టేషన్లకు మెరుగులుదిద్దుతున్న మాటలు ఒకపక్క వినబడుతూండగానే, మరోపక్క ఇటువంటి దారుణాలు సంభవించడం ఆశ్చర్యం.


జరిగిన ఘోరానికి పద్ధతీపాడూ లేని ఆ సాధారణజనమే కారణం తప్ప తమ నిర్లక్ష్యం కాదని పాలకులు, అధికారులు పరోక్షంగా వాదిస్తున్నారు. ఆఖరునిముషంలో మరో ప్లాట్‌ఫామ్‌ మీదకు రైలును తెచ్చి, మీరు ఎక్కాల్సిన రైలు మీరు వేచివున్నదగ్గరకు కాక, వేరే చోటకు వస్తున్నదని ప్రకటించి రైల్వే అధికారులే తొక్కిసలాటకు కారకులైన సందర్భాలు గతంలో లేకపోలేదు. ఆ తరువాత అటువంటి తప్పుటడుగులు వేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ, ఇప్పుడు జరిగింది కూడా దాదాపు అటువంటిదే. అనేక రైళ్ళు ప్రయాగ్‌రాజ్‌కే ప్రయాణం కడుతూ, వేలాదిమంది యాత్రికులు వాటికోసం ఎదురుచూస్తున్నప్పుడు ‘ప్రయాగ్‌రాజ్‌’ అన్న ఒక్కమాట సదరు సామాన్యయాత్రికుల్లో గందరగోళాన్ని సృష్టించడం సర్వసాధారణం. మామూలురోజుల్లోనే ఎక్కాల్సిన రైలు ఎక్కి కూర్చునేంతవరకూ ప్రయాణికుడి మనసులో ఆందోళన నెలకొనే ఉంటుంది. ఈ కుంభమేళాకాలంలో పేరు చివర్లో చిన్నచిన్న మార్పులతో అన్ని రైళ్ళకూ గమ్యస్థానం పేరు తగిలించి, ఒకే సమయంలో వేర్వేరు ప్లాట్‌ఫామ్‌ల మీదకు పలు రైళ్ళను తెస్తే యాత్రికులు గాభరాపడటం సహజం. పైగా, చాలా రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్న స్థితిలో ఎదురుచూపుల్లోనే వారి వివేకం, సహనం చచ్చిపోతాయి. స్టేషన్‌లో ఎస్కలేటర్లు పనిచేయడం లేదని, యాత్రికులు దగ్గరతోవలో పోయేందుకు ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారని పలు విశ్లేషణలు వింటున్నాం. వాటిని అటుంచితే, చివరి రెండుగంటల్లో యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగిన స్థితిలో వారిని నియంత్రించడానికి నిర్దిష్టమైన ప్రయత్నాలు జరిగిన దాఖలాలు కూడా లేవు. పావుగంటలో ఇన్ని ప్రాణాలు పోయిన తరువాత, అతి వేగంగా వరుసరైళ్ళలో యాత్రికులను తరలించగలిగిన రైల్వేశాఖ ముందుచూపుతో ఎందుకు వ్యవహరించలేకపోయిందో తెలియదు. ఈ ఘటన తరువాత అమలులోకి తెచ్చిన పలురకాల రక్షణలు, జాగ్రత్తలు ముందే ఎందుకు లేవన్నది ప్రశ్న.


ఈ ఘటనకు మూడురోజుల ముందు రైల్వేభవన్‌లో మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ కూర్చొని అన్ని ప్రధాన స్టేషన్లలో రద్దీని సమీక్షిస్తున్న చిత్రాలను మీడియా ప్రసారం చేసింది. పడుతున్న కష్టాన్ని ప్రజలకు చెప్పుకోవడంలో తప్పులేదు కానీ, మీడియా నిర్వహణ కంటే జనసమ్మర్దాన్ని నిర్వహించడం మరీ ముఖ్యం, ఎంతో కష్టం అని ఈ ఘటన గుర్తుచేస్తోంది. రైల్వేమంత్రి రాజీనామాకు విపక్షాలు డిమాండ్‌ చేయడం సహజం. మూడువందలమంది ప్రాణాలు తీసిన బాలాసోర్‌ రైలు ప్రమాదం తరువాత కూడా రైల్వేమంత్రి రాజీనామా చేయలేదు. ఆయనకు అటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకే కాబోలు ఆ ఘోరం జరగగానే చాలా కుట్రసిద్ధాంతాలు తెరమీదకు వచ్చాయి. రైలుదుర్ఘటనలు జరిగినప్పుడు వీలైతే విదేశీశక్తులను, లేకుంటే దేశీకుట్రదారులను తప్పుబట్టి అసలు కారణాలను బయటకు పొక్కనివ్వకపోవడం అనాదిగా జరుగుతున్నదే. ఎన్‌ఐఏ, సీబీఐ వంటి సంస్థలను రంగంలోకి దించిన ఘోర రైలుప్రమాదాల్లో సైతం నిజం ఇంకా వెలుగుచూడలేదు. ఢిల్లీ తొక్కిసలాట ఘటనను మొదట్లోనే కప్పిపుచ్చడానికి ప్రయత్నించినవారు ఆ నామమాత్రపు దర్యాప్తును సరైనదిశగా సాగనిస్తారా?


Also Read:

పార్లమెంటులో ఎంపీ అబద్ధం.. రూ. 9 లక్షల ఫైన్

సొంత ఇల్లు కట్టుకోవాలనుకొంటున్నారా.. మీకు బంపర్ ఆఫర్

కేక్‌లో క్రాకర్.. వెలిగించిన తర్వాత..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 18 , 2025 | 12:23 AM