ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Severe Tremors : ప్రకృతి

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:44 AM

హిమాలయ దేశాలు టిబెట్‌, నేపాల్‌ను ఇటీవల కుదిపేసిన భారీ భూకంపం పెద్దసంఖ్యలో ప్రజల ప్రాణాలను హరించింది, తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగల్చింది

హిమాలయ దేశాలు టిబెట్‌, నేపాల్‌ను ఇటీవల కుదిపేసిన భారీ భూకంపం పెద్దసంఖ్యలో ప్రజల ప్రాణాలను హరించింది, తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగల్చింది. టిబెట్‌లో మరణాలసంఖ్య విషయంలో చైనా మీడియా చెబుతున్న నూటయాభైలోపు లెక్కలనే మనం నమ్మాలి కానీ, తీవ్రతను బట్టి చూస్తే ఆ సంఖ్య అనంతరకాలంలో కచ్చితంగా మరింత పెరిగే ఉంటుంది. రిక్టర్‌ స్కేల్‌మీద 7.1 తీవ్రతతో పదికిలోమీటర్ల లోతున పుట్టిన ఈ భూకంపం నేపాల్‌ను వొణికించింది, బిహార్‌ను భయపెట్టింది, చివరకు దేశరాజధాని ఢిల్లీ సైతం ఆ ప్రకంపనలను భరించింది. భూకంప కేంద్రంనుంచి వందలాది కిలోమీటర్ల వరకూ ఆ ప్రభావం కనిపించింది. వెంటవెంటనే సంభవించిన మరో రెండు అతిపెద్ద కుదుపులు సైతం జనాన్ని భయపెట్టాయి. భారతదేశానికి సన్నిహితంగా భూకంప కేంద్రం ఉండివుంటే, ఆర్థిక, ప్రాణనష్టాలు అధికంగా ఉండేవనడానికి సందేహం అక్కరలేదు. ప్రపంచంలో అతిపెద్ద జలవిద్యుత్‌ కేంద్రాన్ని బ్రహ్మపుత్రమీద నిర్మించబోతున్నట్టు ప్రకటించిన వెంటనే టిబెట్‌లో సంభవించిన ఈ భూకంపం చైనా కళ్ళు తెరిపించాలన్నది పర్యావరణ వేత్తల కోరిక.

త్రీగోర్జెస్‌ డ్యామ్‌కు మూడురెట్ల భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు బ్రహ్మపుత్రమీద ప్రకటించి, దానికి 137 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేయబోతున్నట్టు చైనా ఇటీవల చేసిన ప్రకటన భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించింది. దీనిద్వారా అరవై గిగావాట్ల విద్యుత్‌ చైనాకు చేరవచ్చు, అందులో టిబెట్‌ వాటాలు కోటాలు ఉండవచ్చు కానీ, మనకు పట్టుమని పాతికకిటోమీటర్ల దూరంలో ఈ డ్యామ్‌ ఉండటం కచ్చితంగా భయపెట్టే అంశమే. ఈ ప్రాజెక్టు నిర్మించబోతున్న హిమాలయప్రాంతం భూకంపాలకు పుట్టినిల్లని చైనాకు తెలియకపోదు. ఇప్పటికే అక్కడ తాను నిర్మించిన జలవిద్యుత్‌ ప్రాజెక్టుల్లో కనీసం మూడోవంతు భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ఆరేళ్ళక్రితం ఆ దేశం ఆదేశించిన అధ్యయనమే స్పష్టంచేసింది. కానీ, హిమాలయాల్లో ఉన్న అపార జలశక్తిని ఒడిసిపట్టి విద్యుత్‌ను సృష్టించాలన్న తపనతో భారత్‌, చైనాలు పోటీపడి జలవిద్యుత్‌ ప్రాజెక్టులను కట్టుకుంటూ పోతున్నాయి.


చిన్నచితకా కట్టడాలను అటుంచితే, భూకంపాలకు నిలయమైన చోట ఒక అతిభారీస్థాయి ప్రాజెక్టు కట్టాలని చైనా ఎలా అనుకుంటోందో అర్థం కాదు. 2015లో నేపాల్‌లో 9వేలమంది ప్రాణాలు హరించిన భూకంపం, దాదాపు ఐదోవంతు జలవిద్యుత్‌ ప్రాజెక్టులను ధ్వంసం చేసి, సుదీర్ఘకాలం నిరుపయోగంగా మార్చిన విషయం తెలిసిందే. ఇటువంటి గతానుభవాలు అనేకం ఉన్నప్పటికీ ఒక ప్రమాదకరమైన ప్రాంతంలో ఈ అతి భారీ నిర్మాణాన్ని ప్రకటించి, తన కొత్త విద్యుత్‌ ప్రాజెక్టుతో ఎవరికీ ఏ భయమూ అక్కరలేదని చైనా అభయం ఇవ్వడం ఆశ్చర్యకరం. ప్రాజెక్టును కూల్చేసే స్థాయి భూకంపం వస్తేగిస్తే నష్టపోయేది భారత్‌, బంగ్లాదేశ్‌లే కదా అని అది అనుకుంటున్నదేమో. ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లకు వయసు మీద పడుతున్నందున చైనా కొత్తవాటికోసం వెంపర్లాడుతున్నట్టుంది. కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిన లక్ష్యం కూడా దానిని ఈ భారీ ప్రాజెక్టుకు వెంట తరుముతూండవచ్చు. ఇంధన అవసరాలు కాక, ఇతరత్రా ఉద్దేశాలేమీ లేకుంటే ఈ భారీ డ్యామ్‌ స్థానంలో పలు మధ్యతరహా హైడ్రోప్రాజెక్టులతో చైనా తన విద్యుత్‌ అవసరాలను సులువుగా తీర్చుకోగలదు. విద్యుత్‌ సృష్టికే కాక, ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా ఈ డ్యామ్‌ ఉపకరిస్తుందేమోనన్న అనుమానం బ్రహ్మపుత్ర పరీవాహక దిగువదేశాలకు ఉండటంలో తప్పేమీ లేదు.

టిబెట్‌లో 1950లో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ఈ ప్రాంతం ఎంత సున్నితమైనదో, ప్రమాదకరమైనదో తెలియచెబుతుంది. ఆధునిక పరిజ్ఞానం ఎంతగా ఉపయోగించినా, ఈ ప్రాంతంలో ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని నివారించడం అంతసులభం కాదని ఇప్పుడు టిబెట్‌లో సంభవించిన భారీ భూకంపం హెచ్చరిస్తోంది. భూకంప కేంద్రం, బ్రహ్మపుత్ర, ఈ ప్రాజెక్టు స్థలం సన్నిహితంగా ఉన్నాయంటూ పలుమ్యాప్‌లు తెలియచెబుతున్నాయి. ప్రాజెక్టుమీద భారతదేశం తన అభ్యంతరాన్ని వ్యక్తంచేసినప్పుడు, దాని భద్రత గురించి, ప్రమాణాలగురించి చైనా చాలా కబుర్లుచెప్పింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ నష్టంవాటిల్లనివ్వబోనని హామీ ఇచ్చింది. కానీ, అది ఎంత అద్భుతంగా, బలంగా ఈ ప్రాజెక్టు కట్టినప్పటికీ, కాళ్ళకింద భూమి సులువుగా కదిలిపోవచ్చునని ఈ భూకంపం హెచ్చరిస్తోంది.

Updated Date - Jan 11 , 2025 | 04:45 AM