ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రంప్‌ వీరంగం

ABN, Publish Date - Feb 05 , 2025 | 06:24 AM

తెలిసిన దయ్యమే కనుక, ప్రమాదం కూడా ఊహించినట్టుగానే ఉన్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోరాకడతో ప్రపంచం ఇప్పటికే ఉత్పాతాలకు సిద్ధపడింది. గద్దెనెక్కగానే ఏం చేయబోతున్నానో...

తెలిసిన దయ్యమే కనుక, ప్రమాదం కూడా ఊహించినట్టుగానే ఉన్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోరాకడతో ప్రపంచం ఇప్పటికే ఉత్పాతాలకు సిద్ధపడింది. గద్దెనెక్కగానే ఏం చేయబోతున్నానో ఆయన ముందుగానే చెప్పాడు. అమెరికాకి మళ్ళీ ఔన్నత్యాన్ని అద్దడానికి, గతకాలపు కీర్తిని తెచ్చి తలకు చుట్టడానికి ఇంటాబయటా కూడా సమూల ప్రక్షాళనకు ఒడిగడతానని ప్రమాణం చేశారాయన. అందులో భాగంగా అగ్రరాజ్యానికి తలవంపులు తెచ్చే వెకిలిపనులకు కూడా ఆయన వెనుకాడడం లేదు.

పన్నులు, సుంకాలతో ఆయన మిత్రులనూ, శత్రువులనూ ఉక్కిరిబిక్కిరి చేయడం ఆరంభించారు. అక్రమవలసదారులను కట్టకట్టి సైనిక విమానాల్లోకి తోసి సరిహద్దులను దాటించేస్తున్నారు. అనాదిగా అమెరికాతో అనుబంధం ఉన్న కెనడా, మెక్సికోలమీద పాతికశాతం సుంకాలు విధించి, శత్రుదేశం చైనామీద ప్రస్తుతానికి పదిశాతంతో సరిపెట్టాడాయన. అరవైశాతం సుంకాలతో చైనాకు ఊపిరాడకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నా, ఎందుచేతనో వెనక్కుతగ్గారు. మెక్సికో దారికి వస్తున్నదనీ, సయోధ్య కుదిరితే సరేసరి, లేదంటే నెలరోజుల తరువాతైనా వాతలు తప్పవంటూ ఆ తరువాత ఆదేశాల అమలును వాయిదావేశారు ట్రంప్‌. అమెరికా అధ్యక్షుడి సుంకాలదాడికి ఈ మూడుదేశాలు చేతనైనమేరకు తక్షణ ప్రతీకారం తీర్చుకున్నాయి. అమెరికా తప్పుడు విధానాలమీద ప్రపంచ వాణిజ్యసంస్థలో అమీతుమీ తేల్చుకుంటానని చైనా అంటోంది. మొత్తానికి ట్రంప్‌ ఆరంభించిన వాణిజ్యయుద్ధం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలాదేశాల మార్కెట్‌ సూచీలు ఆదుర్దాగా కదులుతున్నాయి.


త్వరలోనే యూరోపియన్‌ యూనియన్‌ వంతు వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. అధ్యక్షుడి అంతిమలక్ష్యం మిగతాదేశాలను రాయబారానికి దించడం, లొంగివచ్చేవరకూ ఒత్తిడి పెంచడం కనుక ఈ వాణిజ్య యుద్ధానికి అంతా తయారుకాక తప్పదు. ఇప్పటికైతే భారతదేశం జోలికి రాకపోయినా, హర్లీడేవిడ్సన్‌ వంటి ఉదాహరణలతో, ఎత్తిపొడుపులతో, చిన్నాచితకా దాడితో ఆయన కార్యరంగాన్ని ఎప్పటినుంచో సిద్ధం చేసివుంచారు. ఆ విధానాలను కాస్తంత రుచిచూసిన అనుభవం కూడా ఉన్నది కనుక, ఏయే అంశాల్లో రాజీపడాలో, వేటిని రాజకీయంతో నెట్టుకురావాలో మనం గమనించుకోవాలి. ఈనెలలో మోదీ జరపబోయే అమెరికా పర్యటన, ఆలింగనం స్థాయికి ఎదిగిన ఇద్దరి స్నేహం ఈ విషయంలో ఎంతమేరకు ఉపకరిస్తుందో చూడాలి.


ట్రంప్‌ సుంకాల యుద్ధానికి మిగతాదేశాలు మొదట్లో కాస్తంత తడబడినా, త్వరితంగానే తట్టుకొని నిలబడతాయి, ఎదురొడ్డిపోరాడతాయి. పెంచిన సుంకాల దెబ్బకు సరుకుల రాకడ తగ్గి, ధరలు పెరిగి సామాన్య అమెరికన్‌కు సెగపుట్టడానికి కొంత సమయం పట్టవచ్చు. వలసజీవులమీద ఉక్కుపాదం మోపడం జనరంజకంగా ఉంటుందేమో కానీ, అమెరికా ఆర్థికాన్ని రక్షించదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ శ్రామికజనం లేనిదే దేశం కదలదని ట్రంప్‌కు మాత్రం తెలియదా? రియల్‌ ఎస్టేట్‌ సహా చాలా రంగాల్లోకి తన వ్యాపారసామ్రాజ్యాన్ని విస్తరించిన ట్రంప్‌కు ఖర్చుతక్కువ కూలీలు ఏ అడ్డామీద దొరుకుతారో అవగాహన ఉండదా?

ఈ ఏరివేతలు, తరలింపులు ఎంతకాలం, ఏ స్థాయిలో సాగుతాయో తెలియదు కానీ, గద్దెనెక్కిన కొద్దిరోజులకే ట్రంప్‌ వీరంగం అవధులు దాటిపోతోంది. ప్రజాస్వామ్యానికీ, భావస్వేచ్ఛకు పుట్టినిల్లని చెప్పుకొనే అమెరికా పునాది విలువలను ఆయన కుదిపేస్తున్నారు. ఏ ఆదర్శాలకు, ఆశయాలకు స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ ప్రతీగా నిలబడిందో వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పదిహేనునెలల గాజాయుద్ధంలో‍ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఎంత అమానవీయంగా వ్యవహరించారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అమెరికా, దాని మిత్రదేశాలు తప్ప, మిగతా ప్రపంచమంతా అక్కడ సాగిన మారణకాండకు తల్లడిల్లిపోయింది. ఈ యూదునాయకుడి ఆధ్వర్యంలో పాలస్తీనియన్ల ఊచకోతను అంతర్జాతీయ సంస్థలూ సంఘాలూ ఖండించాయి. తక్షణమే యుద్ధం ఆగాలనీ, ఆకలితో అల్లాడుతున్నవారికి అన్నం అందాలనీ ఘోషించాయి. అమెరికన్‌ యూనివర్సిటీల్లో గాజా ఊచకోతలకు వ్యతిరేకంగా విద్యార్థులు సాగించిన ఉద్యమం ఎలా చూసినా హద్దులు దాటిందేమీ లేదు. అమెరికా స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు ప్రతీకగా ఆ దేశానికి మంచిపేరు తెచ్చిందే తప్ప, అవమానించిందేమీ లేదు. కానీ, నిరసనల్లో పాల్గొన్నవారిని స్వదేశాలకు తిరిగి పంపించేయాలన్న ట్రంప్‌ నిర్ణయం ఇజ్రాయెల్‌ను సంతృప్తిపరచవచ్చు, నెతన్యాహూను మెప్పించవచ్చు కానీ, అమెరికాపరువు దిగజార్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 06:24 AM