కొత్త సీఈసీ
ABN, Publish Date - Feb 19 , 2025 | 04:15 AM
దాదాపు మూడేళ్ళపాటు భారత ఎన్నికల సంఘం సారథిగా ఉన్న రాజీవ్‌కుమార్ స్థానంలోకి జ్ఞానేశ్ కుమార్ వచ్చారు. సీఈసీగా జ్ఞానేశ్ పదోన్నతి పొందడంతో ఆ స్థానంలో...
దాదాపు మూడేళ్ళపాటు భారత ఎన్నికల సంఘం సారథిగా ఉన్న రాజీవ్‌కుమార్ స్థానంలోకి జ్ఞానేశ్ కుమార్ వచ్చారు. సీఈసీగా జ్ఞానేశ్ పదోన్నతి పొందడంతో ఆ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌జోషీ నియమితులైనారు. జ్ఞానేశ్‌కు ప్రమోషన్, మూడునెలల్లోనే హర్యానానుంచి జోషీని తెచ్చి ఈసీగా నియమించడం లక్ష్యంగా సోమవారం ఎంపిక కమిటీ భేటీ అయినప్పుడు విపక్షనాయకుడు రాహుల్ గాంధీ ఆ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదావేయాలని కోరారు. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం తొలిసారిగా ఈ ఎంపికలు ఉండబోతున్నందున, సెలక్షన్ ప్యానెల్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కోర్టు నిగ్గుతేల్చేవరకూ కొత్త సీఈసీపై నిర్ణయాన్ని వాయిదావేయాలన్నది రాహుల్ సూచన. కానీ, ఆయన మాటను లక్ష్యపెట్టకుండా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ రెండు పోస్టులు నింపేసినందుకు కాంగ్రెస్ ఆగ్రహిస్తోంది. త్రిసభ్య కమిటీ సమావేశంలో సమర్పించిన నోట్‌ను రాహుల్‌గాంధీ ప్రజాక్షేత్రంలో పెట్టి, ఇదేమి అన్యాయం అని ప్రశ్నిస్తున్నారు. అంతా బానే ఉంది కానీ, సదరు పిటిషన్ విచారణలో ఉన్నంతమాత్రాన నియామకాలు ఆపేయాలన్న నియమమేమీ లేదు. కొత్తచట్టం ప్రకారం నడవడానికి వీల్లేదనో, ఎంపికలు కూడదనో సుప్రీంకోర్టు చెప్పలేదు. పైపెచ్చు, పిటిషన్‌దారు చేసిన అటువంటి విన్నపాన్ని త్రోసిపుచ్చి, పరోక్షంగా మార్గాన్ని సుగమం చేసింది కూడా. రాహుల్ వాదనలో ఔచిత్యం లేకపోలేదు. కానీ, కేసు విచారణలో ఉన్నందున కాస్తంత ఓపికపడితే సరిపోతుందని, వ్యవస్థల ఔన్నత్యాన్నీ, మర్యాదలను కాపాడినట్టూ అవుతుందని ప్రభుత్వ పెద్దలు కూడా అనుకోవాలి కదా!
రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టును చూపి బెదిరిస్తున్నారు కానీ, అదేమీ హడావుడి పడటంలేదు. మోదీ ప్రభుత్వం తనకు నచ్చిన చట్టం చేసుకొని, మెచ్చినవారిని నియమించుకుంటున్నందుకు అభ్యంతరమూ లేదు. ప్రశాంత్‌భూషణ్ ఒత్తిడిచేస్తున్నా న్యాయమూర్తులు ప్రశాంతంగానే ఉన్నారు. బుధవారం కేసు విచారణ ఉండగా, సోమవారమే ఈ రెండు నియామకాలు జరిగిన విషయాన్ని ప్రశాంత్ భూషణ్ మంగళవారం మరోమారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వరుసలో నలభయ్యోస్థానంలో ఉన్న ఈ కేసు బుధవారం సైతం విచారణకు రాకపోవచ్చుననీ, ప్రాధాన్యత రీత్యా దానిని ముందుగానే చేపట్టాలని ఆయన విజ్ఞప్తిచేస్తే, రేపటి సంగతి రేపు చూద్దామని జస్టిస్ సూర్యకాంత్ తేల్చేశారు. ఇప్పటివరకూ మూడు నియామకాలు ఇదే తీరున జరిగిన విషయాన్ని కూడా పిటిషనర్ న్యాయమూర్తికి గుర్తుచేశారు. నిజానికి, ఫిబ్రవరి 12న జరగాల్సిన విచారణ19వతేదీకి వాయిదావేసినప్పుడే, అంతలోగా సీఈసీ నియామకం పూర్తయిపోతుందని పిటిషన్‌దారులు ఆందోళన వెలిబుచ్చారు. జరగాల్సింది జరుగుతుందనీ, అన్నీ అంతిమతీర్పుకు కట్టుబడి ఉంటాయని న్యాయమూర్తులు ఓ నామమాత్రపు హామీ ఇచ్చారు.
ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి నిర్దిష్టమైన చట్టం లేనందున, అది తయారయ్యేలోగా, ప్రధాన న్యాయమూర్తి కూడా భాగస్వామిగా ఉన్న ప్యానెల్ ద్వారా భర్తీ జరగాలని సుప్రీంకోర్టు 2023 మార్చిలో తీర్పు చెప్పింది. అదే ఏడాది చివర్లో కేంద్రప్రభుత్వం చట్టం చేసుకుంది, అందులో చీఫ్ జస్టిస్ స్థానంలోకి హోంమంత్రి వచ్చారు. తటస్థుడైన మూడో వ్యక్తికి చోటులేకపోయింది. చట్టం తయారైంది కానీ, సారాంశంలో సుప్రీంకోర్టు ఆశయమైతే అందులో మిగల్లేదు. ఎన్నికల కమిషనర్ల నియమకాలు అన్ని రకాల ప్రభావాలకు అతీతంగా, స్వతంత్రంగా, కార్యనిర్వాహక వ్యవస్థకూ, రాజకీయాలకూ అతీతంగా జరగాలన్నది ఆ తీర్పు సారాంశం. కానీ, ఉన్న ముగ్గురిలో ఇద్దరు అధికారపక్షంనుంచే ఉన్నప్పుడు విపక్షనేత మాట చెల్లుబాటయ్యే అవకాశమే ఉండదు. పైగా, ప్రజాస్వామ్యంలో అతిముఖ్యమైన ఎన్నికల ప్రక్రియను ఒత్తిళ్ళకు అతీతంగా నిర్వహించాల్సిన ముగ్గురు అధికారులను కమిటీలో ఉన్న ముగ్గురు రాజకీయ నాయకులు నియమించడం మరో విచిత్రం. అంతిమంగా ఈ ప్రక్రియకు గౌరవమే లేకుండా పోయింది. ఎన్నికల సందర్భంలో కమిషనర్ల నిర్ణయాలు వివాదాస్పదం కావడం నిత్యకృత్యమైంది. కొత్తచట్టం మీద సుప్రీంకోర్టు కొత్తగా ఏమి చెబుతుందో తెలియదు కానీ, ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిన జమ్మూకశ్మీర్‌ను చక్కబెట్టడం నుంచి, రామజన్మభూమి ట్రస్టు ఏర్పాటువరకూ ఎన్నో రాచకార్యాలను చక్కబెట్టిన జ్ఞానేశ్ కుమార్ ఆధ్వర్యంలో రాబోయే నాలుగేళ్ళలో ఇరవై అసెంబ్లీ ఎన్నికలు జరిగి, సార్వత్రక ఎన్నికలకు కూడా రంగం సిద్ధం కాబోతున్నది.
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Feb 19 , 2025 | 04:18 AM